Monday, October 19, 2009

Monday, October 19, 2009
కార్తీకమాసం విశేషాలు

జీ తెలుగు ప్రసారం చేసే గోపురం కార్యక్రమంలో కార్తీకమాసం విశేషాలు చెప్తున్నారు. ఆసక్తికలవారికోసం ఆ విశేషాలు ఇక్కడ ఇస్తున్నాను.

కార్తీక మాసాన్ని కౌముదీమాసం అనికూడా అంటారు. కౌముది అంటే వెన్నెల. ఈ నెల అంతా వెన్నెల బాగుంటుంది. ఈ మాసంలో తెల్లవారుఝామున నదీ స్నానాలు, దైవ పూజలు, నక్తాలు (ఒంటిపూట భోజనం), ఉసిరి చెట్టుకి పూజలు, వనభోజనాలు, ఓహ్...ఎంత హడావిడోకదా.

కార్తీకమాసంలో తెల్లవారుఝామునే స్నానంచెయ్యాలా? నక్తాలు చెయ్యాలా?

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సూర్యుడు తులారాశిలో వుంటాడు. సూర్యునికి ఇది నీచ స్ధానం. అంటే సూర్యుని ఉష్ణోగ్రత ఈ మాసం అంతా తక్కువగా వుంటుంది. చలికాలం ప్రారంభం అవుతుంది. ఇది మనిషి ఆరోగ్యంమీద ప్రభావం చూపిస్తుంది. మన జీర్ణశక్తి తగ్గుంతుంది. చురుకుతనం తగ్గుతుంది, బధ్ధకం పెరుగుతుంది. శరీరంలో నొప్పులు పెరుగుతాయి. నరాల బలహీనతవున్నవాళ్ళు చలికి ముడుచుకుని పడుకోవటంతో అవి ఇంకా పెరుగుతాయి. వీటన్నిటికీ దూరంగా వుండటంకోసమే, మన ఆరోగ్య రక్షణకోసమే ఈ నియమాలు. తెల్లవారుఝామున నక్షత్రాలుండగానే స్నానం చేసి దీపారాధన చెయ్యాలి, పగలంతా ఉపవాసంవుండి సాయంత్రం నక్షత్ర దర్శనానంతరం ఆహారం తీసుకోవాలి.

తెల్లవారుఝామున లేవటంవలన ఈ కాలంలో సహజంగా వచ్చే ఋగ్మతలనుంచి మనల్ని కాపాడుకోవచ్చు. నక్షత్రాలుండగానే స్నానం, దైవపూజ, వగైరాలవలన బధ్ధకం వదిలి, శారీరకంగా ఉత్సాహంగా వుండటమేకాక, మానసికంగాకూడా చాలా ఉల్లాసంగా వుంటుంది. అలాగే సహజంగా ఈ కాలంలో మనుషుల జీర్ణశక్తి తగ్గుతుంది. నక్తాలవల్ల మన జీర్ణశక్తిని క్రమబధ్ధం చేసినవాళ్ళమవుతాం.

మీరిలా చేస్తే మీ ఆరోగ్యమే బాగుంటుందంటే మనవాళ్ళు వింటారా? అందుకే పధ్ధతి, ఆచారం, పాటించాలి అన్నారు. ఆచారం అని పాటించేవాళ్ళు కొందరయితే, ఏమో పాటించకపోతే ఏమవుతుందో, పాటిద్దామనుకునేవాళ్ళు కొందరు. ఎలాగయితేనేం, మంచి పధ్ధతులు పాటించి తద్వారా శారీరిక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవటం అందరికీ అవసరమేకదా.

ఈ కార్తీకమాస స్నానం గురించి ఒక కధకూడా వుంది. వూర్వం ఒక నది ఒడ్డున చెట్టుమీద ఒక దెయ్యం వుండేది. అది ఆ ప్రక్కగా వచ్చినవాళ్ళందరినీ ఒక ప్రశ్న అడిగేది. అది విని అందరూ దెయ్యానికి భయపడి పారిపోయేవాళ్ళు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు అటుగా వచ్చాడు. దెయ్యం తన ప్రశ్న తన అలవాటు ప్రకారం సంస్కృతంలో వేసింది. అదేమిటంటే ఎవరైనా ఆశ్వీయజం, కార్తీకం, మాఘం, వైశాఖ మాసాల్లో ఏ ఒక్క మాసంలోనైనా తెల్లవారుఝామున స్నానాలు చేస్తున్నారా అని. దానికి ఆ బ్రాహ్మణుడు నేను చేస్తున్నాను అని సమాధానం చెప్పాడు. వెంటనే ఆ దెయ్యం ఆ బ్రాహ్మణుడి కాళ్ళమీదపడి మహానుభావా, నా కీ దెయ్యం రూపం ఒక శాపంవల్ల వచ్చింది. ఇది పోవాలంటే ఈ నాలుగు మాసాల్లో ఏ ఒక్క మాసంలోనైనా తెల్లవారుఝామున స్నానంచేసినవారు వారి స్నాన ఫలాన్ని నాకు ధారపోస్తే నాకు నా రూపం వస్తుంది, నీ స్నాన ఫలాన్ని నాకు ధారపోసి నన్ను శాప విముక్తుణ్ణి చెయ్యని ప్రార్ధించాడు.

అప్పుడా బ్రాహ్మణుడు నేను ఈ నాలుగు మాసాల్లోనేకాదు, అన్ని రోజులూ తెల్లవారుఝామునే స్నానం చేసి దైవపూజ చేసుకుంటాను. నీకు నీ మామూలు రూపం వస్తుందంటే నేను సంతోషంగా వేకువఝామునే నేను చేసిన స్నాన ఫలాన్ని నీకు ధారపోస్తాను అని అలా చేసేసరికి ఆ పిశాచానికి శాప విముక్తి కలిగిందట.

ఇక్కడ అసలు అర్ధం చలికాలంలో తెల్లవారుఝామునే లేచి మనం చేసే స్నాన సంధ్యలవల్ల వ్యాయామం చేస్తాము. పూజలవల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంటే మనకి అన్నివిధాలా ఆరోగ్యం లభిస్తోంది. అలాకాక దుప్పటి కప్పుకుని ముడుచుకు పడుకుంటే హాయిగానే వుంటుంది ఆ కొంచెం సేపూ, తర్వాత ఎంత బధ్ధకంగా వుంటుందో మనకి తెలియనిదా.

అందుకని ఈ కార్తీక మాసంలో మన ఆచారాలను మన పధ్ధతులను కనీసం మనకి చేతనయినంత మటుకూ పాటిద్దాం మనమూ ఆరోగ్యంగా వుందాం. ఏమంటారు


కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి పూజ చెయ్యాలా?


ఉసిరి చెట్టుమీద ఈ కార్తీక మాసంలో నారాయణుడుంటాడనీ అందుకనే ఆ చెట్టుని ధాత్రీ నారాయణుడుగా భావించి పూజ చెయ్యాలనీ శాస్త్రాల్లో చెప్పారు. ఉసిరి చెట్టుకి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి. ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చెయ్యాలి.

ఈ కాలంలో ఉసిరి కాయలు వస్తాయి. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవినిలాంటిది. రోజూ ఉసిరి ఏదో ఒక రూపంలో మనం తినాలి. ఇందులో షడ్రుచులలోని చేదు తప్ప మిగతా ఐదు రుచులు వున్నాయి. ఇది మన జీర్ణశక్తిని కాపాడుతుంది. మన శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది. శరీరంలో సమతుల్యంతీసుకు వస్తుంది. ఈ చెట్టుగాలి కూడా చాలా మంచిది. అందుకే ఈ నెలలో ఈ చెట్టు దగ్గర దీపాలు, పూజలు, ప్రదక్షిణలు, వన భోజనాలు అంటూ ఎక్కువసేపు ఈ చెట్టుదగ్గర గడపేలా చెప్పారు.

0 comments: