Friday, January 1, 2010

సంతోషం సగం బలం అంటారు, ఎందుకు?

Friday, January 1, 2010




ఎప్పుడూ అందరూ సంతోషంగా వుండాలనీ, బాధలూ, కష్టాలూ లేకుండా హాయిగా వుండాలనే ఉద్దేశ్యంతోనే మన పెద్దలు సంతోషం సగం బలం అని చెప్పారు.  అయితే అందరూ ఎప్పుడూ సంతోషంగా వుండలేరు కదండీ.  మనుషులన్న తర్వాత కష్టాలూ తప్పవు.

అసలు మన మనుష్యులలో రెండు రకాలవారుంటారండీ.  ఒక రకంవారు  పాజిటివ్ ధింకర్స్.  ఎంత గడ్డు సమస్య ఎదురయినా నిబ్బరంగా వుంటారు.  సమస్య వచ్చిందని కంగారు పడకుండా దాన్ని తప్పించుకునే మార్గాన్ని వెతుక్కుంటారు.  అవసరాన్నిబట్టి అప్పటి ఆర్ధిక, సామాజిక, వాతావరణ ప్రభావాలూ, కుటుంబ సభ్యుల సానుకూలత వగైరాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలా చేస్తే ఆ సమస్య ఇబ్బంది లేకుండా పరిష్కారమవుతుందని ఆలోచించి, కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో చర్చించి పరిష్కార మార్గాన్ని నిర్ణయించుకుంటారు.  ధైర్యంగా ఆ సమస్యనెదుర్కుని విజయం సాధిస్తారు.

ఇంకో కోవకి చెందినవారుంటారండీ.  వారికి సమస్యలు లేకపోయినా అతి చిన్న విషయాలనుకూడా భూతద్దంలో చూసి, ఏవేవో ఆలోచనలు చేసి, ఇంకేవో ఊహించుకుని వాళ్ళు కంగారుపడి, చుట్టుపక్కలవారిని కంగారు పెట్టి, చివరికి చికాకు పెట్టి  కొండొకచో బాధపెట్టి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చివాట్లు తిని లేని సమస్యలలు కొని తెచ్చుకుని మరీ పెద్దవి చేసుకుంటారు.  ఏ రోజూ వాళ్ళు సుఖంగా వుండరు, చుట్టుప్రక్కలవారిని సుఖంగా వుండనీయరు.  ఇలాంటివారు మనవారయితే (అంటే మనం చెప్తే వినేవారయితే) నచ్చచెప్పి సరైన దోవలో పెట్టటం, లేకపోతే మన దోవ మనం చూసుకోవటం....అదేనండీ మన జాగ్రత్తలో మనం వుండటం వుత్తమం.  కదా

ఈ అనవసరమైన ఆలోచనలు, ఆందోళనలు, కోపతాపాలూ మనిషి శరీరం మీదకూడా చాలా పని చేస్తాయి.  బీపీ, నరాల బలహీనత, టెన్షన్, డిప్రెషన్, తెలిసినవీ తెలియనివీ అనేక రోగాలబారినపడి ఇంకా సమస్యలు పెరుగుతాయి.  అందుకునే ఈ బాధలేమీ కొని తెచ్చుకోకుండా మనం ప్రశాంతంగావుండి,  ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య స్వరూప స్వభావాలగురించి సరైన ఆలోచనలుచేసి, అవసరమయితే ఆత్మీయుల సలహాలు తీసుకుని, సరైన నిర్ణయాలు తీసుకుని సరైన పరిష్కారాలు వెతుక్కుంటే మనం ఆరోగ్యంగా వుంటాం, ఆరోగ్యంగా వుంటే సంతోషంగా వుంటాం, మనం సంతోషంగా వుంటే మన చుట్టుపక్కలవారూ సంతోషంగా వుంటారు.  సంతోషం ఆరోగ్యానికి దారితీస్తుంది.  ఆరోగ్యం బలాన్నిస్తుంది.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)




3 comments:

Anonymous said...

ఎలాగూ ఎదురయ్యే కష్టాల గురించి ఆలోచించి భాద పడి ప్రయోజనం లేదు కాబట్టి, సమస్య పరిష్కారం దిశగా ఆలోచిస్తే మనసు ఆందోళన చెందకుండా ఉంటుంది. అలా ఆలోచించాలంటే, ముందు మనం సంతొషంగ ఉండాలి .

మాలా కుమార్ said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు .

psm.lakshmi said...

Happy New Year Mala garu, Manosri garu.
psmlakshmi