Wednesday, January 13, 2010

భోగి పళ్ళకి రేగు పళ్ళనే ఎందుకు పోస్తారు?

Wednesday, January 13, 2010




సంక్రాంతి పండగల్లో భోగి రోజున ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ఇంట్లో పసిపిల్లలకు భోగి పళ్ళుపోసినా రేగు పళ్ళే పోస్తారు.  ఈ కాలంలో వచ్చే అనేక రకాల పళ్ళుండగా రేగు పళ్ళనే ఎందుకు వాడతారు?  వాటికి అంత విశేషం ఎందుకు?  వాటినే భోగి పళ్ళకి ఎందుకు వాడాలి?  రేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు.  పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు.   అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ  చుట్టుపక్కలవున్న చెట్లనుంచి  ఒక్క రేగు పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు.  సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ,  రేగు పళ్ళని తింటూ, ఆ  ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించారు.  ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం.

బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి   సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతారంటారు.  భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు.  వారి ఆశీర్వచనాలతోబాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)





4 comments

Tuesday, January 12, 2010

గ్రహణం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

Tuesday, January 12, 2010




ఆధ్యాత్మికంగా గ్రహణం సమయానికి చాలా విశేషముంది.  గ్రహణం పట్టగానే స్నానం చేసి దీపారాధన చేసి జపం చేసుకుంటే విశేష ఫలితాన్నిస్తుంది.  ముఖ్యంగా నదీ స్నానం చేసి, నదీ తీరాన జపం చేసుకుంటే ఆ ఫలితం ఇంకా ఎక్కువ.

గ్రహణ సమయంలో దేవాలయాలన్నీ మూసేస్తారు కదా,  మరి జపం చెయ్యమంటున్నారు,      అసలు దేవాలయాల్ని ఎందుకు మూస్తారు అనే సంశయంకలగవచ్చు.  ఆగమ  శాస్త్రానుసారం గ్రహణ సమయంలో దేవాలయాల్ని మూసి, తర్వాత ప్రోక్షణ చేసి పూజలు ప్రారంభించాలి.  అందుకే దేవాలయాలు మూసివేస్తారు.

జపం చేసుకోమన్నారుకదాని ఇళ్ళల్లోకూడా దేవతా విగ్రహాలను, పటాలను తాకి పూలు పెట్టి పూజ చెయ్యకూడదు.  కేవలం మానసిక జపం మాత్రమే చెయ్యాలి.  గ్రహణం సమయంలో చేసే జపం మామూలుగా చేసే దానికన్నా అనేక రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుందంటారు.  గ్రహణ సమయంలో ఆవు నెయ్యతో దీపారాధన చేసి, దాని ముందు కూర్చుని జపం చేస్తే, ఆ మంత్రంతో హోమం చేసినంత ఫలితాన్నిస్తుంది. ఏదైనా మంత్రం అక్షర లక్షలు చేసినప్పుడు మంత్రసిధ్ధి కలుగుతుంది.  అంటే మంత్రంలో ఎన్ని అక్షరాలు వున్నాయో (ముందునుంచి వెనుకకి, వెనకనుంచి ముందుకి) అన్న లక్షలసార్లు  ఆ మంత్రాన్ని శ్రధ్ధా భక్తులతో జపిస్తే మంత్రం సిధ్ధిస్తుందంటారు. 

అయితే అందరూ ఈ జపాలు చేయలేరు.  శారీరకంగా అశక్తులు వుండవచ్చు, ఉద్యోగరీత్యా, ఇంకా ఇతర పనులవల్ల కుదరకపోవచ్చు.  అలాంటివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమైనా వున్నాయా.  శాస్త్ర ప్రకారం సూర్య గ్రహణానికి 12 గం. ముందునుంచీ, చంద్ర గ్రహణానికి 9 గం.ల ముందునుంచీ కడుపు ఖాళీగా వుండాలి.  ఈ సమయంలో ఏమైనా తినటంవల్ల అనారోగ్యం కలుగవచ్చు.  అందుకని ఈ జాగ్రత్త.  అలాగే గ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదు.  ఎలాంటి ఉపకరణాలూ లేకుండా నేరుగా కంటితో గ్రహణాన్ని చూడటం వల్ల కంట్లో ఏర్పడే దోషాలను ఏ చికిత్సతోనైనా బాగు చేయటం చాలా కష్టమని పద్మశ్రీ డా. శివారెడ్డి, ప్రసిధ్ధ కంటి వైద్య నిపుణులు,  అన్నారు. 

గర్భస్ధ శిశువుల మీద గ్రహణ సమయంలో కిరణాల ప్రభావం చాలా వుంటుందని డా. అపర్ణా సక్శేనా గర్భస్ధ ఎలుకలమీద చేసిన ప్రయోగాలతో కనుగొన్నారు.  ఆ కిరణాలలో వుండో రేడియో ధార్మిక శక్తి  వలన ఆ ఎలుకలకి పుట్టిన పిల్లలలో ఎముకలు, మజ్జలో లోపాలు, అవయవాలు సరిగ్గా తయారు కాకపోవటం వగైరా లోపాలు కనుగొన్నారు.  అందుకే గర్భిణీలు గ్రహణ సమయంలో బయట తిరగకూడదన్నారు.

ఇంక దర్భల విషయం చూద్దాం.  ఇళ్ళల్లో శుభా శుభ కార్యాలకి వాడే దర్భలు చాలామందికి తెలిసే వుంటుంది.  గ్రహణం రోజున చాలామంది ఈ దర్బలని తాగే నీళ్ళమీదా, తినే వస్తువులమీదా, ఊరగాయలమీదా వేస్తారు.  కొందరు దీనిని ఎగతాళి చేస్తారు.  విక్రమ్ సారాబాయ్ పరిశోధనా  కేంద్రం చేసిన పరిశోధనలో గ్రహణ సమయంలో నీటి శ్రేష్టత తగ్గిపోతుందనీ, ఈ దర్భలవల్ల నీటి శ్రేష్టత పెరుగుతుందనీ కనుగొన్నారు.  వీటివల్ల మేలు జరుగుతోందని సైంటిఫిక్ గా పరిశోధనలు చేసి ఋజువు చేసిన తర్వాత ఈ పధ్ధతులు పాటించటం, పాటించకపోవటం అనేది మన ఇష్టాఇష్టాలమీద ఆధారపడి వుంటుంది.  మూఢ నమ్మకాలు అని సణుక్కుంటూ ఆచరించినా తప్పులేదు...ఆ మూఢ నమ్మకాలవల్ల మనకి మేలు జరిగేటప్పుడు. 

మన పూర్వీకులు ఏ సైన్స్ ఏ పరిశోధనలు లేని కాలంలో ఎంత విజ్ఞానంతో, ఎంత దూరం ఆలోచించి, ఎన్నో తరాలదాకా ప్రజలకి మేలు చేసే విషయాలనెన్నిచెప్పారో!!!   ఆశ్చర్యంగా వుంది కదూ!!!!!


(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)





3 comments

Sunday, January 3, 2010

షష్టిపూర్తి వగైరా ఉత్సవాలు ఎందుకు చేస్తారు?

Sunday, January 3, 2010


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పరాశరుడి వింశోత్తరి ప్రకారం, మనిషి ఆయుః ప్రమాణం 120 సంవత్లరాలు.  నవ గ్రహాలకివున్న దశలన్నీ కలిపితే 120 సంవత్సరాలు.  దీని ఆధారంగా మనిషి ఆయుష్షు ప్రమాణం నిర్ణయించి వుండవచ్చు.  మానవుడు పూర్ణాయుర్దాయంతో మృత్యుదోషాలు లేకుండా శాంతిగా బ్రతకాలనే ఉద్దేశ్యంతో ఈ ఉత్సవాలు జరుపుతారు.

బ్రతికున్నన్నాళ్లూ అందరూ ఆరోగ్యంగా వుండాలనే అనుకుంటారు.  కానీ మనిషికి 59 సంవత్సరాలు పూర్తయి, 60 వ సంవత్సరం రాంగానే ఉగ్రరధ అనే మృత్యుపీడ పీడిస్తుందట.  అందుకే 60 సంవత్సరాలు పూర్తికాగానే షష్టిపూర్తి చేస్తారు (ఆ మృత్యు పీడనుంచి తప్పించుకున్నందుకా)  అలాగే 70 వ సంవత్సరం ప్రారంభం కాంగానే భీమరధ అనే మృత్యు పీడ.  వీటిబారిన పడకుండా ఆయురారోగ్యాలతో వుండాలని శాంతి జరుపుతారు.   70 వ సంవత్సరాలకు చేసే ఈ శాంతి ప్రక్రియ గురించి సమాజంలో ఎక్కువమందికి తెలియదు.  చాలా తక్కువమంది చేసుకుంటారు ఈ ఉత్సవం.  84 సంవత్సరాల 3 నెలలు పూర్తి చేసుకున్నవారికి సహస్ర చంద్ర దర్శనం అని (వారు వెయ్యి పౌర్ణమిలు చూశారని) చాలా పెద్ద ఎత్తులో శాంతి ఉత్సవం చేస్తారు.  ఈ ఉత్సవాలన్నీకూడా మనిషికి  ఆయా వయసుల్లో వచ్చే మృత్యుపీడలు పోయి ఆరోగ్యంగా వుండాలనే ఉద్దేశ్యంతో చేసేవి.

ఇంకా కొన్ని ఉత్సవాలు వున్నాయి.  మనిషి పోయాక కూడా జయంతి, వర్ధంతి, శత జయంతోత్సవం లాంటివి.  ఇవి సమాజానికి గొప్ప సేవలు చేసినవారిని గుర్తు చేసుకోవటానికిగానీ, వారి వారి రంగాలలో గొప్ప నైపుణ్యాన్ని సంపాదించి తద్వారా సమాజ శ్రేయస్సుకు దోహద పడ్డవారిని గుర్తుచేసుకోవటానికిగానీ  ప్రజలు చేసే ఉత్సవాలు ఇవి.  ఈ ఉత్సవాలు వారు సమాజానికి చేసిన సేవలు గుర్తుచేసుకుని వారిని భక్తిపూర్వకంగా సంస్మరిస్తూ చేసే ఉత్సవాలు.  వీటివల్ల ఆ మహనీయులు సాధించిన విజయాలు గుర్తుచేసుకుని అందరూ ప్రేరణ పొందవచ్చు.

మరి కొన్ని ఉత్సవాలు...అవేనండీ...సినిమా శత దినోత్సవాలు, వజ్రోత్సవాలు వగైరా.  మరి ఇవి ఎందుకు చేస్తారు?   ఒక సినిమా మొదలు పెట్టిన దగ్గరనుంచీ పూర్తయ్యేదాకా ఎంతోమంది సమిష్టి కృషి, ఇంకెందరో సహకారం,  అందులో పని చేస్తున్నవారందరి మధ్యా సఖ్యతా అవసరమవుతాయి.  అలాగే ఆ సినిమా విజయవంతమవటానికి ప్రజల ఆదరణ చాలా అవసరం.  ఇలా ఎందరో సమిష్టి కృషి, ఆదరణ, ప్రోత్సాహం కారణంగా విజయవంతమయిన ఆ సినిమా శత దినోత్సవం వగైరా ఉత్సవాలమూలంగా వారి ఉత్సాహం ఇంకా పెరిగి ఇంకా ఇలాంటి మంచి చిత్రాలు  తియ్యటానికి బలాన్ని చేకూర్చుకుంటారు.

ఒక విధంగా ఈ ఉత్సవాలు టానిక్కులలాంటివి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)
















1 comments

Saturday, January 2, 2010

ఆశీర్వచనం ఎందుకు చేస్తారు అసలు దానికి ప్రభావం వుంటుందా?

Saturday, January 2, 2010




భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది.  అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు.  విద్యార్ధులను విద్వా ప్రాప్తిరస్తు అని, పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, జన్మ సావిత్రీ భవ అని, పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ వగైరా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు.

యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో  అక్కడ పండితులు  గో బ్రాహ్మణో  శుభంభవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు......... అనే ఆశీర్వచనంతో దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు,  ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృధ్ధి చేసే మనవలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ, వగైరా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు.

అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా?  అవి ఫలిస్తాయా?   తప్పకుండా ఫలిస్తాయి.  సత్పధంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి.  ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు తొలుగుతాయి, అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి.  అంతేకాదు, పూర్వ జన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు.

గురువులు, సిధ్ధులు, యోగులు, వేద పండితులు, మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు.  అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు, వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


మనలో మాట
దేనికైనా నమ్మకం ముఖ్యం.   ఈ విషయాల్లో నమ్మకమున్నా లేక పోయినా పెద్దలని గౌరవించటం, విద్వత్తుని గౌరవించటం మన సంస్కారానికి నిదర్శనంకదా.


0 comments

Friday, January 1, 2010

సంతోషం సగం బలం అంటారు, ఎందుకు?

Friday, January 1, 2010




ఎప్పుడూ అందరూ సంతోషంగా వుండాలనీ, బాధలూ, కష్టాలూ లేకుండా హాయిగా వుండాలనే ఉద్దేశ్యంతోనే మన పెద్దలు సంతోషం సగం బలం అని చెప్పారు.  అయితే అందరూ ఎప్పుడూ సంతోషంగా వుండలేరు కదండీ.  మనుషులన్న తర్వాత కష్టాలూ తప్పవు.

అసలు మన మనుష్యులలో రెండు రకాలవారుంటారండీ.  ఒక రకంవారు  పాజిటివ్ ధింకర్స్.  ఎంత గడ్డు సమస్య ఎదురయినా నిబ్బరంగా వుంటారు.  సమస్య వచ్చిందని కంగారు పడకుండా దాన్ని తప్పించుకునే మార్గాన్ని వెతుక్కుంటారు.  అవసరాన్నిబట్టి అప్పటి ఆర్ధిక, సామాజిక, వాతావరణ ప్రభావాలూ, కుటుంబ సభ్యుల సానుకూలత వగైరాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలా చేస్తే ఆ సమస్య ఇబ్బంది లేకుండా పరిష్కారమవుతుందని ఆలోచించి, కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో చర్చించి పరిష్కార మార్గాన్ని నిర్ణయించుకుంటారు.  ధైర్యంగా ఆ సమస్యనెదుర్కుని విజయం సాధిస్తారు.

ఇంకో కోవకి చెందినవారుంటారండీ.  వారికి సమస్యలు లేకపోయినా అతి చిన్న విషయాలనుకూడా భూతద్దంలో చూసి, ఏవేవో ఆలోచనలు చేసి, ఇంకేవో ఊహించుకుని వాళ్ళు కంగారుపడి, చుట్టుపక్కలవారిని కంగారు పెట్టి, చివరికి చికాకు పెట్టి  కొండొకచో బాధపెట్టి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చివాట్లు తిని లేని సమస్యలలు కొని తెచ్చుకుని మరీ పెద్దవి చేసుకుంటారు.  ఏ రోజూ వాళ్ళు సుఖంగా వుండరు, చుట్టుప్రక్కలవారిని సుఖంగా వుండనీయరు.  ఇలాంటివారు మనవారయితే (అంటే మనం చెప్తే వినేవారయితే) నచ్చచెప్పి సరైన దోవలో పెట్టటం, లేకపోతే మన దోవ మనం చూసుకోవటం....అదేనండీ మన జాగ్రత్తలో మనం వుండటం వుత్తమం.  కదా

ఈ అనవసరమైన ఆలోచనలు, ఆందోళనలు, కోపతాపాలూ మనిషి శరీరం మీదకూడా చాలా పని చేస్తాయి.  బీపీ, నరాల బలహీనత, టెన్షన్, డిప్రెషన్, తెలిసినవీ తెలియనివీ అనేక రోగాలబారినపడి ఇంకా సమస్యలు పెరుగుతాయి.  అందుకునే ఈ బాధలేమీ కొని తెచ్చుకోకుండా మనం ప్రశాంతంగావుండి,  ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య స్వరూప స్వభావాలగురించి సరైన ఆలోచనలుచేసి, అవసరమయితే ఆత్మీయుల సలహాలు తీసుకుని, సరైన నిర్ణయాలు తీసుకుని సరైన పరిష్కారాలు వెతుక్కుంటే మనం ఆరోగ్యంగా వుంటాం, ఆరోగ్యంగా వుంటే సంతోషంగా వుంటాం, మనం సంతోషంగా వుంటే మన చుట్టుపక్కలవారూ సంతోషంగా వుంటారు.  సంతోషం ఆరోగ్యానికి దారితీస్తుంది.  ఆరోగ్యం బలాన్నిస్తుంది.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)




3 comments