Tuesday, December 1, 2009

ఆంజనేయస్వామికి సింధూరం ఎందుకు పూస్తారు?

Tuesday, December 1, 2009
ఈ ఆనుమానం, సందేహం చాలామందికి వుంది. దీనికో పౌరాణిక కధ వుంది. రామాయణకాలంలో సీతమ్మవారు పాపిడిలో సింధూరం ధరించేది. ఒకసారి ఆంజనేయస్వామి అది చూసి అలా ఎందుకు ధరిస్తున్నారని సీతమ్మని అడీగారు. అందుకు సీతమ్మ నీ స్వామి, నాస్వామి అయిన శ్రీరామచంద్రుని ఆయుష్షు పెరగాలనీ ఆయనకి అన్నీ శుభాలు జరగాలనీ పాపిడిలో సింధూరం ధరిస్తాను. ఆడవారు పాపిడిలో సింధూరం ధరిస్తే మగవారి ఆయుష్షు పెరుగుతుంది, వారికి అన్నీ శుభాలు జరుగుతాయి అని చెప్పిందట.

ఆంజనేయస్వామి రాముడికి పరమ భక్తుడు. ఆయన వూరుకుంటాడా!? వెంటనే వెళ్ళి ఒళ్ళంతా సిధూరం పూసుకొచ్చాడు. సీతమ్మ అడిగిందట. ఒళ్ళంతా సిధూరం ఎందుకు పూసుకున్నావని. దానికి ఆయన సమాధానం, ‘అమ్మా, నువ్వు పాపిడిలో సింధూరం పెట్టుకుంటేనే స్వామి ఆయుష్షు పెరుగుతుందనీ, శుభం జరుగుతుందనీ అన్నావు కదా, మరి నేనాయన భక్తుణ్ణి, నేను ఒళ్ళంతా సింధూరం పూసుకుంటే నా స్వామికి ఇంకా ఎక్కువగా అన్నీ శుభాలే జరుగుతాయనీ, ఆయన చిరంజీవి కావాలని ఇలా పూసుకున్నాను’ అని చెప్పాడు.

ఇది వాల్మీకి రామాయణంలో కధకాదు. రామాయణాన్ని చాలామంది రచయితలు చాలాసార్లు రాశారు. తర్వాత వచ్చిన రామాయణంలో వచ్చిన కధ ఇది.

అది పురాణ కధ అనుకోండి. లౌకికంగా చూస్తే ఆంజనేయస్వామి వాయుదేవుని పుత్రుడు, సూర్యదేవుని శిష్యుడు. వారిరువురూ ఎంతో తేజస్సు కలవారు. అందుకే ఆంజనేయస్వామి అమిత తేజోమూర్తి. ఎరుపు లేక సింధూరం తేజస్సుకి చిహ్నం. ఆయన తేజస్సుకి చిహ్నంగా ఆయనను సింధూరంతో అలంకరిస్తే స్వామి చూడటానికే ఎంతో తేజోవంతుడుగా కనుల విందు చేస్తాడనీ, ఆయన తేజస్సూ, శక్తీ మనకి వెంటనే స్ఫురిస్తుందనీ అలా అలంకరిస్తారు.

ఇంకొక విషయం తెలుసా ఆంజనేయస్వామి రామ భక్తుడుకదా. శ్రీరామ పూజ ఎక్కడ జరిగితే అక్కడ ఆంజనేయ స్వామి వుంటాడు. ఆ పూజ చూడటానికీ, ఆ నామ కీర్తన వినటానికీ. అందుకే శ్రీరామచంద్రుని పూజ చేసేటప్పుడు ఒక ఖాళీ ఆసనాన్ని వేసి వుంచాలిట. అక్కడ ఆంజనేయస్వామి ఆసీనుడై శ్రీ రామ పూజ తిలకిస్తాడని నానుడి.

(జీ టీవీ ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

4 comments:

Sandeep P said...

ఈ ఖాళీ ఆసనం విషయం నేను ఎక్కడ వినలేదు సుమీ! ఈ సారి గమనించాలి.

Manjusha kotamraju said...

maku teliyani vishayalu chepparu thanx andi..

మధురవాణి said...

కొత్త విషయాలు తెలిసాయి. ధన్యవాదాలు.

psm.lakshmi said...

సందీప్ గారూ, నేనూ ఇప్పుడే విన్నాను.
సందీప్, మంజూ, మధురవాణీ, కృతజ్ఞతలు.
psmlakshmi