Wednesday, January 13, 2010

భోగి పళ్ళకి రేగు పళ్ళనే ఎందుకు పోస్తారు?

Wednesday, January 13, 2010




సంక్రాంతి పండగల్లో భోగి రోజున ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ఇంట్లో పసిపిల్లలకు భోగి పళ్ళుపోసినా రేగు పళ్ళే పోస్తారు.  ఈ కాలంలో వచ్చే అనేక రకాల పళ్ళుండగా రేగు పళ్ళనే ఎందుకు వాడతారు?  వాటికి అంత విశేషం ఎందుకు?  వాటినే భోగి పళ్ళకి ఎందుకు వాడాలి?  రేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు.  పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు.   అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ  చుట్టుపక్కలవున్న చెట్లనుంచి  ఒక్క రేగు పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు.  సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ,  రేగు పళ్ళని తింటూ, ఆ  ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించారు.  ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం.

బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి   సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతారంటారు.  భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు.  వారి ఆశీర్వచనాలతోబాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)





4 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.మీకు,మీ కుటుంబానికి భోగి పర్వదిన శుభాకాంక్షలు.

మాలా కుమార్ said...

మీకు సంక్రాంతి శుభాకాంక్షలు .

SRRao said...

ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

psm.lakshmi said...

విజయమోహన్ గారూ, మాలా కుమార్ గారూ, రావుగారూ,
ధన్యవాదాలు. మీకూ, మీ కుటుంబాలకూ సంక్రాంతి శూభాకాంక్షలు.
psmlakshmi