Thursday, November 27, 2008

కార్తీక దీపాలు

Thursday, November 27, 2008
అమరావతిలో శివలింగం ఆకారంలో దీపాలు (మా కోటా కాదండోయ్)
శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం, సామర్లకోట, తూ.గో.జిల్లా

శక్తీశ్వరస్వామి దేవాలయం లో కార్తీక దీపాల కళకళ (యనమదుర్రు, ప.గో.జిల్లా)

పంచముఖ అమృతలింగేశ్వరస్వామి, కోటిలింగ మహా శివ క్షేత్రం -- అభిషేకము
కోటిలింగక్షేత్రం, ముక్త్యాలలో శివలింగ ప్రతిష్ట
కోటిలింగ క్షేత్రంలో కార్తీక దీపాలు -- క్రింద రెండు ఫోటోలు కూడా

కార్తీక దీపాలు

చిన్నప్పుడెప్పుడో అమ్మమ్మతో కార్తీకమాసం తెల్లవారుఝామున చలిలో తెనాలిలో కాలువలో స్నానంచేసి దీపాలు పెట్టటం నేను ఇప్పటికీ మరచిపోలేని ఒక అందమైన అనుభూతి. అరటిదొప్పలో పెట్టిన దీపాలు కాలువలో అలా అలా కదలివెళ్తుంటే ఎంత అందంగా వుంటుందో సినిమాల్లో కాకుండా నిఝంగా మీరెప్పుడన్నా చూశారా? తర్వాత కాలంలో అనేక భవసాగరాలవల్ల కార్తీకమాసంలో ఎప్పుడైనా ఆ అందమైన స్మృతులు గుర్తుచేసుకోవటంతప్ప కార్తీకమాస అనుభూతులు ఇంకేమీ పొందలేకపోయాను. ఈ ఏడాది పదవీ విరమణ చేయటంవల్ల ఉత్సాహం ఉరకలువేసి కార్తీక మాసం మొదట్లోనే కూర్చున్నదానికి కూర్చున్నట్లు ఈ కార్తీకమాసంలో 108 శివ లింగాల దగ్గర 108 దీపాలు పెట్టాలనే ఆలోచన వచ్చేసింది. నాచేత ఇలాంటి పనులు చేయించే ఉద్దేశ్యంతోనే అనుకుంటా ఆ భగవంతుడు మా ఆయన్ని మంచివాడుగా పుట్టించాడు. నేనీమాట చెప్పగానే ఊళ్లో గుళ్ల జాబితా తయారుచెయ్యటం మొదలుపెట్టారు. మరి 108 లింగాలు కావాలి కదా. మర్నాడు పొద్దున్నే ఆయన ఆఫీసుకెళ్ళేలోపల దగ్గరలో వున్న మూడు గుళ్ళకి తీసుకెళ్ళారు. ఎక్కడెక్కడున్న గుళ్ళనూ గుర్తు తెచ్చుకుంటుంటే జనవరిలో చూసి వచ్చిన జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల లో నిర్మంపబడుతున్న కోటిలింగ క్షేత్రం గుర్తొచ్చింది మా వారికి. అక్కడ పంచముఖ శివునితోబాటు కోటి శివ లింగాలను ప్రతిష్టించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. (దీని గురించి వేరే చెప్తాను). వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి గుళ్ళో ప్రతిష్ట జరిగిందా అని అడిగారు. జరిగింది, లింగ ప్రతిష్టలు కూడా చాలా జరిగాయి, ఇంకా రోజూ జరుగుతున్నాయి అన్నారు. 108 లింగాల కోసం 108 చోట్లకి వెళ్ళటం కష్టం అందుకని ముక్త్యాల వెళ్దాం, నీ ఇష్టం వచ్చినన్ని దీపాలు పెట్టుకోవచ్చు అన్నారు. ఇంక ఆలస్యం దేనికని 1-11-2008 న మేమిద్దరమూ, స్నేహితురాళ్ళు సుజాత, సక్కు, పద్మిని బయల్దేరాము. జగ్గయ్యపేట లో హోటల్ లో గది తీసుకుని కొంచెం సేద తీరిన తర్వాత బయల్దేరాము.

మొదటి మజిలీ ముక్త్యాల లో ముక్తేశ్వర స్వామి గుడి. అక్కడ సాయంకాలం 365 వత్తులతో దీపం పెట్టాను. అక్కడనుంచి ముక్త్యాలలోనే వున్న శ్రీ కోటిలింగ మహా శివ క్షేత్రం లో కొలువైన శ్రీ పంచముఖ అమృత లింగేశ్వర స్వామి ఆలయం మా తర్వాత మజిలీ. ఈ క్షేత్రం ఇంకా నిర్మాణ దశలో వున్నది. మధ్యలో ప్రధాన ఆలయంలో శ్రీ పంచ ముఖ అమృత లింగేశ్వర స్వామి, చుట్టూ 108 దేవతా మూర్తులకు చిన్న దేవాలయాలేకాక కోటి శివ లింగాలను ప్రతిష్టించాలని సంకల్పం. ప్రధాన దేవాలయం, కొన్ని దేవతా మూర్తుల గుళ్ళు, వేలల్లో శివలింగాల ప్రతిష్ఠ జరిగింది. మిగతా పని సాగుతోంది. ఇక్కడ 108 శివ లింగాల దగ్గర 108 దీపాలు స్నేహితురాళ్ళ సహాయంతో నేను వెలిగించాను. మా వాళ్ళు కూడా కొన్ని దీపాలు వెలిగించారు. ఎంత బాగున్నాయో ఫోటోలో చూడండి.

మర్నాడు నాగుల చవితి. వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుళ్ళో కృష్ణా నదీ స్నానం, స్వామి దర్శనం, దీపారాధన, ముక్త్యాల ముక్తేశ్వరస్వామి గుళ్ళో వున్న పురాతన పుట్టలో పాలు పోద్దామనే ఉత్సాహంతో పూజ చేశాముగానీ పాలు పోయటానికి సైన్సు అడ్డు వచ్చింది. ఈ కార్యక్రమం మానేసి కూడా చాలా ఏళ్ళయింది. ఓపిక, తీరిక వుంటే ఇంట్లోనే చెయ్యటం, లేకపోతే ఒక దణ్ణం. అందుకని ఇంతా వెళ్ళానుకదాని శాస్త్రానికి ఒక చుక్క పోసి అక్కడనుండి కోటిలింగ క్షేత్రానికి వచ్చాము. అక్కడ లింగ ప్రతిష్ట చేసి అభిషేకము చేయించాము. (693 రూ. లు కడితే మనచేత లింగ ప్రతిష్ట చేయిస్తారు) ఫోటోలో ఆ దేవుణ్ణి మీరు కూడా చూడండి.


ఓహో, కార్తీక మాస ప్రారంభం చాలా బాగుంది, కష్టమనుకున్న పని వెంటనే సునాయాసంగా చేసేశామని రెట్టించిన ఉత్సాహంతో పంచారామాలతోపాటు ఈ నెలలోనే ఇంకో 40 (శివ, కేశవ, అమ్మవారి) గుళ్ళల్లో వీలైనన్ని పూజలూ, దీపాలూ. కొన్ని ఫోటోలు మీరూ చూడండి.






































































































































































































































































0 comments: