Wednesday, March 18, 2009

శపధం - లఘు నాటిక

Wednesday, March 18, 2009

శపధం



(నేను వ్రాసిన ఈ లఘు నాటిక మహిళా దినోత్సవ సందర్భంగా 4-3-2009 న హైదరాబాదు ఎ.జీ. ఆఫీసు ఆరుబయలు రంగస్ధలంలో ప్రదర్శింపబడింది. ప్రముఖ నటుడు, టి.వి. ఆర్టిస్టు శ్రీ పెరుమాళ్ళు దర్శకత్వం వహించారు.)

పరిచయ వాక్యాలు తెరలోంచి
(తరాలు మారుతున్నాయి. స్త్రీలు ఎంతో పురోభివృధ్ధి చెందుతున్నారు. అనేక రంగాలలో ఎదుగుతున్నారు. అయినా, ఆడవారి కన్నీటి గాధలు మాత్రం కనుమరుగు కాలేదు. కష్టాలు కడతేరలేదు.... రూపు రేఖలు మార్చుకుని కొత్త కష్టాలు తయారవుతున్నాయి...... కొత్త నేరాలు పెరుగుతున్నాయి....అతివల ప్రాణాలకి విలువ లేకుండా పోతోంది....ప్రేమ పేరుతో అమాయకుల ప్రాణాలు అవలీలగా తీసుకోవటం ఇప్పుడు ఆటయింది. వీటినిలా సాగనివ్వాల్సినదేనా ఆపటానికి మనవంతు ప్రయత్నం ఏంచెయ్యాలి అనే ఆలోచనలోంచి వచ్చిందే ఈ శపధం. ఘోర ప్రేమకి బలైపోయిన అమాయకుల ఆర్తనాదాలు ఇవి. వీటిని ఆపటానికి అందరూ కలసి చెయ్యవలసినదే ఈ శపధం.)


రమః-- హలో నేను గుర్తున్నానా నేనండీ. రమని. నిన్న మొన్నటిదాకా మీ మధ్య తిరుగుతూ మీతో సంతోషంగా గడిపినదాన్ని. మా అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతుర్ని. మా అమ్మా నాన్నా నన్నెంత ప్రేమగా చూసుకునేవాళ్ళో.. వాళ్ళపాలిటి్ పెన్నిది అన్నారు నన్ను. చదువుల సరస్వతి అని మెచ్చుకునే వాళ్ళు. ఎంతయినా చదువుకోమన్నారు. అమ్మ చిన్న పని కూడా చెప్పేది కాదు. పెళ్ళయితే బాధ్యతలూ పనులూ తప్పవు. మా దగ్గర మహా రాణిలాగా బతుకు అనేది. అమ్మా, నాన్నా, చదువు, స్నేహితులతో ఆట పాటలు తప్ప వేరే లోకం లేని నేను ఆ రాక్షసుడుకెలా నచ్చానో తెలియదు. ప్రేమ ప్రేమ అంటూ వెంటపడ్డాడు.

(ఉమ ప్రవేశం)

ఉమః-- హాయ్ రమా నన్ను గుర్తు పట్టావా. ఉమని. నీ కధ నాకు తెలుసు.

రమః-- తెలుసా అయితే నన్ను నమ్ముతావా నాకు చదువు తప్ప ప్రేమా గీమా ఏమీ తెలియదు. ఎవరో అనుకున్నట్లు నేనెవర్నీ మోసం చెయ్యలేదు.

ఉమః-- నాకు తెలుసు రమా. నువ్వు చాలా మంచిదానివి. నేను నిన్ను నమ్ముతాను. ఎందుకంటే నేనూ నీలాగే వ్రేమాగ్నికి ఆహుతి అయిన సమిధనేగా. మా అమ్మా నాన్నా ఎంత ప్రేమగా చూసుకునేవాళ్ళు మమ్మల్ని. ఎంత అందమైన జీవితాన్నిచ్చారు మాకు.

(సుమ ప్రవేశం. వస్తూనే) అవును. మా అమ్మా నాన్నా కూడా . ఎంత హాయిగా వుండేవాళ్ళం. మా తమ్ముడు. ఆ వెధవతో అల్లరి చెయ్యకపోతే నాకేమీ తోచేది కాదు. ఇద్దరం ఇంటినపడి ఎంత అల్లరి చేసేవాళ్ళం. ఇప్పడా ఇల్లు ఒక శ్మశానం లాగా వుంది.

రమః-- నువ్వు

సుమః-- నేను సుమని. మీ మాటలు విని ఇటు వచ్చా. నేనూ మీ కోవకి చెందినదాన్నే.

ఉమః-- నిన్నూ ఎవడైనా ప్రేమించాడా
సుమః-- ఊ. ప్రేమించానన్నాడు. అమ్మా, నాన్నా, తమ్ముడూ, ఇలా నన్ను ప్రేమించిన వాళ్ళంతా నేను సంతోషంగా వుండాలనుకుంటే ఈ వెధవమాత్రం ప్రేమ పేరుతో నా జీవితాన్ని నరకం చేశాడు. చివరికి యాసిడ్ పోసి నన్నే చంపేశాడు. ఇదేనా ప్రేమంటే

(రమా, ఉమా) అమ్మో (అంటూ యాసిడ్ వాళ్ళమీదే పడ్డట్లు ముఖాలమీద చేతులు పెట్టుకుని భయంతో ఒక్కడుగు వెక్కి వేస్తారు.)

(సుమ గడగడా వణికి పోతుంది. యాసిడ్ అప్పుడే పోసినట్లు, ఆ బాధ తట్టుకోలేనట్లు...)
సుమ మంటలు మంటలు. అబ్బ. వారం రోజులు ఆ నరకం అనుభవించిన తర్వాత ప్రాణాలే పోగొట్టుకున్నాను.

రమః-- ఆ బాటిల్ లాక్కుని వాడి మొహాన్నే కొట్టుండాల్సిది.

సుమః--(అంత బాధననుభవుంచిన తర్వాత నీరసంతో) ఆ సమయంలో అంత తోస్తుందా. నేనూహించని సంఘటన అది.

ఉమః-- నిజమే నిన్ను క్లాసు రూములో కత్తితో పొడుస్తుంటే నువ్వే కాదు. నీ చుట్టూవాళ్ళు కూడా ఏమీ చెయ్యలేకపోయారు కదా. నన్ను నడిరోడ్డులో కత్తితో పొడిస్తే ఏం చేశాం.

రమః-- మనమేమీ చెయ్యలేక పోయాము. అందరూ తేరుకునేసరికి వాళ్ళు పారిపోయారు. గొప్ప ప్రేమికులు.

సుమః-- అసలు వాళ్ళెవరో ప్రేమిస్తే మనం ప్రేమించక్కరలేదా. కాదన్న నేరానికి మనమిలా బలి కావాలా ఇదెక్కడి న్యాయం ప్రేమంటే ఇదేనా. ఎదుటివాళ్ళు ప్రేమించకపోతే చంపెయ్యటమేనా

ఉమః-- వాళ్ళ మొహం. ప్రేమా దోమా. సరైన ప్రేమా సిన్సియారిటీ వాళ్ళకెక్కడేడిశాయ్.

సుమః-- అవ్వే వుంటే జీవితాల విలువ తెలిసేది. అవ్వేమిటో తెలియదుగనుకే అమ్మా నాన్నా గాలికొదిలేస్తే ఏం చెయ్యాలో తోచక ఇలా జనం మీద పడతారు.

రమః-- వాళ్ళ అమ్మా నాన్నా మన అమ్మా నాన్నల్లాంటి వాళ్ళు కారా

ఉమః-- ఎవరికి తెలుసు వాళ్ళు బాధ్యత లేని వాళ్ళో వీళ్ళు బరితెగించినవాళ్ళో.

సుమః-- ఎవరెలాంటి వాళ్ళయినా నష్టపోయింది మనం, మన కుటుంబాలు.

రమః-- పాపం. అమ్మా నాన్నా నా కోసం ఎంత బాధ పడుతున్నారో. వాళ్ళేం పాపం చేశారని వాళ్ళ కీ శిక్ష.

ఉమ-- మా అమ్మ దిగులుతో మంచంమీదనుంచి లేవటంలేదు. చెల్లయితే బయటకు వెళ్ళటానికే భయపడుతోంది. ఆ వెధవ మూలంగానే కదా మాకీ కష్టాలన్నీ.

రమః-- అసలు మనల్నింత బాధపెట్టే హక్కు వీళ్లకెవరిచ్చారు

సుమః-- బోడి ప్రేమ వాడొక్కడే ప్రేమిస్తే సరిపోతుందా. ఎదుటివాళ్ళు ప్రేమించక్కర్లేదా

ఉమః-- మనమేమైనా ప్రేమ కోసం వెంపర్లాడామా మనం, మన చదువు, మన కెరీర్ వీటితోనే సతమతమవుతుంటే ప్రేమకీ దోమకీ టైమెక్కడిది.

సుమః-- ఎవడో ప్రేమిస్తున్నానంటే పళ్ళికిలించుకుంటూ మనమూ ప్రేమించెయ్యాలా మన అభిప్రాయాలకీ, మన కోరికలకీ విలువ లేదా.

రమః-- అక్కడికీ చెప్పాను. నాకు కెరీర్ ముఖ్యం. నాకలాంటి ఆలోచనే లేదని.

ఉమః-- వినలేదు. వాడి ఖర్మ అని వదిలేశాను.

సుమః-- ఇంకా విసిగిస్తుంటే ఇంట్లో చెప్పాను.

రమః-- వాళ్ళు చెప్పి చూసినా వినకపోతే పోలీసులకు చెప్పారు.

ఉమః-- వాళ్లేం చేశారు

రమః-- కంపైంట్ తీసుకుని యాక్షను తీసుకుంటామన్నారు.

సుమః-- నన్ను కూడా అనుమానించి ప్రశ్నలతో విసిగించారు.

ఉమః-- అసలు మన జీవితాలతో ఆడుకునే హక్కు వీళ్ళకెవరిచ్చారు

రమః-- మనల్ని చంపే అధికారం వీళ్ళకెవరిచ్చారు

సుమః-- అంతగా పిచ్చెక్కితే ఆ చావేదో వాళ్ళే చావచ్చుగా మనల్ని చంపటం ఎందుకు

రమః-- చూసే వాళ్ళు కూడా చోద్యం చూశారేగానీ ఇదేమిటని ఒక్కళ్ళన్నా అడిగారా

ఉమః-- రోజు రోజుకీ ఈ ఘోరాలు పెరిగి పోతున్నాయి.

సుమః-- అడిగేవాళ్ళు లేరని పెట్రేగి పోతున్నారు.

రమః-- వీటిని ఇలాగే సాగనిస్తారా

ఉమః-- ఇవాళ మేమయ్యాము

సుమః-- రేవు మీ వాళ్ళు

రమః-- మీ వాళ్ళు

ఉమః-- మీ వాళ్ళు కావచ్చు

సుమః-- ఆ రేపు రానియ్యకండి

రమః-- ఆలోచించండి

ఉమః-- అమాయక జీవులతో ఆటలాడుకోవద్దు

సుమః-- ప్రేమ పేరుతో ప్రాణాలు తియ్యద్దు

రమః ఈ ఘోరాల్ని ఆపండి.

ఉమః తల్లి దండ్రుల ఉసురు పోసుకోవద్దు.

సుమః కాలేజీ విద్యార్ధుల్లారా ఇది మీ కాలేజీ విద్యార్ధులకు సంబంధించిన విషయం

రమః-- తల్లి దంఢ్రులారా, ఇది మీ పిల్లలకు సంబంధించిన విషయం

ఉమః -- సోదర సోదరీ మణులారా, ఇది మీ తోబుట్టువులకు సంబంధించిన విషయం

రమః-- మాకెందుకులే అని వూరుకోకండీ.

సుమః అందరూ కలసికట్టుగా పోరాడండి.

రమః-- ఇలాంటి అన్యాయాలు ఎక్కడ కనిపించినా అడ్డుకోండి

(ముగ్గురీ కలసి) మాలాంటి వాళ్ళని బ్రతికించండి. మాకు బతకాలని వుంది. మమ్మల్లి బతికించండి.

(ఆడియన్సులోంచి ఒక్కొక్కళ్ళూ ఒక్కో డైలాగు చెప్తూ కొందరు లేచి రావాలి).

అవును. ఈ అన్యాయాలు సాగనివ్వం. మా విద్యార్ధులకు మేము తోడుగా వుంటాం.

మా బిడ్డలకు మేము తోడుగా వుంటాం.

మా తోబుట్టువులకు మేము తోడుగా వుంటాం.

ఒకరికొకరం మేము తోడుగా వుంటాం.

ఈ అన్యాయాన్నెదిరిస్తాము.

మిమ్మల్ని బతికిస్తాము.

మిమ్మల్ని బతికిస్తాము.












3 comments:

జీడిపప్పు said...

చాలా బాగుంది. తరాలు మారుతున్నాయి. అయినా కథలు మారడం లేదు. అవే మూస కథలు, అవే పాతచింతకాయపచ్చళ్ళు.

psmlakshmiblogspotcom said...

thanks జీడిపప్పు గారూ. పత్రికల్లో ఇలాంటి వార్తలు విన్నప్పుడు చాలా బాధగా వుంటుంది. అన్యాయాలు అరికట్టాలంటే సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి..స్పందించాలి అనుకుంటాను.

psmlakshmi

psmlakshmiblogspotcom said...

అన్నట్లు మా ఆఫీసులో ప్రదరిశన కూడా చాలా ప్రశంసలు అందుకుంది. కొందరు అది చూసి కళ్ళు చమర్చాయన్నారు.
psmlakshmi