Thursday, March 31, 2011

దేవాలయంలో ఇంకెవరికీ నమస్కరించకూడదా?

Thursday, March 31, 2011

దేవాలయంలో దైవ దర్శనానికి కూడా కొన్ని పధ్ధతులున్నాయి. వరుసగా గణపతి, ఉపాలయాలు, తర్వాత ప్రధాన దైవాలు. ప్రధాన దైవ దర్శనం తర్వాత, ఆ దైవాన్ని పూజించిన తర్వాత ఆ దైవానికన్నా శక్తివంతులు ఆ ఆలయంలో ఇంకెవరూ దర్శనీయులుగానీ, పూజనీయులుగానీ వుండరు. అందుకనే ఆ దైవంముందు ఇంకెవరికీ నమస్కరించకూడదు. కొందరు, పరిచయస్తులకీ, ప్రముఖులకీ, దేవాలయాల్లోకూడా నమస్కరిస్తారు. దైవం కన్నా అంతా అన్నివిధాలా చిన్నవారే. అందుకనే దైవం ముందు మానవులకు నమస్కరించటం ఇరువురికీ మంచిదికాదు. మరి ఎలాగండీ తెలిసినవారు కనిపిస్తే పలకరించవద్దా అంటారా? పలకరింపులకు అనేక మార్గాలున్నాయి…చేతులు జోడించి నమస్కారమే అక్కరలేదు.

కొందరు అక్కడవున్న అర్చకులపాదాలకు నమస్కరిస్తారు. అదికూడా మంచి పధ్ధతికాదు. నమస్కరించినవారు దైవంకన్నామానవులకు ఎక్కువ గౌరవాన్నిచ్చినట్లు..అలా చేయటంవల్ల వారికి పాపం. నమస్కారం అందుకున్నవారుకూడా దైవంకన్నా తాము అధికులమని అహంకరించినట్లు..వారికీ మంచిది కాదు. తప్పనిసరి పరిస్ధితుల్లో ఎవరికైనా నమస్కరించాల్సివస్తే అక్కడవున్న దైవం పేరు చెప్పి నమస్కరించాలి. అంటే ఆ నమస్కారం ఆ దైవానికే చెందుతుంది.

ఆలయాల్లోనేకాదు, కొన్ని ప్రధాన ఆలయాలున్న కొండలమీదకూడా…అంటే తిరుపతి, శ్రీశైలం లాంటి ఆధ్యాత్మికంగా మహోన్నతమైన ఆలయాలున్న కొండలమీద ఆ ఆలయాల్లోనే కాదు, ఆ కొండలమీదకూడా ఎవరికీ నమస్కరించకూడదు. అవసరమైనప్పుడు మార్గం వుందికదా..అక్కడి దైవం పేరుచెప్పి నమస్కరించాలి..అంటే వారిలోకూడా ఆ స్వామినే చూసి ఆ స్వామికి నమస్కరించినట్లు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



1 comments

Thursday, March 24, 2011

దేవాలయానికి తప్పనిసరిగా వెళ్ళాలా?

Thursday, March 24, 2011

చాలామందికి దేవాలయానికి వెళ్ళాలంటే అదో పెద్ద పనిష్ మెంట్ కింద అనుకుంటారు. మనసులో దేవుడంటే భక్తి వున్నా, నమ్మకం వున్నా, దేవాలయానికి వెళ్ళటమంటే అదో పెద్ద పనిగా బధ్ధకిస్తారు. పైగా దేవుడు మనలోనే వున్నాడు, మనింట్లోనూ వున్నాడు, ఎక్కడపడితే అక్కడ వున్నాడు..మళ్ళీ గుడిదాకా వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలా అని వాదిస్తారు. అలాంటివారికి ఒక్కటే సమాధానం. దేవాలయానికి వెళ్ళటంవల్ల అనేక ఉపయోగాలు వున్నాయి. అందుకని తప్పనిసరిగా వెళ్ళాలి. మీకు ఆలయాలంటే ఇంటరెస్టు ఎక్కువ, అందుకే అలా చెబుతారంటున్నారా? నాకే కాదు దేవాలయానికి వెళ్ళటంవల్ల వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకీ వచ్చే లాభాలేమిటో చెబుతాను.

దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ట సమయంలో కొన్ని యంత్రాలనుకూడా స్ధాపిస్తారు. వాటికీ, రోజూ పూజలందుకునే భగవంతుడికీ కొంత శక్తి వుంటుంది. మనం దైవ దర్శనం చేసుకున్నప్పుడు ఆ శక్తి మనకందుతుంది. (బయటకొచ్చి కండలు చూసుకోకండి ఎంత పెరిగాయో ఆ శక్తితో అని..). ఇంక అభయముద్రతో వున్న దైవ స్వరూపాన్ని చూసేసరికి మానసిక ప్రశాంతత ఏర్పడి, మన జీవిత బాటలో మనల్ని ఆదుకునేవారున్నారు అనే నమ్మకం, తద్వారా మనో బలం లభిస్తాయి. ఆధ్యాత్మకి ప్రశాంతత లభిస్తుంది. ఆలయంలో పైన వుండే కలశంద్వారా ప్రాణ శక్తి ఆ ఆవరణనీ, అందులోకి వెళ్ళినవారినీ ఉత్తేజ భరితుల్ని చేస్తుంది. ఈ విధంగా రకరకాల శక్తుల ప్రభావం అక్కడికెళ్ళినవారిమీద పడటంతో వారిలోని అనేక పాపాలు, దోషాలు పరిహరింపబడతాయి.

కొత్త ప్రదేశాలలో ఆలయాలకి వెళ్ళినప్పుడు అక్కడ చారిత్రాత్మక విషయాలు, పురాణగాధలు, అంతకుముందు అక్కడ నివసించిన మహనీయులు, అక్కడివారి ఆచార వ్యవహారాలు, శిల్ప కళలో వైవిధ్యాలు, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఇంట్లోనే వుంటే కూపస్ధ మండూకంలా ఒక పరిధిలోనే వుంటాయి మన ఆలోచనలు వగైరా.

ఇలా, ఏ విధంగా చూసినా ఆలయ దర్శనం వల్ల ఎవరికైనా ఉపయోగమే.

మనలో మాట

కొస మెరుపు

చిన్న చిన్న నష్టాలు కూడా వుంటాయండీ. మా ఆయన చెప్పులు నాలుగు సార్లు, మా చెల్లెలువి ఒకసారి పోయినయ్యి ఇప్పటిదాకా.

(ఆధారం..జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం)



0 comments

Sunday, March 20, 2011

కొంటె కోణాలు – 12

Sunday, March 20, 2011

స్క్రోలింగ్ మిక్స్

కొంటె కోణాలు లో జోక్స్ చెప్పి చాలా కాలమైంది కదా. ఈ మధ్య టీవీ సీరియల్స్ లో, ఏడుపులు కక్ష సాధించటాలు తప్పితే ఏమీ లేవు. న్యూస్ చూద్దామంటే ఏ ఛానల్ చూసినా నలుగురయిదుగురు కలిసి ఒకేసారి మాట్లాడుతున్నారాయె. న్యూస్ ఛానల్స్ చూసీ చూసీ ఈ మధ్య నా కో కొత్త జబ్బు పట్టుకుంది. ఎదుటివాళ్లు మాట్లాడింది నాకర్ధంకావాలంటే నలుగురయిదుగురు ఒకేసారి మాట్లాడాలి. పాపం మావారు ప్రతిసారీ నలుగురిని పట్టుకురాలేక ఇంట్లో న్యూస్ ఛానల్ చూడకూడదు అని ఆంక్షకూడా పెట్టారు.

న్యూస్ చూసి చాలా రోజులయిందండీ..ఒక్కయిదు నిముషాలు చూస్తానని ఆయన్ని బతిమాలి ఇవాళ పొద్దున్న 9-55 కి NTV పెట్టానండీ. నాలుగో నిముషం మీకు చెప్పటానికో కొంటె కోణం దొరికింది….

ఆ సమయంలో, ఆ ఛానల్ లో స్క్రోలింగ్ ఏమొచ్చిందో చూసి నవ్వొస్తే హాయిగా నవ్వేసెయ్యండి…

ఆంధ్ర ప్రదేశ్ లో నేను చేబట్టిన యాత్ర .. రామ్ దేవ్ (యాత్ర తరువాత ఏమిటో పూర్తి చెయ్యలేదు. వెంటనే వచ్చినది) …బెట్టింగ్ మేళా


0 comments

Thursday, March 17, 2011

కోపంనుంచి బయటపడటం ఎలా?

Thursday, March 17, 2011


మనిషన్న ప్రతివాడికీ కోపం వస్తుందండీ. అయితే కొందరికి చిన్న విషయాలకికూడా చాలా తీవ్ర స్ధాయిలో, కొందరయితే వారిని వారే మర్చిపోతారు. అపరిమితమైన కోపంతో బి.పీ. పెరిగిపోతుంది. దానితో కొందరు చేతికందిన వస్తువులు విసిరేస్తూవుంటారు. కోపంతో వూగి పోతున్నవాళ్ళని గమనించండి. వాళ్ళు ఏ పనీ చెయ్యలేరు. బుఱ్ఱ పని చెయ్యదు. సరైన ఆలోచనలు రావు. వాళ్ళ ఆలోచనలను వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఎదుటివాళ్ళని కొడదామని, ఒక్కొక్కసారి చంపుదామనికూడా అనుకోవటం కద్దు.

నిజమే. ఎదుటివాళ్ళమూలంగా మనం నష్టపోయినప్పుడే మనకంత కోపం వస్తుంది. వాళ్ళమూలంగా మనకి నష్టంగానీ, బాధగానీ కలిగివుండచ్చు. కానీ కోపంతో వూగిపోతే మనకి మనంకూడా నష్టం చేసుకుంటున్నాము. విపరీతమైన కోపంవల్ల అనేక రోగాలు బయటకొస్తాయి. బి.పీ. పెరుగుతుంది, కళ్ళు దెబ్బతింటాయి, కొందరికి హార్ట్ ఎటాక్ రావచ్చు.

అయితే ఈ కోపాన్ని ఎలా అధిగమించాలి. మొట్టమొదట చేయాల్సినపని మౌనం వహించాలి. కొంచెం సేపు ఏమీ మాట్లాడకుండావుంటే ఆవేశం తగ్గుతుంది. తర్వాత ఎదుటివారికి వారి తప్పు నెమ్మదిగా, వారికి అర్ధమయ్యేటట్లు సున్నితంగా చెప్పవచ్చు. చల్లని నీరు తాగి కొంచెం సేపు శ్రీరాముణ్ణి తలుచుకుని ఆయనకి నమస్కరించాలి. శ్రీరాముడు శాంత స్వరూపుడు. ఆయనని తల్చుకుంటే కోపం తగ్గిపోతుంది. శతృ ద్వేషం తగ్గుతుంది. మన ఆరోగ్యం బాగుండాలంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



2 comments

Saturday, March 12, 2011

ఇంట్లో దేవుడి విగ్రహాలను ఏ విధంగా కడగాలి?

Saturday, March 12, 2011


చాలామంది దేవుడి విగ్రహాలను ఇంట్లో పాత్రలు శుభ్రపరచుకునే సబ్బుతోనో, డిటర్జెంట్ పౌడర్ తోనో తోముతుంటారు. నిత్యం అభిషేకం చేసేవాటిని తోమక్కరలేకపోయినా, వెండి, రాగి మొదలగు కొన్ని లోహాలు తేమ గాలికి నల్లబడి, మెరుపు తగ్గుతాయి. అందుకని వాటిని తోమి శుభ్రపరచటం అవసరం.

అయితే విగ్రహాలకు మనం ప్రాణ ప్రతిష్టచేసి, అర్చన చేసి, నైవేద్యం పెడతాం. భగవంతుని శక్తి వాటిలో వుంటుంది. మరి వాటిని ఎలా పడితే అలా తోమెయ్యకూడదుకదా. మరెలా చెయ్యాలంటే ఆలయాల దగ్గర విభూతి వుండలు అమ్ముతూ వుంటారు. అవి తెచ్చి వాటితో వెండి విగ్రహాలను అతి సున్నితంగా పసి పిల్లలకు స్నానం చేయిస్తున్నట్లు జాగ్రత్తగా తోమాలి. అలాగే రాగివాటిని శనగపిండిలో పెరుగు వేసి దానితో తోమాలి. చింతపండు, నిమ్మకాయ వాడితే మరు రోజుకి నల్లబడతాయి. దేవుళ్ళ విగ్రహాలను సబ్బులు, యాసిడ్లు, డిటర్జంట్లతోకాకుండా పైన చెప్పిన విధంగా పసి పిల్లలకి స్నానం చేయిస్తున్నంత సున్నితంగా శుభ్రం చెయ్యాలి. అవి భగవత్ స్వరూపాలు మరి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



1 comments