Thursday, November 27, 2008

కార్తీక దీపాలు

Thursday, November 27, 2008
అమరావతిలో శివలింగం ఆకారంలో దీపాలు (మా కోటా కాదండోయ్)
శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం, సామర్లకోట, తూ.గో.జిల్లా

శక్తీశ్వరస్వామి దేవాలయం లో కార్తీక దీపాల కళకళ (యనమదుర్రు, ప.గో.జిల్లా)

పంచముఖ అమృతలింగేశ్వరస్వామి, కోటిలింగ మహా శివ క్షేత్రం -- అభిషేకము
కోటిలింగక్షేత్రం, ముక్త్యాలలో శివలింగ ప్రతిష్ట
కోటిలింగ క్షేత్రంలో కార్తీక దీపాలు -- క్రింద రెండు ఫోటోలు కూడా

కార్తీక దీపాలు

చిన్నప్పుడెప్పుడో అమ్మమ్మతో కార్తీకమాసం తెల్లవారుఝామున చలిలో తెనాలిలో కాలువలో స్నానంచేసి దీపాలు పెట్టటం నేను ఇప్పటికీ మరచిపోలేని ఒక అందమైన అనుభూతి. అరటిదొప్పలో పెట్టిన దీపాలు కాలువలో అలా అలా కదలివెళ్తుంటే ఎంత అందంగా వుంటుందో సినిమాల్లో కాకుండా నిఝంగా మీరెప్పుడన్నా చూశారా? తర్వాత కాలంలో అనేక భవసాగరాలవల్ల కార్తీకమాసంలో ఎప్పుడైనా ఆ అందమైన స్మృతులు గుర్తుచేసుకోవటంతప్ప కార్తీకమాస అనుభూతులు ఇంకేమీ పొందలేకపోయాను. ఈ ఏడాది పదవీ విరమణ చేయటంవల్ల ఉత్సాహం ఉరకలువేసి కార్తీక మాసం మొదట్లోనే కూర్చున్నదానికి కూర్చున్నట్లు ఈ కార్తీకమాసంలో 108 శివ లింగాల దగ్గర 108 దీపాలు పెట్టాలనే ఆలోచన వచ్చేసింది. నాచేత ఇలాంటి పనులు చేయించే ఉద్దేశ్యంతోనే అనుకుంటా ఆ భగవంతుడు మా ఆయన్ని మంచివాడుగా పుట్టించాడు. నేనీమాట చెప్పగానే ఊళ్లో గుళ్ల జాబితా తయారుచెయ్యటం మొదలుపెట్టారు. మరి 108 లింగాలు కావాలి కదా. మర్నాడు పొద్దున్నే ఆయన ఆఫీసుకెళ్ళేలోపల దగ్గరలో వున్న మూడు గుళ్ళకి తీసుకెళ్ళారు. ఎక్కడెక్కడున్న గుళ్ళనూ గుర్తు తెచ్చుకుంటుంటే జనవరిలో చూసి వచ్చిన జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల లో నిర్మంపబడుతున్న కోటిలింగ క్షేత్రం గుర్తొచ్చింది మా వారికి. అక్కడ పంచముఖ శివునితోబాటు కోటి శివ లింగాలను ప్రతిష్టించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. (దీని గురించి వేరే చెప్తాను). వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి గుళ్ళో ప్రతిష్ట జరిగిందా అని అడిగారు. జరిగింది, లింగ ప్రతిష్టలు కూడా చాలా జరిగాయి, ఇంకా రోజూ జరుగుతున్నాయి అన్నారు. 108 లింగాల కోసం 108 చోట్లకి వెళ్ళటం కష్టం అందుకని ముక్త్యాల వెళ్దాం, నీ ఇష్టం వచ్చినన్ని దీపాలు పెట్టుకోవచ్చు అన్నారు. ఇంక ఆలస్యం దేనికని 1-11-2008 న మేమిద్దరమూ, స్నేహితురాళ్ళు సుజాత, సక్కు, పద్మిని బయల్దేరాము. జగ్గయ్యపేట లో హోటల్ లో గది తీసుకుని కొంచెం సేద తీరిన తర్వాత బయల్దేరాము.

మొదటి మజిలీ ముక్త్యాల లో ముక్తేశ్వర స్వామి గుడి. అక్కడ సాయంకాలం 365 వత్తులతో దీపం పెట్టాను. అక్కడనుంచి ముక్త్యాలలోనే వున్న శ్రీ కోటిలింగ మహా శివ క్షేత్రం లో కొలువైన శ్రీ పంచముఖ అమృత లింగేశ్వర స్వామి ఆలయం మా తర్వాత మజిలీ. ఈ క్షేత్రం ఇంకా నిర్మాణ దశలో వున్నది. మధ్యలో ప్రధాన ఆలయంలో శ్రీ పంచ ముఖ అమృత లింగేశ్వర స్వామి, చుట్టూ 108 దేవతా మూర్తులకు చిన్న దేవాలయాలేకాక కోటి శివ లింగాలను ప్రతిష్టించాలని సంకల్పం. ప్రధాన దేవాలయం, కొన్ని దేవతా మూర్తుల గుళ్ళు, వేలల్లో శివలింగాల ప్రతిష్ఠ జరిగింది. మిగతా పని సాగుతోంది. ఇక్కడ 108 శివ లింగాల దగ్గర 108 దీపాలు స్నేహితురాళ్ళ సహాయంతో నేను వెలిగించాను. మా వాళ్ళు కూడా కొన్ని దీపాలు వెలిగించారు. ఎంత బాగున్నాయో ఫోటోలో చూడండి.

మర్నాడు నాగుల చవితి. వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుళ్ళో కృష్ణా నదీ స్నానం, స్వామి దర్శనం, దీపారాధన, ముక్త్యాల ముక్తేశ్వరస్వామి గుళ్ళో వున్న పురాతన పుట్టలో పాలు పోద్దామనే ఉత్సాహంతో పూజ చేశాముగానీ పాలు పోయటానికి సైన్సు అడ్డు వచ్చింది. ఈ కార్యక్రమం మానేసి కూడా చాలా ఏళ్ళయింది. ఓపిక, తీరిక వుంటే ఇంట్లోనే చెయ్యటం, లేకపోతే ఒక దణ్ణం. అందుకని ఇంతా వెళ్ళానుకదాని శాస్త్రానికి ఒక చుక్క పోసి అక్కడనుండి కోటిలింగ క్షేత్రానికి వచ్చాము. అక్కడ లింగ ప్రతిష్ట చేసి అభిషేకము చేయించాము. (693 రూ. లు కడితే మనచేత లింగ ప్రతిష్ట చేయిస్తారు) ఫోటోలో ఆ దేవుణ్ణి మీరు కూడా చూడండి.


ఓహో, కార్తీక మాస ప్రారంభం చాలా బాగుంది, కష్టమనుకున్న పని వెంటనే సునాయాసంగా చేసేశామని రెట్టించిన ఉత్సాహంతో పంచారామాలతోపాటు ఈ నెలలోనే ఇంకో 40 (శివ, కేశవ, అమ్మవారి) గుళ్ళల్లో వీలైనన్ని పూజలూ, దీపాలూ. కొన్ని ఫోటోలు మీరూ చూడండి.






































































































































































































































































0 comments

Friday, November 21, 2008

దిక్కుతోచని యముడు

Friday, November 21, 2008
దిక్కు తోచని యముడు

స్వర్గం మూసేశారు. ఒక్క కేసు కూడా రావటంలేదని. నరకంలో మాత్రం జనం కిటకిటలాడుతున్నారు. అప్పటికే గవర్నమెంటువారి సిటీ బస్ లో లాగా కెపాసిటీకన్నా ఎక్కువమందినే కూరారు. అక్కడికీ యమధర్మరాజు అర్జంటుకేసులు తప్పితే తీసుకోవద్దని భటులకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అలా తీసుకువచ్చిన వాళ్ళని భూలోకానికి పంపిస్తాననేసరికి యమభటులు హడలిపోయి భూలోకంలో ఎంత పెద్ద ప్రమాదాలు జరిగినా, ఎన్ని లక్షల ఆస్తి నష్టమయినా మనుషుల ప్రాణాలు మాత్రం దగ్గరుండి జాగ్రత్తగా కాపాడుతున్నారు. అర్జంటు కేసులకి కూడా స్ధలం చూపించలేక యముడు తికమక పడుతూ, ఆకేసులకు కారణభూతులయిన కల్తీదారులనీ, అతివృష్టి అనావృష్టులనూ ఛడామడా తిడుతున్నాడు. అక్కడికీ వరుణుడికి ఇంటర్ ఆఫీసు మెమో ఒకటిచ్చాడు. అతివృష్టినీ, అనావృష్టినీ తగ్గించమని. ఎంతకాలం చూసినా రిప్లయి రాకపోయేసరికి బ్రహ్మదేవుడికి ఒక అప్లికేషన్ వెట్టాడు. సృష్టిని కొంతకాలం ఆపమనీ లేకపోతే చాలా ఘోరాలు జరుగుతాయనీ.

బ్రహ్మదేవుడు అసలే భూలోకంలో గవర్నమెంటువారు కుటుంబనియంత్రణపట్ల చూపే శ్రధ్ధచూసి విసుక్కుంటున్నాడు. వున్నవాళ్ళకి కూడు పెట్టటం చేతకాక నేనిచ్చిన అనేక వనరులను సరిగా వుపయోగించుకోలేక వాళ్ళ చచ్చు మేధస్సును వుపయోగించి వున్న వాటిని కలుషితం చేసుకుంటున్నారని అక్కడికీ ప్రముఖులందరికీ కలలో స్వయంగా కనబడి చెప్పారుట ఈ ప్రయత్నాలు మానమని. కానీ అంతా అయ్యో బ్రహ్మగారు స్వయంగా వచ్చారే అని కనీసం నమస్కారమైనా చేయకపోగా పై వాళ్ళ ఆర్డర్స్ మేమీ విషయంలో మీకేమీ సహాయం చేయలేమని నిర్మొహమాటంగాచెప్పి వెంటనే ముసుగుతన్ని పడుకున్నారుట. పోనీ ఆపై వాళ్ళకే చెప్దామనుకుంటే వాళ్ళు కలలు కనే తీరిక కూడా లేనంత బిజీగా వున్నారుట. అయినా వీళ్ళే యింత మర్యాద చేశారు, వాళ్ళింకెంత చేస్తారోనని, ప్రజలలో తమయందు భయభక్తులు బొత్తిగా తగ్గిపోయాయని దిగులుపడుతున్న సమయంలో చేరిందట మన యమధర్మరాజుగారి పిటిషన్. ఇపుడేమీ చూడను పొమ్మని విసుక్కున్నాడుట చేసేదిలేక.

బ్రహ్మదేవుడికి పంపిన అప్లికేషన్కి కూడా సమాధానం రాకపోవటంతో యముడికి చిర్రెత్తుకొచ్చింది. నాకింకోళ్ళు సహాయం చేసేదేమిటి? చతుర్విధోపాయాలలో ఏదో ఒక ఉపాయంతో నా సమస్య నేనే పరిష్కరించుకుంటానని హూంకరించాడు. నరకంలో వున్న వాళ్ళలో కొందరికి ప్రమోషన్ ఇచ్చి భూలోకం పంపాలనుకున్నాడు. ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. పోనీ కొందరినైనా ఏ చిన్న కారణం దొరికినా గట్టి రికమెండేషన్ తో స్వర్గానికి తోసేసి స్వర్గం తెరిపిస్తే కొంతరద్దీ తగ్గుతుందనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడువుగా ఒక పదిరోజులు చిత్రగుప్తుడితో సహా రాత్రింబగళ్ళు శ్రమపడి అన్ని కేసులూ వివరంగా చదివాడు. లాభంలేకపోయింది. ఒకటీ అరా దొరికినాయిగానీ, ఈ ఒకళ్ళిద్దరి కోసం రికమండ్ చేస్తే తమ ప్రపోజల్ వీగి పోతుందనుకున్నాడు. అందులోనూ పెట్టిన అప్లకేషన్ కే దిక్కూ దివాణం లేదయ్యే.

ఇంక ఇదికాదు పని అని చిత్రగుప్తునితో బాగా ఆలోచించినమీదట, నరకంలోని పాపులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. భూలోకానికి వెళ్ళేవాళ్ళని లక్షాధికారుల ఇళ్ళల్లో పుట్టిస్తానన్నాడు. మంత్రి పదవులిప్పిస్తానన్నాడు. కానీ జీవులంతాఏకమై కన్నుమూసి తెరిచేసరికి పదిమంది మంత్రులు మారుతున్నారు. లక్షాధికారులు భిక్షాధికారులవుతున్నారు. మేం వెళ్ళం పొమ్మన్నారు. అతిలోక సుందరుల రూపమిస్తానని ఆశపెట్టాడు. మామూలు ఆడవాళ్ళనే పదిమందిముందు రోడ్డుమీద నానాగోలా చేస్తుంటే పట్టించుకునే దిక్కులేదు .ఆ సంఘంలో ఇంక ఈ సౌందర్యంతో మేమవస్తలు పడలేము స్వామీ అన్నారు. అయినా భూలోకంలో పెద్దపెద్దవాళ్ళంతా ప్రపంచాన్ని స్వర్గంగామారుస్తామని కడుపునిండా తిండి, ఒంటినిండా బట్ట దొరుకుతుందనీ, ఇలా ఎన్నెన్నో ఆశలు పెడితే నమ్మి నమ్మి విసుగొచ్చింది. స్వర్గం కాదుకదా కనీసం నరకంలో వున్న ప్రశాంతత కూడా లేదక్కడ. ఇంక ఏ ఆశలకూ లొంగం పొమ్మన్నారు.

వీళ్ళు చాలా ఆరితేరిన ఘటాలు, ఇలా లొంగరనుకుని ఎవరూ లేకుండాచూసి ఒక్కొక్కళ్ళనీ పిలిచి బాబ్బాబు అని కాళ్ళూ గడ్డాలూ పట్టుకున్నంత పనిచేశాడు. లాభంలేకపోయింది. యముడుకి చిర్రెత్తుకొచ్చింది. నా అంతటివాణ్ణి ఇలా బతిమాలుతుంటే ఇంత విర్రవీగుతారా అని ఇంక భయపెట్టటం ప్రారంభించాడు. సలసల కాగే నూనెలో వేయిస్తాాననీ, అగ్ని స్తంభాలకు అంటగడతాననీ బెదిరించాడు. ఊహు, లాభంలేకపోయింది. పైగా నమ్రతగా యమధర్మరాజుకు యిలా విన్నవించారు.

ఆయ్యా, యముడుగారూ, తమరు మమ్మల్ని నూనెలో వేయిస్తారో, అగ్ని స్తంభాలకే కడతారో లేకపోతే నీరుగడ్డకట్టుకునే చల్లగాలిలో వదులుతారో అంతా మీ ఇష్టం, మేమేమీ అభ్యంతర పెట్టం కానీ మమ్మల్మి మాత్రం తిరిగి భూమి మీద పుట్టమనద్దు. అక్కడివాతావరణం ఏ క్షణంలో ఎలా వుంటుందో మీ బ్రహ్మగారికే అంతు పట్టటంలేదు. ఆ వాతావరణం తట్టుకోవటం ముందు మీరు చెప్పే బాధలు ఒక లెక్కలోవికావు. ఇంకా మామీద కోపం తీరకపోతే విషవాయువులు వదలండి. కావాలంటే కాలనాగులతో కాటు వేయించండి. ఒకసారి ఎటూ చచ్చాంకనుక చావంటే భయం లేదు. బాధంటారా? భూలోకంలో కల్తీ మందులూ, కల్తీ వస్తువులు తిని క్రమ క్రమంగా క్షీణిస్తూ, ఏ క్షణంలో చస్తామో తెలియక చస్తామనే భయంతో క్షణమొక యుగంగా గడపటంముందు ఇదో లెక్కా. అదీగాక మాకింకో భరోసా వుందండోయ్. ఇక్కడ పెరిగిపోయే జీవులను అదుపులో పెట్టటానికి మీ భృత్యులెటూ సరిపోరు. మీ కొలీగ్సందరూ ఎవరిగోలల్లోవాళ్ళుండటంవల్ల వాళ్ళవల్ల మీకే సహాయమూరాదు. అందుకని ఇవాళకాకపోతే రేపయినా మాలో కొందరిని మీ భృత్యులుగా తీసుకోకతప్పదు. అంటే కొంతకాలానికైనా మాకు నమ్మకంగా ఉద్యోగాలు దొరుకుతాయి. భూ లోకంలో ఏముందండీ ఎన్ని గవర్నమెంటులు మారినా ఎన్ని సంస్ధలు పెరిగినా నిరుద్యోగులకుమాత్రం దిక్కులేదు. అదీగాక మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న సలహా. భూలోకంలో వస్తువుల ధరలు నక్షత్రాలంటుతున్నాయంటున్నారుకదా రేపో మాపో నరకం దాకా రావచ్చు. ఎటూ ధరలు మనదాకా వస్తాయి గనక, వచ్చిన తర్వాత మనల్మి దాటిపోలేవు కనుక మనకి వస్తువులన్నీ చౌకగా దొరుకుతాయి.

ఆయ్యా, ఒక సలహా ఎటూ విన్నారుకదా, రెండోదికూడా వినండి. అంతగా అయితే మాకో దోవ చూపించేదాకా వచ్చిన అభ్యర్ధులని క్యూలో నుంచోపెట్టండి. మా అందరికీ పొద్దున్నేలేచి కాఫీకి పాలకోసం దగ్గరనుంచీ, చివరకి వినోదంకోసంచూసే సినిమాదాకా క్యూలో నుంచోవటంఅలవాటే. అందుకని ఏమీ అనుకోము. పైగా అక్కడలాగాఇక్కడ ఉత్తచెయ్యి చూపించరుకనుక ఓపిగ్గా వైట్ చేస్తాము. ఇంకా కావాలంటే ఆ క్యూల్ని కంట్రోల్ చెయ్యటానికి మాలో కొందరిని నియమించండి. అంటూ సలహాలిచ్చారు.

మేము భూలోకానికి పోమని మూకుమ్మడిగా నినాదాలిచ్చారు. వీలుంటే సమ్మెకూడా చెయ్యటానికి సిధ్ధమయ్యారు.

ఈగోలతో పాపం యముడికి దిక్కు తోచటంలేదు.
(రంజని, ఎ.జి. ఆపీసు సాహితీ సమితి సంచికలో 1980 ల్లో ప్రచురించబడ్డ రచన ఇది.)

0 comments

Thursday, November 20, 2008

vyra yaatra - published in Andhra Bhoomi 20/11/2008

Thursday, November 20, 2008




0 comments

Wednesday, October 22, 2008

నల్గొండ జిల్లా విశేషాలు

Wednesday, October 22, 2008
height="500" width="100%"> value="http://documents.scribd.com/ScribdViewer.swf?document_id=7454834&access_key=key-17gk1zhm8k7vmv17q2ve&page=&version=1&auto_size=true&viewMode=">    

0 comments

Thursday, October 16, 2008

బ్లాగ్ ప్రయాణంలో నేను -- పి.యస్. యమ్. లక్ష్మి

Thursday, October 16, 2008





బ్లాగుతో నా పరిచయం ఒక వార్తా పత్రిక వార్తతో మొదలయింది. నేను చూసిన వార్త ఫారెన్ లో వుంటున్న వంటలు సరిగ్గా రాని ఒకావిడ తనలాంటి వారి కోసం వంటల బ్లాగు మొదలు పెట్టారుట. అది దినదిన ప్రవర్ధమానమై ప్రకటనల జోరుతో హోరెత్తి పుస్తకాల రూపంలో కూడా వచ్చాయనుకుంటాను. బ్లాగుల గురించి నాకు తెలిసింది అప్పడే.

నాకూ మా వారికీ ముందునుంచీ కొత్త ప్రదేశాలు చూడటం సరదా. మధ్యలో కొంతకాలం ఆఫీసు వత్తిళ్ళు, పిల్లల చదువులు వగైరాలతో కుదరలేదు. తర్వాత మాకు దొరికిన ఖాళీ సమయాలలో కొత్త ప్రదేశాలు చూడటం మళ్ళీమొదలు పెట్టాం. ఇది వరకు కొంచెం పేరున్న ప్రదేశాలకే వెళ్ళేవాళ్ళంకానీ ప్రస్తుతం కారులో సొంత డ్రైవింగ్ లో తిరగటంతో దోవలో కనబడ్డ చిన్న చిన్న ప్రదేశాలు కూడా చూడటం మొదలు పెట్టాం. దానితో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. దోవ కనుక్కోవటం, వసతి, భోజనం వగైరా విషయాలలో. ఇంటర్నెట్ వెతికినా అన్నింటి వివరాలూ తెలియలేదు. అప్పడు నేను చదివిన బ్లాగు గురించి గుర్తు వచ్చిది. మాకు అన్ని వివరాలూ తెలియలేదు సరే. మాకు తెలిసిన విషయాల గురించి బ్లాగులో రాస్తే ఆ ప్రదేశాలు చూడాలనుకునేవాళ్ళకి ఈ వివరాలవల్ల కొన్ని ఇబ్బందులన్నా తప్పించిన వాళ్ళమవుతామనుకున్నా. అదీగాక మేము చూసిన విషయాల గురించీ, మన చారిత్రాత్మిక, ఆధ్యాత్మిక సంపద గురించి అందరికీ చెప్పాలనే తపన ఒకటి. ఈ ఆలోచన వచ్చిన దగ్గరనుంచి ఇండియాలో మేము చూసిన ప్రదేశాల వివరాలు రాసి పెట్టుకున్నాను.

ఇంతలో పిల్లల దగ్గరకి అమెరికా వెళ్ళాం. అక్కడ మా అబ్బాయి తేజస్వి సహాయంతో బ్లాగు మొదలు పెట్టాను. ఎలాగూ మొదలు పెట్టాను కదా అని ముందు అమెరికా లో చూసినవి రాశాను ఒక రెండు మూడు ప్రదేశాల గురించి తప్ప.. అక్కడ వుండగానే కొన్ని తెలుగు పోస్ట్ లు కూడా పబ్లిష్ చేశాను గూగుల్ సహాయంతో. అక్కడ మా పిల్లల స్నేహితులనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

13-7-2008
న తిరిగి ఇండియా ప్రయాణం. పిల్లలదగ్గరనుంచి వచ్చేస్తున్నామని దిగులు. ఇంటి దగ్గర శూన్య ప్రపంచం నన్ను కొంచెం భయపెట్టింది. మొన్నటిదాకా ఉద్యోగం మూలంగా క్షణం తీరిక లేకుండా గడిపిన నాకు ఇంట్లో కాలక్షేపం గురించి కొంచెం దిగులు వుండేది. ఆ సమయంలో వచ్చింది శ్రీ దూర్వాసుల పద్మనాభం గారి మెయిల్. తెలుగు బ్లాగర్స మీటింగు గురించి. ఆ మెయిల్ ని చూసిన నాకు ఎంత సంతోషం వేసిందో మాటల్లో చెప్పలేను. రిటైరయినంత మాత్రాన నేను ఖాళీగా కూర్చోనక్కరలేదు. ఇంత దూరాన్నుంచి ఏవో నాలుగు పోస్ట్ లు పబ్లిష్ చేసినంతమాత్రానే నాకు బ్లాగర్స్ అసోసియేషన్ తరఫున మీటింగుకి పిలుపు వచ్చిందంటే ఇండియా వెళ్తే బోల్డు కాలక్షేపమని ఎగురుకుంటూ, మనోధైర్యంతో ఉత్సాహంగా వచ్చాను. ఒక విధంగా డిప్రెషన్ లోకి వెళ్తానేమోనని భయపడ్డ నేను హుషారుగా ఇండియా వచ్చేటట్లు చేసింది ఏ మాత్రం పరిచయంలేని శ్రీ పద్మనాభంగారూ ఇంకా తెలుగు బ్లాగులూ. నా బ్లాగుల మూలంగా నేను పొందిన ఈ లాభం విలువ కట్టలేనిది.

ఇండియా వచ్చిన తర్వాత సెప్టెంబర్ నెలలో శ్రీ సి.బి. రావు గారి ఇంట్లో జరిగిన బ్లాగర్ల సమావేశానికి వెళ్ళాము నేనూ శ్రీవారూ. అక్కడ పరిచయమయ్యారు శ్రీ పద్మనాభంగారు ఇంకా కొంతమంది సభ్యులతోపాటు. విశేషమేమిటంటే నాకు ఆయన చేసిన మేలు ఆయనకూ తెలియదు. సమావేశం గురించి హైదరాబాదులో వున్న తెలుగు బ్లాగర్లందరికీ టపా పంపించారు. అందులో నా పేరు వచ్చింది. ఎంత త్రిల్లింగ్ గా అనిపించిందో చెప్పలేను.

తర్వాత నేను పొందిన ఇంకో గొప్ప సహాయం శ్రీ జాలయ్య గారి దగ్గరనుంచి. గూగుల్ తెలుగు లో రాయటం నాకు బాగా అలవాటయినా వైరస్ మూలంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అను స్క్రిప్ట్, లేఖిని ప్రయత్నించాను కానీ సాఫీగా సాగలేదు. గుంపుకి ఒక లేఖ రాశాను. అప్పుడు జాలయ్యగారు ఇన్ స్క్రిప్ట్ ప్రయత్నించమని చెప్పారు. ఆ తర్వాత ఈ విషయంలో మళ్ళీ నాకు ఇబ్బంది ఎదురుకాలేదు.

అప్పుడే అయిపోలేదు ఆగండి. ఇప్పుడు నేను పొందిన ఇంకో మాంఛి సహాయం శ్రీమతి జ్యోతి దగ్గరనుంచి. అడిగిన వెంఠనే నా బ్లాగు రూపురేఖలు మార్చటానికి ఆవిడ ఒప్పుకున్నారు. అలాగే బ్లాగు విషయంలో నాకొచ్చిన అనుమానాలను తీర్చిన శ్రీ వీవెన్ గారు, శ్రీ సిబిరావు గారు, పాత కాలం భాష లో రాస్తే మాలాంటి వాళ్ళకి చదవటానికి ఓపిక వుండదు, రచనలు వాడుక భాషలో వుండాలని చెప్పిన శ్రీ కత్తి మహేష్,.....హమ్మయ్య. జ్యోతి ఈ పోస్ట్ ఇప్పుడు మొదలు పెట్టింది కనుక సరిపోయింది. ఇంకొన్నాళ్ళాగితే ఈ లిస్టు ఎన్ని పేజీలు సాగేదో.


మిగతా బ్లాగర్ల గురించి .... నిజం చెప్పాలంటే నాకు బ్లాగులగురించీ, వాటిలో ఏమి రాస్తారనీ తెలియదనే చెప్పాలి. ఏదో పత్రికల్లో రాసినట్లు నాకు తెలిసింది నేను రాస్తే కొందరికన్నా ఉపయోగ పడుతుందనే ఆలోచన తప్ప ఇంత ఇంటర్ ఏక్షన్ వుంటుందని తెలియదు. అలాంటి నేను ఈ రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టగానే అబ్బ! ఎంత అందమైనదీ లోకం. నాకు తెలియని ఒక అద్భుత ప్రపంచంలోకి వచ్చాను ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చనుకున్నాను. ఇంతలో ఒక వైపు నుంచి అందమైన విరులెన్నో తమ సౌరభాలతో నన్ను రా రమ్మని పిలిచాయి. అంతే. ఆ ప్రమదావనంలో నన్ను నేనే మరచిపోయాను. ప్రస్తుతం నా చుట్టూ వున్న బంధాలను మరచిపోకుండా వుండేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఆ ప్రమదావనం ఆకర్షణ ఎలాంటిదో అర్ధమయిందికదండీ.

బ్లాగు లోకానికి మనమేమి ఇచ్చామంటే, కొత్త ప్రదేశాలు చూసే సరదా వున్న వాళ్ళకి నా బ్లాగు ద్వారా అక్కడి వివరాలు తెలిసి ఇబ్బంది పడకుండా వెళ్ళి వస్తే నాకదే చాలు. వెళ్ళలేనివాళ్ళు నా బ్లాగులో ఆ ప్రదేశాల ఫోటోలు చూసి మన ప్రాచీన, నవీన దేవళాల గురించి, విహార స్ధలాల గురించీ తెలుసుకోవాలని నా కోరిక.

ఇంక నేనేమి పొందానంటే పైన కొన్ని విషయాలు చెప్పాను కదా. అవే కాకుండా బోలెడు పనికి వచ్చే కాలక్షేపం, చాలామంది స్నేహితులూ, అన్నింటికన్నా ముఖ్యం లోక ఙానాన్ని పెంచుకుంటున్నాను. ఇంతకన్నా ఇంకేం కావాలండీ. ఏమో. ఈ మహా సముద్రంలో ఇంకేం నిధులున్నాయో దొరికాక మళ్ళీ చెప్తాను. ఇంకో విషయం మాత్రం ఇప్పుడే చెప్పాలండీ. ఈ లోకంలో ఎవరికైనా ఏదైనా అనుమానం వచ్చి ఒక్క టపా రాశారంటే చాలు. సహాయం చెయ్యటానికి ఎంతమంది తయారయిపోతారండీ. నిస్వార్ధతకి నిలువెత్తు అద్దాలు కదండీ ఈ స్నేహ హస్తాలు.

దీని వల్ల లాభాలేకాదు. నష్టాలు కూడా వున్నాయండీ. చెయ్యాలనుకున్న చాలా పనులు చెయ్యటానికి సమయం సరి పోవటంలేదు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఇంతసేపు కంప్యూటర్ ముందు కూర్చుంటారో లేదో తెలియదుగానీ ఇంతంత సేపు ఈ కంప్యూటర్ ముందు కూర్చుని కళ్ళనీ నడుమునీ పాపం ఇబ్బంది పెడుతున్నాను.


ఏది ఏమైనా ఇది ఒక అందమైన అనుభవం. అనుభవిస్తేకానీ అర్ధంకాదు. అందుకే బ్లాగర్లు కాని వారందరూ తొందరగా మీ మీ ఖాతాలు తెరవండి. శుభాభినందనలు.


Psmlakshmi
Psmlakshmi.blogspot.com






















































































13 comments