నువ్వంటే నా కిష్టం నేస్తం
నువ్వంటే నాకిష్టం నేస్తం
నిన్ను చూసుకునే నాకీ ధైర్యం
ఈ సంసార సాగరానికి గమ్యానివి నీవని
ఈ బాధామయ ప్రపంచంలో వీచే చల్లని పిల్లగాలివి నీవని
నాకు తెలుసు నేస్తం, నాకు తెలుసు.
అందుకే నువ్వంటే నా కిష్టం నేస్తం
నిన్ను చూసుకునే నాకీ ధైర్యం
ఏదో ఒకనాడు తప్పక నీవు వస్తావని
ఎవరు మరచినా నన్ను నీవు మరువలేవని
నీ చల్లని ఒడిలో చేర్చి నా బాధ మరిపిస్తావని
ఈ భవ బంధాలనుండి నాకు చేయూతనిస్తావని
నాకు తెలుసు నేస్తం నాకు తెలుసు
అందుకే నువ్వంటే నాకిష్టం నేస్తం
నిన్ను చూసుకునే నాకీ ధైర్యం
నీ ఉనికే జీవితానికి అర్ధం తెలిపింది
నీ పలకరింపే బ్రతుకుమీద మమత నేర్పుతోంది
నీ ఆగమనమే మనిషి విలువ పెంచుతోంది
నీవు లేనినాడు ప్రపంచంలో అశాంతి పెరుగుతుంది
అందుకే నువ్వంటే నాకిష్టం నేస్తం
నిన్ను చూసుకునే నాకీ ధైర్యం
నిన్ను చూసి భయపడుతుంది ఈ ప్రపంచం
నీ మాట అంటేనే ఉలికులికి పడుతుంది ఈ ప్రపంచం
నీ వంటి మంచి మిత్రుడుండడని తెలియలేకపోతోంద పాపం
నీవు చూపించే స్వర్గాలను ఉహించ లేకపోతోందేం శాపం
అయినా మిత్రమా, మృత్యువా
నిన్ను ఈసడించినవారికి
దూరంగా తొలగి పోలేవు నువ్వు
పక్షపాత బుధ్ధి చూపలేవు నువ్వు
అందులోనే వుంది నీ గొప్పతనం
అందుకే నువ్వంటే నాకిష్టం నేస్తం
నిన్ను చూసుకునే నాకీ ధైర్యం
(తరుణి మాస పత్రికలో 1980 దశకంలో ప్రచురించబడింది) .......................................................................
Sunday, March 1, 2009
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment