మనిషన్న ప్రతివాడికీ కోపం వస్తుందండీ. అయితే కొందరికి చిన్న విషయాలకికూడా చాలా తీవ్ర స్ధాయిలో, కొందరయితే వారిని వారే మర్చిపోతారు. అపరిమితమైన కోపంతో బి.పీ. పెరిగిపోతుంది. దానితో కొందరు చేతికందిన వస్తువులు విసిరేస్తూవుంటారు. కోపంతో వూగి పోతున్నవాళ్ళని గమనించండి. వాళ్ళు ఏ పనీ చెయ్యలేరు. బుఱ్ఱ పని చెయ్యదు. సరైన ఆలోచనలు రావు. వాళ్ళ ఆలోచనలను వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఎదుటివాళ్ళని కొడదామని, ఒక్కొక్కసారి చంపుదామనికూడా అనుకోవటం కద్దు.
నిజమే. ఎదుటివాళ్ళమూలంగా మనం నష్టపోయినప్పుడే మనకంత కోపం వస్తుంది. వాళ్ళమూలంగా మనకి నష్టంగానీ, బాధగానీ కలిగివుండచ్చు. కానీ కోపంతో వూగిపోతే మనకి మనంకూడా నష్టం చేసుకుంటున్నాము. విపరీతమైన కోపంవల్ల అనేక రోగాలు బయటకొస్తాయి. బి.పీ. పెరుగుతుంది, కళ్ళు దెబ్బతింటాయి, కొందరికి హార్ట్ ఎటాక్ రావచ్చు.
అయితే ఈ కోపాన్ని ఎలా అధిగమించాలి. మొట్టమొదట చేయాల్సినపని మౌనం వహించాలి. కొంచెం సేపు ఏమీ మాట్లాడకుండావుంటే ఆవేశం తగ్గుతుంది. తర్వాత ఎదుటివారికి వారి తప్పు నెమ్మదిగా, వారికి అర్ధమయ్యేటట్లు సున్నితంగా చెప్పవచ్చు. చల్లని నీరు తాగి కొంచెం సేపు శ్రీరాముణ్ణి తలుచుకుని ఆయనకి నమస్కరించాలి. శ్రీరాముడు శాంత స్వరూపుడు. ఆయనని తల్చుకుంటే కోపం తగ్గిపోతుంది. శతృ ద్వేషం తగ్గుతుంది. మన ఆరోగ్యం బాగుండాలంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)
2 comments:
ఈ చిట్కాలని పాటిస్తూ అప్పుడప్పుడు కోపంపై నేను విజయాన్ని సాధిస్తున్నానండి:)
శభాష్ పద్మార్పితగారూ
psmlakshmi
Post a Comment