తీర్ధానికి మంత్రజలం అనే పేరుకూడా వుందా?
అవును. మనం అభిషేకం చేసినప్పుడు, పంచామృతాలతో, శుధ్ధోదకంతో దేవతా మూర్తులకు స్నానం చేయించినప్పుడు దానిని తీర్ధంగా తీసుకుంటాము. పూజ మొదలు పెట్టేటప్పుడు ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణ స్వాహా, ఓం మాధవాయస్వాహా అని మూడుసార్లు ఆచమనం చేస్తాము.. కొందరు నిష్ణాతులు భోజనం ముందు కూడా గాయత్రీ మంత్రంతో ఔపోసన పడతారు. వీటివెనకాల ఆధ్యాత్మికతేనా లేక శాస్త్రీయత కూడా వున్నదా? వుంటే అది ఏమిటి?
పంచ భూతాలలో జలం ఒకటి. ఈ జలానికి శబ్దగ్రాహక శక్తి వున్నది. మంత్ర జపం చేస్తూ చేసే ఆభిషేకాలు, పూజాదికాలు చేస్తూ సమర్పించే జలం, ఆ మంత్రాలలో వుండే శక్తిని గ్రహిస్తుంది. దానితో ఆ జలం మంత్ర జలం అవుతుంది.
మన పూర్వీకుల ద్వారా మనకిన్ని విషయాలు తెలిసినా వాటిని సరిగ్గా ఆచరించటానికి ఉత్సాహం చూపించం. ఆధ్యాత్మికంగా నమ్మేవాళ్ళు కొన్ని ఆచరిస్తారు, లేనివారు కొట్టి పారేసి మన సంపదను మనమే తోసిరాజనుకుంటున్నాము. కానీ ఈ విషయాలను పరిశీలించి, పరిశోధించి నిజానిజాలు కనుగొనే ప్రయత్నాలు చెయ్యము.
కానీ పాశ్తాత్యులు జలానికి శబ్దగ్రాహక శక్తి వున్నదని పరిశోధనలు చేసి నిరూపించటమేకాదు వాటి చిత్రాలను ఇంటర్నెట్ లో కూడా పెట్టారు. ఆ చిత్రాలు చూసిన వారెవరన్నా ఇక్కడ వాటి లింకు ఇస్తే అందరూ చూస్తారు.
పాశ్చాత్యులు మంత్రాలతో ప్రయోగాలు చెయ్యలేదుకానీ నీటికున్న శబ్దగ్రాహక శక్తి గురించి మాత్రమే ప్రయోగాలు చేశారు. వివిధ శబ్దాలు విన్నప్పుడు నీటి కణాలలో వచ్చే మార్పులను చిత్రాలు తీశారు. జానపద సంగీతం వినిపిస్తున్నప్పుడు నీటి కణంలో తెల్ల మందారంలాంటి ఆకారం ఏర్పడింది. అలాగే ఫేర్ వెల్, గుడ్ బై చెబుతున్నప్పుడు నీటిలో వుండే పరమాణువులన్నీ విడిపోయినట్లు కనిపించాయి. ప్రార్ధన ముందు ఒక విధంగా వున్న పదార్ధం తర్వాత షట్కోణాకారంగా వజ్రంలా మెరుస్తూ కనిపించిందిట. ఒక చిత్రంలో నిన్ను చంపుతానంటూ చంపటానికి వస్తున్నట్లు ఒక భావం కనిపించిందట. ఆ జలం గ్రహించిన భావం అదన్నమాట. ఇన్ని పరిశోధనలు చేసి వారు నిరూపించినదీ, ఏ పరిశోధనలూ తెలియని కాలంలో మన పూర్వీకులు చెప్పిందీ, చేసిందీ ఒకటే.
ఇప్పుడు మనం తెలుసుకున్నదేమిటంటే మన ఋషులు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఆధ్యాత్మికంగానే కాక, శాస్త్రీయంగా కూడా వాటి విలువ అపారం. మంత్ర పారాయణ ప్రభావం కలిగిన జలాన్ని తీర్ధంగా తీసుకోవటంవల్ల జలం గ్రహించిన ఆ మంత్ర శక్తి మన శరీరంలోకి వెళ్ళి మన శరీరానికి మేలు జరుగుతుంది.
తీర్ధం విలువ తెలుసుకున్నారుకదా...ఇంక ఆచరణలో చూపించండి మరి.
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)
3 comments:
thanks for your good article
good one....
కృతజ్ఞతలు జగదీష్ గారూ, మనోహర్ గారూ
గోపురం కార్యక్రమంలో నేను విన్నవాటిలో నాకు నచ్చినవి నలుగురితో పంచుకుంటున్నాను. ఇలాంటివి కొన్ని మనకు తెలియదు, మనకున్న వ్యాపకాలతో ప్రత్యేకించి తెలుసుకోవాలని సమయాన్ని అందరూ వెచ్చించలేరు. ఇలాంటి కార్యక్రమాలు చూడటానికి పొద్దున్నే లేచి టీవీ ముందు కూర్చోవటం ఎంతమందికి కుదురుతుంది. అందుకే మన పెద్దలు చెప్పినదానిలో నేను గ్రహించిన మంచిని మీకూ పంచుతున్నా. నచ్చినందుకు సంతోషం.
Post a Comment