Wednesday, August 11, 2010

నరకం చూసొచ్చాను

Wednesday, August 11, 2010


 నిఝంగా నిజమండీ.  3 నెలలు నరకంలో వుండి ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నా.  పాపం అక్కడ నా గోల భరించలేక యమధర్మరాజుగారు త్వరగా పంపించారనీ, లేకపోతే ఈతరహాలో నరకానికి వెళ్ళేవాళ్ళు ఏళ్ళ తరబడి అక్కడే వుంటారనీ కొందరి ఉవాచ.  ఏమిటీ అర్ధంకాని గోల సరిగ్గా అఘోరించు అంటారా 

3 నెలలుగా కాళ్ళు నేలమీద పెట్టాలంటే నిప్పులమీద పెట్టినట్లు భరించలేని మంటలు,  కన్ను మూసి తెరిచేలోగా అరికాళ్ళల్లో,  పక్కలనా అంగుళం పైన పగుళ్లు, చాలా లోతుగా, కొన్ని రక్తం కారుతూ, ఎలా వస్తున్నాయో తెలియదు, ఎందుకు వస్తున్నాయో తెలియదు.  పాదాలలో కాలిన బొబ్బల్లా రావటం, అవి పగలటం.  ఎంత భయంకరమో అనుభవిస్తేనే తెలుస్తుంది.  అడుగు తీసి అడుగు వెయ్యలేను.  ఇదే సమయంలో శ్రీవారికి మీటిగుల హడావిడి.  పగలంతా ఇంట్లో ఒక్కదాన్ని.  ఎవరొచ్చినా తలుపు తియ్యాలన్నా నా నరక బాధలు నాకన్నా ముందు రెడీ. 

పాదాలు చాలవన్నట్లు ఆ పగుళ్ళు అరి చేతుల్లోనూ రావటం మొదలయ్యాయి.  ఏమీ పట్టుకోలేను, తిన లేను, ఏ పనీ చెయ్యలేను.   పదేళ్ళనుంచీ ఇంగ్లీషు మందు వాడటంలేదు.  హెర్బల్ మెడిసన్ శ్రీ యోగానంద్ గారి దగ్గరే.  ముందు మామూలు పగుళ్ళే అని అశ్రధ్ధ చేసి దాదాపు నెల తర్వాత ఆయన దగ్గరే మందు వాడటం మొదలు పెట్టాను. 

మందు మరగ కాచి, దానిలో వేరే పదార్ధాలు కలిపి రోజుకు నాలుగు సార్లు తీసుకోవాలి.  పై పూతకి వేరే మందు నువ్వుల  నూనె లో కలిపి రాయాలి.  ఆ నూనె, మందు, బాధ చికాకుతో కాళ్ళు ఇంకో కుర్చీలో జాపి అలాగే కూర్చునేదాన్ని.  ఏక్టివ్ గా తిరిగే దానికి రోజుల తరబడి అలా ఒకే చోట కదలకుండా వుండటంకన్నా నరకం వుంటుందా.  అందరి దిష్టికొట్టి ఇలా మూలనబడ్డానా అనే ఒక నమ్మలేని అనుమానం.

పగుళ్ళు తగ్గితే పాత అట్టముక్కల్లా చర్మం పెచ్చులూడి వచ్చేసేది.  ఇంతలో ఇంకో చోట పగుళ్ళు.  అరికాళ్ళల్లో పొట్టు లేచి పోవటం, ఎన్ని పొరల చర్మం వూడి పోయిందో.... ఇవీ సరిపోవని ఒళ్ళంతా రేష్, దురద.  అసలు మామూలు మనిషినవుతానా అని అనుమానం.  ఓహ్.  చెప్పటం చేత కావటంలేదు.  చాలా తక్కువ చెప్పాను.

పుండుమీద కారం జల్లినట్లు నెట్ లో చూస్తే ఇవి ఎందుకు వస్తున్నాయో తెలియదనీ, వస్తే తొందరగా తగ్గవనీ, మళ్ళీ మళ్ళీ వస్తాయనీ  తెలిసింది.  ఇంకో వార్త మా బంధువులలో ఒకరు 4 ఏళ్ళనించీ, ఇంకొకరు ఏడాది పైనుంచీ  ఈ బాధ పడుతున్నారనీ,  ఇంకా తగ్గలేదనీ, వాళ్ళు ఇంగ్లీషు మెడిసన్ వాడుతున్నారనీ తెలిసింది.  అందుకే ఒకసారి ఈ నరకంలోకి వెళ్ళినవాళ్ళు తొందరగా బయటకి రారని అన్నది.

నాకు శ్రీ యోగానంద్ గారి మీద వున్న నమ్మకం వల్ల నా అంతటనేను ఇంకొక డాక్టరు దగ్గరకు వెళ్ళలేదు.  నా బాధ తట్టుకోలేక నా శాయ శక్తులా ఆయన్ని హింసించాను.  నాలాంటివాళ్ళని ఎంతమందినో చూసుంటారాయన.  చలించలేదు.  తగ్గుతుంది అనే భరోసా మానలేదు.  అలాగే ఒక వారం రోజుల నుంచి మంటలు తగ్గటం మొదలయ్యాయి.  పగుళ్ళు కూడా తక్కువ లోతులో రావటం, తొందరగా తగ్గటం జరగుతోంది.  ఒంటినిండా వచ్చిన రేష్ పూర్తిగా తగ్గింది.  దాని మచ్చలు తగ్గాలి ఇంకా.

ఇవి ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ వస్తూనే వుంటాయిట.  చూద్దాం మరి.  అసలు తగ్గటడం మొదలయింది కదా,  సాంతం తగ్గుతాయనే భరోసా శ్రీ యోగనంద్ గారిచ్చారయ్యే.   ఇంట్లో నడుస్తుంటే కొంచెం ధైర్యం వచ్చింది.  శ్రీమతి మాలా కుమార్ ఫోన్ చేసి మరీ ప్రమదావనం సందడి వినిపించి  స్ధైర్యాన్నిచ్చారు.  ఇంతకాలం కంప్యూటర్ తెరవాలన్నా విసుగనిపించింది.  కానీ ఇవాళ నా అవస్ధ అందరితో పంచుకోవాలనిపించింది.  అంటే నా బాధ చెప్పాలని కాదు.  ఎవరికైనా ఇలాంటి బాధ ఎదురయితే (ఇప్పుడు భగవంతుడు నాకు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, ఈ బాధని ప్రపంచంలోంచే తీసెయ్యమని కోరుకుంటాను....కనుక ఎవరికీ ఇది రాకూడదు) అశ్రధ్ధ చెయ్యకుండా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోండి. 

ముందు నాకు అర్జంటుగా తగ్గి, అంతకన్నా అర్జంటుగా నా యాత్రలు మొదలెట్టాలని  కోరుకోండి.

15 comments:

Rajasekharuni Vijay Sharma said...

మీకు ఉపశమనం త్వరలోనే కలుగుతుంది. ధైర్యంగా ఉండండి. కష్టంలో ఉన్నప్పుడు కూడా మనం భగవంతుడిని మనసారా ప్రార్థించడానికి సంశయిస్తాం. మీరు అలా వెనకాడక భగవన్నామ స్మరణ చేస్తూ ఉండండి. దానిని తట్టుకునే శక్తి కలుగుతుంది. మీ తరపున నేను కూడా రేపు ఉదయం ప్రార్థిస్తాను.

Anonymous said...

ma attagariki kuda undi andi,inka taggaledu,meru use chese medicine cheppara, please

కొత్త పాళీ said...

అయ్యో, చాలా బాధ పడ్డారండీ.
కోలుకుంటున్నందుకు సంతోషం. తగ్గిపోతుంది అన్న నమ్మకం మనసులో బలంగా ఉండడం కూడా చాలా ముఖ్యమే.

చిలమకూరు విజయమోహన్ said...

పూర్తిగా నయమవుతుందిలెండి. వైద్యునిపైన నమ్మకం,విశ్వాసం ఉంటే తప్పక ఫలితం కనపడుతుంది.
శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం
జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిః

psm.lakshmi said...

విజయ్ శర్మ గారూ
కృతజ్ఞురాలిని. నేనూ దైవాన్ని నమ్మేదాన్నే. దైవం ప్రత్యక్షమై వరాలిచ్చేస్తాడు అనేదానికన్నా, మనకి ఆత్మధైర్యాన్నిస్తాడు, సరైన మార్గాన నడిపిస్తాడు అనే నమ్మకం ఎక్కువ. నేను తిరిగి మామూలు మనిషిని కావటానికి దైవం కూడా ఒక కారణమే.
psmlakshmi

psm.lakshmi said...

దివ్యగారూ,
మీరు హైదరాబాదులో వుండేవారైనా, హైదరాబాదులో మీ అత్తగారిని చూపించి మందు తీసుకోగల సౌకర్యం వున్నా నా మైల్ అడ్రస్ కింద ఇస్తున్నా. దానికి మైల్ చెయ్యండి. పూర్తి వివరాలు చెప్తాను. శ్రీ యోగానంద్ గారు ప్రతి ఆదివారం మందు ఇస్తారు. ఎవరి దగ్గరనుంచీ ఒక్క పైసా కూడా తీసుకోరు. వారానికి ఒకసారే కనుక జనం ఎక్కువ వుంటారు, నిరీక్షణ సమయం కనీసం 2, 3 గంటలు పడుతుంది. ఆ మందులతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ వుండవు. వాటితో అలవాటైన ఇంగ్లీషు మందులు వాడచ్చుగానీ, హోమియోపతి వాడకూడదు.
psmlakshmi
psmlakshmi1202@gmail.com

psm.lakshmi said...

కొత్తపాళీగారూ, చిలమకూరు విజయమోహన్ గారూ
ధన్యవాదాలు.
psmlakshmi

చెప్పాలంటే...... said...

tondaragaa taggi poyi malli mi yaatralu modalu petti maaku vishyaalu cheppalani ....anukuntu

మాలా కుమార్ said...

లక్ష్మి గారు ,
మీకు తగ్గుతున్నందుకు సంతోషమండి .
పూర్తిగా తగ్గి , త్వరలోనే మీరు చేయ బోయే వైష్ణవ దేవి యాత్రను ఎంజాయ్ చేస్తారండి . బెస్ట్ ఆఫ్ లక్ .

నీహారిక said...

మీకో సంగతి తెలుసా, మనకి ఇష్టమైన పనులు చేయనివ్వకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, మనం ఎంతవరకు వాటిని తట్టుకుని ముందుకు సాగుతామో, మనకే తెలిసిపోతుంది. అదే మనోబలమంటే!
ధైర్యంగా ఉండండి.

శ్రీలలిత said...

మీరు తొందరలోనే పూర్తిగా కోలుకుని, మీరు చేయాలనుకుంటున్న యాత్రలన్నీ శుభప్రదంగా పూర్తిచేయాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. (ఆ యాత్రల వల్ల కలిగే పుణ్యం లో కాస్త భాగం మాకూ పంచుతారనే స్వార్ధం కూడా వుందండోయ్.)

జ్యోతి said...

లక్ష్మిగారు,మీరు త్వరగా కోలుకుని వైష్ణోదేవిని దర్శించి వచ్చాక చెప్పండి. ఇంటికి వచ్చి ప్రసాదం తీసుకుంటాను. మీ మనోబలం ఇలాగే సడలనివ్వకండి. ఈ జబ్బులు అవే పారిపోతాయి..

psm.lakshmi said...

చెప్పాలంటే, మాలా కుమార్, నీహారిక, శ్రీ లలిత, జ్యోతీ,
అందరికీ ధన్యవాదాలు. ఈ నెల 28 నుంచీ వచ్చేనెల 8 దాకా ఢిల్లీ, వైష్ణోదేవి దాకా ప్లాను చాలా కాలం క్రితమే వేసుకుని రిజర్వు చేయించికున్నాము. మొన్నటిదాకా వెళ్ళగలనా లేనా అనే భయం. మా డాక్టరుగారి అభయం. ఇప్పుడు మూడు వంతులు వెళ్దామని, ఒక వంతు చూద్దాం అని. మనసు మాత్రం వెళ్ళమనే చెబుతోంది. నడవలేకపోతే బస్ లోనే కూర్చుందాంలే అని ఒక మొండితనం. సెప్టెంబర్ 10 తర్వాత చెబుతా ఏమి చేశామో. వెళ్తే 8 రాత్రికి తిరిగి వస్తాము.
22 నుంచీ మా వారు ఆఫీసు మీటింగులకోసం ముందే ఢిల్లీ వెళ్తున్నారు గనుక నేను కేర్ ఆఫ్ మా అబ్బాయి, వరంగల్ లో. 28 కాజీపేటలో ఢిల్లీ రైలెక్కుతాను.
జ్యోతీ, తప్పకుండా రండి. చాలా సంతోషం.
psmlakshmi

భావన said...

లక్ష్మి గారు, మీరు త్వర గా కోలుకోవాలని మన్స్పూర్థి గా కోరుకుంటున్నా. మా అక్క కు కూడా ఇలానే వచ్చిందండి. కాని ఇంత సివియర్ గా కాదు. ఇంగ్లీష్ మందులు వాడింది. నీళ్ళలో చేతులు పెట్టవద్దు అన్నారు. ఎలా మేనేజ్ చేసేరండి. మీ మనోధైర్యం ఎప్పటీకి అలా నిలిచి మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా.

Unknown said...

Namaskaram,
Today I have gone through your blog & noted the contents regarding your yatra special & felt very happy.On observing your experience I felt unhappy for that I could not visit most of them.both of you are very lucky for having visited such a famous places by the grace of God.
Further it is painful to note about your "NARAKA YATANA" in detail as experienced by you,as noted therein.Further I wish that you will be recovered soon & continue your yatra programe's by the grace of sri Bhuneshwari mata.
UMA MAHESHWAR RAO