ఇదండీ వరస
నాదెంత అదృష్టమో. మా ఇంట్లోవాళ్ళేకాదు, మా దగ్గర బంధువులుకూడ నా బ్లాగు చూడం అని ప్రతిజ్ఞబూనలేదుగానీ..దాదాపు అలాగే ప్రవర్తిస్తారు.. అందరూ కూడబలుక్కుని గూడుపుఠాణీ చెయ్యకపోయినా అందరిదీ ఈ విషయంలో మాత్రం ఒకే మాట. మా పిల్లలూ, వాళ్ళ దగ్గర స్నేహితులూ ఇంకో అడుగు ముందేసి, అప్పుడప్పుడూ నన్నేడిపిస్తారు కూడ. మొన్న ఉగాదినాడు కూడా అలాగే… అందరం సరదాగా మాట్లాడుకుంటుంటే మాటలు పెళ్ళి ఫోటోలవైపు మళ్ళి మా క్రాంతితో అన్నాను..ఉరేయ్, నీ పెళ్ళికి ఫోటోలు నేనే తీస్తానురా అని. వాడో కోతి. ఏమన్నాడో చూడండి.
ఆంటీ ఫోటోలు తీసేట్లయితే నేను పొరపాటునకూడా ఏ గుళ్ళోనూ పెళ్ళి చేసుకోను అన్నాడు. దానికీ దీనికీ సంబంధమేంటిరా అంటే ఫోటోలన్నింటిలోనూ ఖచ్చితంగా మేముండము. మా వెనకవున్న గుడి గోడలూ, వాటిమీద శిల్పాలే వుంటాయి. గుడి కనబడిందంటే ఆంటీకింకేమీ గుర్తుండవు. ఆంటీకెప్పుడూ తను చూసే గుళ్ళగురించి ఎంత బాగా సమాచారం ఇవ్వాలా అనే ధ్యాస.. అందుకే గుడి కనబడగానే తను తియ్యాల్సింది పెళ్ళి ఫోటోలని మర్చిపోయి గుడి ఫోటోలు తీస్తారు అన్నాడు.
మా అబ్బాయి తోడు అందుకున్నాడు..ఇంకా కావాలంటే నీ పెళ్ళి గురించికూడా రాస్తుందిలేరా. ఆ సమయంలో అక్కడ ఒక పెళ్ళి జరిగింది. అంటే ఆ ఆలయంలో వివాహాలు కూడా జరుగుతూంటాయి. వివరాలు కావాల్సినవాళ్ళు ఫలానావారిని ఈ సమయంనుంచి ఈ సమయందాకా సంప్రదించవచ్చు అని రాస్తుంది..అని తెగ గోల చేశారు. ఇదండీ మావాళ్ళకి నా బ్లాగంటే వున్న అభిమానం.
2 comments:
మీమీద అందరికీ ఎంత అభిమానమో దీన్ని బట్టి తెలుస్తోంది కదండీ.. అందుకు మీకు అభినందనలు..
నామీద అందరి అభిమానాన్నీ గుర్తించినందుకు ధన్యవాదాలు శ్రీలలితగారూ.
psmlakshmi
Post a Comment