Friday, March 19, 2010

చిన్న పిల్లలకు కంటి జబ్బులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Friday, March 19, 2010



చిన్న పిల్లలకు పుట్టక ముందునుంచే కొన్న జబ్బులు వస్తాయి, కొన్ని జబ్బులు పుట్టిన తర్వాత వచ్చేవి.   నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు రెటీనా ప్రీ మెచ్యూరిటీ వల్ల కొన్ని నేత్ర వ్యాధులు రావచ్చు, జాగ్రత్తలు తీసుకోక పోవటంవల్ల తర్వాత అంధత్వం రావచ్చు.  చాలా మటుకు అంధత్వందాకా తీసుకెళ్ళకపోవచ్చుకానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

తర్వాత పుట్టిన పిల్లలు వెలుతురు, లైటు చూడలేక వెంటనే కళ్ళు మూసుకుంటే డాక్టరుని సంప్రదించాలి.  అలాగే కళ్ళు నీళ్ళుకారుతున్నా, ఎఱ్ఱబారినా, అశ్రధ్ధ చెయ్యకుండా కంటి డాక్టరుకి చూపించాలి. 

వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు కూడా కొన్ని వుంటాయి.  తల్లి దండ్రులకు రేచీకటిగానీ, రెటీనా సంబంధిత  వ్యాధులుగానీ వుంటే పిల్లల్ని తరచూ కంటి వైద్యులకు చూపించాలి.  వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు పిల్లలకు వచ్చే అవకాశం వుంది కనుక ముందే జాగ్రత్త తీసుకోవటం మంచిదికదా.  కొందరు పిల్లలకు  చిన్నప్పుడే ధైరాయిడ్ సమస్యల వల్లకూడా కళ్ళ జబ్బులు, అశ్రధ్ధ చేస్తే అంధత్వం వచ్చే అవకాశాలు వున్నాయి.  ఒక 9 ఏళ్ళ అమ్మాయికి కళ్ళు సరిగ్గా కనబడకపోతే అనేకమంది డాక్టర్లకు చూపిస్తే ఏ వెయ్యిమందిలో ఒకళ్ళకో వచ్చే జబ్బిది కళ్ళు రాకపోవచ్చు అని చెప్పారు.  తర్వాత ఆ పాపకే ఏదో కారణంవల్ల ధైరాయిడ్ పరీక్ష చేయించి దానికి మందులు వాడారు.  ఆ సమస్య సరి కాగానే కళ్లుకూడా కనబడటం మొదలయింది.  అంటే, శరీరంలో తీవ్ర ఋగ్మతలు వున్నా కంటి జబ్బులు వచ్చే అవకాశం వుంది.  ఫిట్స్ వచ్చే పిల్లలకు 5 సంవత్సరాలుపాటు స్టెరాయిడ్స్ ఇస్తారు.  వారికి నరాలు కంట్రోల్ లో వుండాలంటే ప్రశాంతమైన నిద్రపోవటం తప్పనిసరి.  వారికి ఆ మందులు వాడటం తప్పనిసరి, ఆ మందులవల్ల కంటి సమస్యలు వచ్చే ప్రమాదం వుంది కనుక తరచూ కంటి వైద్యులచేత పరీక్ష చేయించాలి.

కొన్ని జబ్బులు పిల్లల అలవాట్లవల్లగానీ, పెద్దవాళ్ల అజాగ్రత్తవల్లగానీ రావచ్చు.  కొందరు పిల్లలు, పుల్లలతో, సూదులతోగానీ ఇంకేవైనా షార్ప్ గావుండే వస్తువులతో ఆడతారు.  తెలిసో, తెలియకో ఈ వస్తువులు కంటికి తగిలి కార్నియా దెబ్బ తినవచ్చు.  అలాగే కొందరు కుర్చీ అందదని పిల్లల్ని డైనింగ్ టేబుల్ మీద  కూర్చోబెడతారు.  పిల్లల చేతులు వూరికే వుండవు కదండీ.  ఇప్పుడు అందరి ఇళ్ళల్లో వెనిగర్ వాడటం ఎక్కువైంది.  ఆ సీసాగానీ, పచ్చళ్ళేవైనాగానీ పక్కనే వుంటే అది తీసి చేతిలో వంపుకోవటం వగైరాచేసి ఆ చేతుల్తో కళ్ళు రుద్దుకున్నా కళ్ళుపాడయ్యే అవకాశం వుంది.  అలాగే బాత్ రూమ్ లో వాడే యాసిడ్స్ కూడా.  ఇవేవీ పిల్లల అందుబాటులో వుంచకూడదు. 

అన్నింటికన్నా ఎక్కువ ప్రమాదకరమైనవి టపాకాయలు.  టపాకాయలు కాల్చేటప్పుడు పిల్లల అజాగ్రత్త, పెద్దల అశ్రధ్ధ  ప్రతి ఏటా వేలమంది పిల్లల కంటి జబ్బులు, కళ్ళు పోవటానికి కారణాలవుతున్నాయి.

పిల్లలకిచ్చే ఆహారం విషయం కూడా జాగ్రత్త వహించాలి.  వారికి ఏది పడుతుంది, ఏది పడదు అని చూసుకుంటూ సరైన పోషక పదార్ధాలు వారికి తినిపించాలి.

పిల్లలపట్ల పెద్దవారు తీసుకునే జాగ్రత్తలవల్ల పిల్లల్లో చాలామటుకు కంటి జబ్బులు, అంధత్వం నివారించవచ్చు.  మన అజాగ్రత్తవల్ల కొని తెచ్చుకునే సమస్యలకి జీవితాంతం క్షోభ పడాల్సి వస్తుంది కనుక మన జాగ్రత్తలో మనం వుండటం అవసరం.  కదా!!??

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



2 comments:

మైత్రేయి said...

మంచి విషయం చెప్పారండి.
ఈ సందర్బంగా నాకు తెలిసిన మంచి కంటి వైద్యశాల గూర్చి చెప్పాలనుకొంటున్నాను.
శ్రీధరీయం (http://www.sreedhareeyam.com/) అని కేరళ ఆయుర్వేద నేత్ర శాల ఉంది. నేను కొన్ని మొండి వ్యాధులు నయం అవ్వటం చూసాను. విదేశాల నుండి కూడా ఇక్కడకు వస్తారు. అయితే అన్ని ఆయుర్వేద వైద్యాల లాగా ఇది నిదానంగా చేసే వైద్యం.

psm.lakshmi said...

మీకు తెలిసిన విషయం ఇక్కడ ఇవ్వటం వల్ల ఇంకా కొంతమందికి తెలిసే అవకాశం వుంది. నచ్చినందుకు సంతోషం మైత్రేయిగారూ.
psmlakshmi