Wednesday, September 29, 2010

రావి చెట్టు ఇంట్లో పెరగకూడదా?

Wednesday, September 29, 2010


 రావిచెట్టుని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.  విష్ణుస్వరూపమనీ, శని దోషాలు పోగొడుతుందనీ, ఆలయాల్లో ప్రదక్షిణలు కూడా చేస్తారు.  అలాంటి పవిత్రమైన వృక్షం ఇంట్లో మొలిస్తే కీడు జరుగుతుందని పీకేస్తారు.  ఇదెంతమటుకు సమంజసం?  

అసలు నిజమేమిటంటే రావిచెట్టు ఇంట్లో మొలవటంవల్ల ఎలాంటి దోషమూ లేదు.  అయితే ఆ చెట్టు చాలా కాలం వుంటుంది.  పెద్ద చెట్టవ్వటంవల్ల వేళ్ళు బలంగా భూమిలోపలదాకా చాలా దూరం పాకుతాయి.  దానితో మన ఇంటి పునాదులు, గోడలే కాక చుట్టుపక్కల ఇళ్ళకి కూడా నష్టం కలగవచ్చు.  కొన్ని సార్లు ఇళ్ళు కూలిపోయేదాకా కూడా వెళ్ళవచ్చు.

పెద్ద వృక్షాలుకనుక సహజంగా పక్షులు గూళ్ళుకట్టి గుడ్లు పెడతాయి.  వాటికోసం కొన్నిసార్లు పాములు రావచ్చు.  ఆ పక్షులు, పాములు ఇంట్లోకి రావటం ఇబ్బందే కదా.  కొన్నిచోట్ల కొమ్మలు కరెంటు తీగెలకి అడ్డు రావచ్చు, విరిగి ఎవరిమీదయినా పడవచ్చు.  అందుకే రావిచెట్టేకాదు, ఏ పెద్ద చెట్టయినా ఇంట్లో పెరగటం అంత మంచిది కాదు.

అయితే రావి చెట్టు సాక్షాత్తూ విష్ణు స్వరూపమంటారు, పైగా ఆ చెట్టు గాలి కూడా చాలా మంచిది కనుక దాన్ని పీకి పెంట కుప్పమీద పారెయ్యకుండా, వీలయితే ఎక్కడన్నా విశాలమైన ఆవరణలో పాతి పెట్టటానికి ప్రయత్నించండి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



0 comments: