Tuesday, October 20, 2009

Tuesday, October 20, 2009
కార్తీకమాస విశేషాలు

ఇవాళ జీ తెలుగు గోపురం కార్యక్రమం ఆధారంగా.....

కార్తీక మాసంలో సోదరి విదియ/యమ ద్వితీయ /భగినీ హస్త భోజనం అంటే ఏమిటి? అలా ఎందుకు చెయ్యాలి?

కార్తీక శుధ్ధ విదియనాడు సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్ళ ఆవిడ చేతి భోజనం చేస్తే మంచిదంటారు. భగిని అంటే సోదరి. ఆవిడ పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు.

పురాణాల్లో కధ ప్రకారం యమధర్మరాజు సోదరి యమున. ఆవిడ వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నోసార్లు పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఒకసారి ఈ కార్తీకమాస విదియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండివంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలుకూడా జన ప్రయోజనాలుగా వుంటాయి. ఆవిడ ఈ కార్తీక శుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే, తన సోదరి ఇంటికి వెళ్ళ భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి. అంతేకాదు వారికి అపమృత్యు దోషం (అకాల మరణం) లేకుండావుంటుంది, ఆ సోదరి సౌభాగ్యవతిగా వుంటుంది అని ఇంకా వరాలిచ్చాడుట.

పురాణ కధ ఇది అయితే, ఆడపిల్ల పెళ్ళి అయ్యి అత్తవారింటికి వెళ్ళాక కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ, ఆదరణని పటిష్టం చెయ్యటానికి ఏర్పరిచిన నియమం ఇది అనుకోవచ్చు. మనుషుల మధ్య ప్రేమాభిమానాలనీ, మంచినీ పెంచే ఏ ఆచారాలయినా అవశ్యం ఆచరణీయం కదా.

0 comments: