రైలోపాఖ్యానం
(ఆంధ్ర భూమి సచిత్ర వార పత్రిక వారు.... ఆలోచించండి....అనే ఒక క్రొత్త శీర్షిక ప్రారంభించారు. దీనిలో 19-3-2009 సంచికలో ప్రచురించబడిన నా వ్యాసం ఇది).
ఆలోచించండి....హృదయమున్న ప్రతి ఒక్కరూ స్పందించగలిగిన, స్పందించవలసిన కాలమ్ ఇది.
15-02-2009న గుంటూరు నుంచి సికింద్రాబాద్ వచ్చే ఇంటర్ సిటీ ఎక్సప్రెస్ లో విజయవాడలో ఎక్కాం మేము ఏడుగురం. ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసే ఉద్దేశ్యంతో టికెట్లు ముందే రిజర్వు చేసుకున్నాం. విజయవాడలో రైలు ఎక్కడానికి మేము ఏడుగురం మూడు ఎంట్రెన్స్ ల ద్వారా తోసుకుంటూ, నెట్టుకుంటూ, మాకు రిజర్వేషన్ వుంది, జరగండి అని అరుచుకుంటూ చిన్న సైజు దొమ్మీ చేశాం. అంతే కాదు అప్పటికే మా సీట్లల్లో కూర్చున్నవారిని లేపి మరీ కూర్చోవాల్సి వచ్చింది. మాకేం పాపం అంటుకోదులెండి వాళ్ళని లేపినందుకు. వాళ్ళు మా నెత్తినే నుంచుని మరీ కక్ష తీర్చేసుకున్నారు.
స్టేషన్లో రైలాగినప్పుడల్లా దిగేవారు ఒకరిద్దరైతే ఎక్కేవారు పది, పదిహేనుమంది. అందరూ యుధ్ధ వీరులే. అంతలోనే పోట్లాటలు...ఎక్కడ కొట్టుకుంటారో...మీద పడిపోతారేమో....మళ్ళీ అంతలోనే సద్దుబాట్లు...మామూలు మాటలు. హమ్మయ్మ మన వాళ్ళకి సర్దుబాటు గుణం చాలా ఎక్కువగా వుందనిపించింది. లేకపోతే టిక్కెట్టు కొని మరీ ఆరు గంటలు ఆ నరకయాతన ఎలా భరిస్తున్నారు ఇంకో కొంటె ఆలోచన. యమలోకం ఫుల్ అయిందో లేకపోతే అక్కడ కూడా సిబ్బందిలో కోత వల్లనో మనుషులు బ్రతికుండగానే కొన్ని శిక్షలు భూమ్మీద ఇలా వేసేస్తున్నారేమో. ఇది చదివే వాళ్ళలో రైల్వే అధికారులు, ప్రభుత్వాధికారులు వుండొచ్చునని ఆశ, లేదా ఏం చేయగలం అని మీరూ ఆలోచించవచ్చు సరదాగా.
ఇదివరకెప్పుడో మేము కాజీపేట నుంచి సికింద్రాబాద్ ఈ రైల్లోనే వెళ్ళాం. అప్పుడూ ఇంతే. ఈ రైలు తనకి మించిన భారాన్ని తలకెత్తుకుంది. ఇప్పుడూ ఇంతే. ఏమీ మారలేదు.
ఈ రైల్లో ఇంతమంది ప్రయాణిస్తున్నట్లు అసలు రైల్వే వాళ్ళకి తెలిసుండదండీ. ఈ రైలు కసలు టీ.సీ.లు లేరు. మేమీ రెండుసార్లూ చూడలేదు. వున్నా ఆయన కాలు పెట్టే చోటేదీ అదే వుంటే ఇంకో పది మంది ఎక్కేస్తారు. పోనీ దిగాక స్టేషన్ లో టిక్కెట్ కలెక్టరుండి టికెట్లు తీసుకుంటే కొంతయినా లెక్కలు తెలిసేవి. ఆదీ లేదు.
గాలి కూడా చొరబడలేనంత సంఖ్యలో ఒక రైల్లో ప్రయాణీకులు ఎక్కుతున్నారంటే లిమ్కాబుక్కులూ, గిన్నీసు బుక్కుల వాళ్ళేం చేస్తున్నారు మనమంటే అంత అలుసా
సాయంత్రం 4 గంటలకి విజయవాడలో ఎక్కిన వాళ్ళలో పసివారి దగ్గరనుంచీ వయోవృధ్ధుల దాకా, రౌడీలనుంచీ తాగుబోతుల దాకా అనేక రకాల మనుషులు, కాలు కూడా కదపటానికి లేక అలాగే నుంచున్నారు. మరి వీళ్ళకి రైలు వీర, రైలు చక్ర లాంటి బిరుదులిచ్చే వుద్దేశ్యం రైల్వే వారికి వుందా?
అసలు మన వాళ్ళు మరీ ఇంత అమాయకులూ, మంచివాళ్ళూ అయితే ఎలాగండీ? టిక్కెట్టు కొని ఆరు గంటలు అలా నుంచుని ప్రయాణం చేసి నోరు మెదపట్లేదంటే నాదుట్టి మనిషి బుర్రండీ. ఏదో అనుమానం. రైల్వేవాళ్ళకి ప్రింటింగ్ ఖర్టు తగ్గిద్దామని టిక్కెట్లు వాళ్ళ దగ్గరే భద్రంగా వున్నాయా అని.
అవునూ ఈ మధ్య అనేక యాక్సిడెంట్ల గురించి వింటున్నాం. భగవంతుడా ఈ రైలుని సర్వవేళలా కాపాడు.
ఇన్ని కష్టాల్లో ఒకటే సుఖం. తన బరువు తొందరగా వదిలించుకోవాలని రైలు గబగబా పరిగెత్తి టైముకి గమ్యం చేరింది.
సందర్భం వచ్చింది కదా. రైల్వే వాళ్ళకి ఇంకొన్ని సలహాలు మీ తరుఫున గూడా చెప్పేస్తానేం. వాళ్ళు వినకపోతే మాత్రం నన్నడగద్దు.
కంప్యూటర్లకి కూడా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు సీనియర్ సిటిజన్లు అని నేర్పేశారు రైల్వేవారు. అవేమో వీళ్ళని గౌరవించటం వాటి తక్షణ విధి అని, వాళ్ళనెప్పుడూ ఉన్నత స్ధానంలో చూడాలనే సదుద్దేశ్యంతో వాళ్ళకి మిడిల్ బెర్తులూ, అప్పర్ బెర్తులే కేటాయిస్తాయి. వాళ్ళకి మరీ అంత మర్యాద అక్కరలేదు, ఏదో లోయరు బెర్తుల్లో సర్దుకుంటారని కాస్త గట్టిగా చెప్పరూ.
ఇంకో విషయం...సీజను టికెట్టు వాళ్ళు, తక్కువ దూరం ప్రయాణించే వాళ్ళు రైలంతా వాళ్ళ సొంతమైనట్లు స్లీపర్ బోగీలు, ఎ.,సీ.. బోగీలు చెడతిరిగేస్తారు. వాళ్ళకోసం కొన్ని బోగీలు కేటాయిస్తే ఇంచక్కా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళొస్తారు కదా.
రైలు జ్ఞానం లేని దాన్ని ఏదో చెప్పాను. కోపం తెచ్చుకోక కొంచెం ఆలోచించండి.