Wednesday, June 16, 2010

బంతిపూలు పూజకి పనికి రావా?

Wednesday, June 16, 2010




మనం అనేక రకాల పూలతో దేవునికి పూజ చేస్తాం.  మరి బంతి పూలతో ఎందుకు పూజ చెయ్యకూడదు?  బంతి పూలు పెద్దగా వుంటాయి, రకరకాల రంగుల్లో వుంటాయి, అందంగా, ఆకర్షణీయంగా వుంటాయి,  సువాసనలు వెదజల్లుతూ వుంటాయి, మరి అవి చేసుకున్న పాపం ఏమిటి?  వాటితో ఎందుకు పూజ చెయ్యకూడదు  అన్ని శుభ కార్యాలకూ పనికి వస్తాయిగా.  పండగకానీ, ఏ శుభకార్యమయినా వచ్చిందంటే బంతిపూల దండలు గుమ్మాలనలంకరించాల్సిందే.  మరి శుభ కార్యాలకు పనికి వచ్చినప్పుడు దైవ పూజకెందుకు పనికి రావు?  పండగల్లో, ఇంట్లో శుభ కార్యాలు జరిగినప్పుడు ఇంటికి మనుషులు ఎక్కువగా వచ్చి పోతూ వుంటారు.  అలాంటి సందర్భాలలో ఎక్కువ బాక్టీరియా ఇంట్లోకి ప్రవేశించరాదని బంతి పూలని గుమ్మానికి కడతారు.  వాటికి క్రిమి కీటకాలను ఆకర్షించి, నాశనం చేసే శక్తి వుంది.  అందుకు.  మరి అలాంటి పూలని దేవతా విగ్రహాలకి వాడితే మంచిదేనా?  గుళ్ళో విగ్రహాలకు బంతి పూల మాలలు వేస్తే చుట్టుప్రక్కల వున్న క్రిమి కీటకాలు అక్కడ చేరుతాయి.  దేవాలయాలలో దేవుని దగ్గర వుపయోగించే పూలు, అగరుబత్తి, ధూపం, హారతి, గంట అన్నీ క్రిమి కీటకాలని పారద్రోలేవిగా వుంటాయి.  మరి క్రిమి కీటకాలను ఆకర్షించే బంతిపూలు దేవుడికి వేస్తే వాటి వల్ల దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందికదా?  అందుకే బంతి పూలతో పూజ వద్దంటారు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

2 comments

రాత్రి పూట ఉప్పు అనకూడదా?




మన సంప్రదాయంలో చాలామంది రాత్రి పూట ఉప్పు అనరు.  ఎందుకు అనకూడదు?  ఏమైనా దోషమా?  అన్నంత మాత్రాన వచ్చే నష్టమేమిటి? 

ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఉప్పు బాగా తగ్గించి తినాలి, లేదా మానేసినా పర్వాలేదు.  అల్లోపతిలో కూడా బీ పీ వున్నవాళ్ళు ఉప్పు బాగా తగ్గించాలంటారు.  ఈ మధ్య అందరినీ ఉప్పు వీలయినంత తగ్గించమనే చెబుతున్నారు.  సాధారణంగా ఎవరైనా పగలంతా తమ తమ పనులతో చాలా శ్రమిస్తారు, దానితో స్వేదం ద్వారా శరీరంలో వున్న లవణాలు బయటకి పోతాయి.  అందుకే పగలు ఉప్పు తినటం అవసరం.  రాత్రిళ్ళు విశ్రాంతి సమయం.  శ్రమ వుండదు.  దానివల్ల శరీరంలో వున్న లవణాలు బయటకి వెళ్ళవు.  అలాంటప్పుడు ఉప్పు ఎక్కువ తినటంవల్ల శరీరానికి హాని జరిగే అవకాశాలు ఎక్కువ.  ఉప్పుకి వున్న దుర్గుణం శరీరంలో వున్న నీటినంతటినీ ఒకచోటికి చేరుస్తుంది.  దానితో ఆ అవయవం వాస్తుంది.  కొందరిలో కాళ్ళు, చేతులు వాయటం, నొక్కితే సొట్టలు పడటం చూస్తూంటాం.  వాళ్ళు ఏ రకమైన వైద్యం చేయించుకున్నా వాళ్ళు ముందు చెప్పేది ఉప్పు తగ్గించమనే. 


సాధారణంగా ఉదయం తీసుకున్న ఉప్పే రోజంతా సరిపోతుంది.  అందుకే రాత్రుళ్ళు ఉప్పు వాడవద్దన్నారు.  పూర్వం దాన్ని ఖచ్చితంగా అమలు చేసే ఉద్దేశ్యంతో అసలు రాత్రిళ్ళు ఉప్పు అనే మాటే అనద్దన్నారు.  రాను రానూ చాదస్తపు మనుషులు కొందరు మూఢ నమ్మకాలతో రాత్రిళ్ళు ఉప్పు అనకూడదు అంటూనే దాని అంతరార్ధం తెలుసుకోకుండా రాత్రిళ్ళు ఉప్పు తిని అనారోగ్యం తెచ్చుకుంటున్నారు. పైగా మనం సాధారణంగా అనే ఉప్పు అని కాకుండా బుట్టలోదనో, లవణం, సాల్ట్ ఇలా నానార్ధాలూ వుపయోగించి మరీ వాడుతున్నారు. 

ఇలాంటివారంతా రాత్రిళ్ళు ఉప్పు అన్నా పర్వాలేదు, ఏ హానీ జరగదు కానీ రాత్రిళ్ళు ఉప్పు ఎక్కువ తింటే మన ఆరోగ్యానికే హాని అని తెలుసుకోవాలి.  పూర్వీకులు నిబంధనలు ఎందుకు పెట్టారు అని తరచి చూస్తే అద్భుతమైన సత్యాలు గోచరిస్తాయి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



4 comments

Wednesday, June 9, 2010

అయ్య బాబోయ్ నిప్పులు

Wednesday, June 9, 2010



నేను చెప్పేది మండిపోతున్న ఎండలు గురించి కాదండీ బాబూ.  నా కాళ్ళకి వున్న నిప్పుల మూటల గురించి.  అదేంటి కాళ్ళకి నిప్పుల మూటలేంటి.  అసలే ఎప్పుడూ గుళ్ళూ గోపురాలూ అంటూ తిరుగుతూ వుంటావు.  ఏ గుళ్ళోనన్నా కొత్త రకం మొక్కు చూసి చేస్తున్నావా అనకండి.  మరీ ఆటపట్టించకండి.  గుళ్ళల్లో కూడా మీకన్నీ సరిగ్గా చెప్తున్నానా లేదా ఏ విషయమైనా మరచిపోతున్నానా అనే యావేగానీ అసలు దేవుడికి సరిగ్గా దణ్ణమయినా పెడుతున్నానా లేదా అనే అనుమానం నాకే కాదు, మా ఆయనక్కూడా వస్తోంది.  అయితే ఆ నిప్పుల మూటల మాటలేమిటంటున్నారా

అక్కడికే వస్తున్నాను.  ఓ నెల రోజులకిందట కాళ్ళు పగిలాయి.  అది చాలామందికి సర్వ సాధారణం.  పైగా ఆ సమయంలో ఇంట్లో చిన్న చిన్న మరమ్మత్తులు జరిగి ఆ దుమ్మువల్ల కాస్త ఎక్కువయినయి, అవ్వే పోతాయ్ లే అని కొంచెం అశ్రధ్ధ చేశాను.  ఆ అశ్రధ్ధే నాకు పెద్ద శిక్ష వేసింది.  ఆ పగుళ్ళు చాలా లోతుగా, ఇష్టం వచ్చినట్లు పెరిగాయి.  అరికాళ్ళకి నిప్పుల మూటలు కట్టుకున్నట్లు కాలు కింద పెడితే సరిగ్గా నుంచోలేక, అడుగు వెయ్యలేక, భరించలేని మంటలు.  అడుగు తీసి అడుగు వెయ్యటమంటే నరకమే.  కాళ్ళు ఓ స్టూలు మీద జాపి కూర్చుంటే ఎక్కువ బాధ లేదు.  ఈవిడకి రోగమేమిటన్నట్లుంటుంది ఆకారం కూడా.  కొన్నాళ్ళు ఆ ముచ్చట కూడా అయ్యాక ఇంక భరించలేక నేను ఎప్పుడూ మందు తీసుకునే శ్రీ యోగనంద్ గారి దగ్గరకెళ్ళాను.  చూస్తూనే ఆయన అన్నారు మేహ ఉడుకు వల్ల వచ్చింది.  నెలపైనుంచీ వుంది కదా అని.  వెంటనే మందులు, మర్నాటినుంచీ ఉపశమనం మొదలు.

ఇంతకూ చెప్పొచ్చేదేమిటంటే మామూలు కాళ్ళ పగుళ్ళే కదా అని అశ్రధ్ధ చెయ్యకండి.  కొంచెం ఎక్కువగా వుంటే వెంటనే వైద్యం చేయించండి నాలాగా అవస్ధ పడక.  అశ్రధ్ధ వల్లే నేను నెలపైన నరకం అనుభవించాను.



0 comments

Thursday, May 20, 2010

మదర్స్ డే గిఫ్ట్

Thursday, May 20, 2010





ఈ మారు మదర్స్ డే న నాకో అద్భుతమైన బహుమానం వచ్చింది.  అదేమిటో ఎవరైనా ఊహించగలరా    ఆద్భుతమైన రంగుల కలయికతో, అపురూపమైన డిజైన్లతో కూడిన చీనీ చీనాంబరాలు కాదండీ.  నక్షత్రాలకన్నా అందంగా మెరిసే వజ్రాల వడ్డాణం కానే కాదు.  దేశదేశాలనుంచీ తెప్పించిన పసందైన పిండివంటలంతకన్నాకాదు.  నాకు ప్రధాన మంత్రి పదవి అస్సలే కాదు.  సరే.  మీరెవరూ గెస్ చెయ్యలేదు కదా.  నేనే చెప్పేస్తాను. 

మదర్స్ డే తోబాటు అమెరికాలో వుంటున్న మా అమ్మాయి చి. దీప్తి మాకు తెలియనివ్వకుండా వచ్చి మమ్మల్ని అద్భుతమైన సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది.  ఇంకో వారం తర్వాత వస్తుందనుకున్న తను అనుకోకుండా మదర్స్ డేన రావటంకన్నా అద్భుతమైన మదర్స్ డే గిఫ్ట్ నాకు ఇంకేముంటుంది.  అర్ధరాత్రి 1-30 కి ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళ్ళిన మా అబ్బాయి వస్తే నిద్ర మెలకువ వచ్చింది.  వెనకే వాడి ఫ్రండ్ క్రాంతి.  నిద్రమత్తులో కళ్ళు మూసుకోబోతుండగా మావారి అనుమానం అక్కడెవరూ అని.  మా వాడి ఫ్రెండే అయ్యుంటారు, ఎవరా అని మూతలు పడుతున్న కళ్ళు చించుకుంటూ....ఎవరూ?  బాగా పరిచయమయినవాళ్ళే! అరే!! తను...తను...నా పాపాయే!!!.  అరె...పాపాయ్!!!!  ఒక్కసారి లేచి నుంచున్నాను.  పాపాయ్...కలా...నిజమా...హేపీ మదర్స్ డే అంటున్న పాపాయిని ఒక్క వుదుటున అమ్మ ప్రేమతో ముంచెత్తాను.

ముందునుంచీ మాకు ఈ నెల 16 వ తారీకున వస్తానని చెబుతోంది. మా అబ్బాయికూడా దానికి వంత పాడుతున్నాడు.  వాళ్ళకి తెలుసు.  కానీ మాకు సర్ ప్రైజ్ ఇవ్వాలని వేరే రోజు వస్తున్నట్లు చెప్పారు.   ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ప్రతి రోజూ ఎదురుచూస్తూ,  ఆ రోజు తను ఈ టైముకు ఇక్కడ వుంటుంది అని ముందునుంచీ  తన రాకని వూహిస్తూ, తనకోసం ఏం చెయ్యాలో ఆలోచిస్తూ, ఓహ్...ఇంకో వారం రోజులు మాకా ఎదురు చూపులు తప్పించింది. 

నిద్ర మత్తులో మదర్స్ డే తొలి ఘడియలలో కళ్ళు తెరిచిన తల్లికి ఎన్నో వేలమైళ్ళ దూరాన వున్న కూతురు అనుకోకుండా కళ్ళ ఎదురుగా కనబడితే అంతకన్నా విలువైనా, అపురూపమైన, అద్భుతమైన బహుమానం ఎక్కడ వుంటుంది.  ఏ వజ్రాల రాసులు ఈ అద్భుతమైన బహుమతికి సరి తూగుతాయి.  మీరే చెప్పండి.

అప్పుడే రాసిన ఈ పోస్టును మీతో పంచుకోవటానికి ఇంతకాలం పట్టింది మా పిల్లల సందడివల్లే.

8 comments

Sunday, May 2, 2010

కాల సర్పం దోషం లేదోచ్

Sunday, May 2, 2010




ఇప్పుడే జీ తెలుగులో శుభమస్తు శీర్షికలో డా. సంధ్యావందనం లక్ష్మీదేవి చెప్పిన శుభ వార్త.  అసలు కాల సర్ప దోషం అనేది ఏ జ్యోతిష్య శాస్త్రంలోనూ చెప్పబడలేదుట.  అలాంటి దోషాల గురించి పూర్వం ఎవరూ వివరించలేదుట.  మధ్యలో ఎప్పుడు వచ్చాయో, ఎవరు కల్పించారో తెలియని దోషం ఇది.  ఏ కారణ వల్లనైనా జాతకంలో ఇతర దోషాలవల్ల వారికి ఏదైనా నష్టం కలిగి వుండవచ్చు.  దాన్ని వారు కాల సర్ప దోషమని వుండవచ్చు.  కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలాంటిదేమీ లేదు.

పైగా ప్రఖ్యాత జ్యోతిష్యులు డా. రామన్ గారు  రాహువు, కేతువుల మధ్య గ్రహాలు వుంటే ఆ వ్యక్తి జీవితంలో ఉఛ్ఛ స్ధితికి వెళ్ళ వచ్చుట.  అలాగే కేతువు, రాహువుల మధ్య గ్రహాలు వుంటే ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉఛ్ఛ స్ధాయికెళ్తాడుట.  సో, అర్జంటుగా మీకు కాల సర్ప దోషం వుందేమో చూసుకుని, వుంటే సంతోషించండి.

కొంతమంది వుంటారు.  ఇంతకాలం వారి జాతకంలో కాలసర్ప దోషం వుందని నమ్మి ఒక్కసారిగా ఆ నమ్మకాలలోంచి బయటపడలేక, ఎటూ నమ్మలేక సతమతమవుతూ వుంటారు.  అలాంటివారు ఒక్కసారి కాళహస్తిలోగానీ మరెక్కడైనాగానీ కాలసర్ప దోష నివారణకు పూజ చేయించుకుని, ఆ స్వామికి మనస్ఫూర్తిగా నమస్కరించి, ఈ రోజుతో నాకీ దోషం నివారణ అయింది, ఇంక నేను జీవితంలో సుఖంగా, ప్రశాంతంగా వుంటాను అని మనస్ఫూర్తిగా అనుకుని, దానినే నమ్మి, ఆ దోషం గురించి మరచిపోయి హాయిగా వుండాలి.

చూశారా, కొన్ని విషయాలు తెలుసుకోవటం ద్వారా, ధైర్యంగా వుండటం ద్వారా ఎంత లాభమో.

0 comments