Wednesday, June 9, 2010

అయ్య బాబోయ్ నిప్పులు

Wednesday, June 9, 2010



నేను చెప్పేది మండిపోతున్న ఎండలు గురించి కాదండీ బాబూ.  నా కాళ్ళకి వున్న నిప్పుల మూటల గురించి.  అదేంటి కాళ్ళకి నిప్పుల మూటలేంటి.  అసలే ఎప్పుడూ గుళ్ళూ గోపురాలూ అంటూ తిరుగుతూ వుంటావు.  ఏ గుళ్ళోనన్నా కొత్త రకం మొక్కు చూసి చేస్తున్నావా అనకండి.  మరీ ఆటపట్టించకండి.  గుళ్ళల్లో కూడా మీకన్నీ సరిగ్గా చెప్తున్నానా లేదా ఏ విషయమైనా మరచిపోతున్నానా అనే యావేగానీ అసలు దేవుడికి సరిగ్గా దణ్ణమయినా పెడుతున్నానా లేదా అనే అనుమానం నాకే కాదు, మా ఆయనక్కూడా వస్తోంది.  అయితే ఆ నిప్పుల మూటల మాటలేమిటంటున్నారా

అక్కడికే వస్తున్నాను.  ఓ నెల రోజులకిందట కాళ్ళు పగిలాయి.  అది చాలామందికి సర్వ సాధారణం.  పైగా ఆ సమయంలో ఇంట్లో చిన్న చిన్న మరమ్మత్తులు జరిగి ఆ దుమ్మువల్ల కాస్త ఎక్కువయినయి, అవ్వే పోతాయ్ లే అని కొంచెం అశ్రధ్ధ చేశాను.  ఆ అశ్రధ్ధే నాకు పెద్ద శిక్ష వేసింది.  ఆ పగుళ్ళు చాలా లోతుగా, ఇష్టం వచ్చినట్లు పెరిగాయి.  అరికాళ్ళకి నిప్పుల మూటలు కట్టుకున్నట్లు కాలు కింద పెడితే సరిగ్గా నుంచోలేక, అడుగు వెయ్యలేక, భరించలేని మంటలు.  అడుగు తీసి అడుగు వెయ్యటమంటే నరకమే.  కాళ్ళు ఓ స్టూలు మీద జాపి కూర్చుంటే ఎక్కువ బాధ లేదు.  ఈవిడకి రోగమేమిటన్నట్లుంటుంది ఆకారం కూడా.  కొన్నాళ్ళు ఆ ముచ్చట కూడా అయ్యాక ఇంక భరించలేక నేను ఎప్పుడూ మందు తీసుకునే శ్రీ యోగనంద్ గారి దగ్గరకెళ్ళాను.  చూస్తూనే ఆయన అన్నారు మేహ ఉడుకు వల్ల వచ్చింది.  నెలపైనుంచీ వుంది కదా అని.  వెంటనే మందులు, మర్నాటినుంచీ ఉపశమనం మొదలు.

ఇంతకూ చెప్పొచ్చేదేమిటంటే మామూలు కాళ్ళ పగుళ్ళే కదా అని అశ్రధ్ధ చెయ్యకండి.  కొంచెం ఎక్కువగా వుంటే వెంటనే వైద్యం చేయించండి నాలాగా అవస్ధ పడక.  అశ్రధ్ధ వల్లే నేను నెలపైన నరకం అనుభవించాను.



0 comments: