Sunday, May 10, 2009

అమ్మ

Sunday, May 10, 2009
అమ్మ

శ్రీమతి పులిగడ్డ జయలక్ష్మీ సుశీల
1928--1963

అమ్మ

అమ్మ అన్నదీ ఒక కమ్మని మాటా....మాటల్లో కూడా

కమ్మనివీ, కారంవీ వుంటాయాండీ అంటే వుంటాయి. అది

అనుభవించే మనసుకే తెలుస్తుంది. ముఖ్యంగా ప్రేమ,

ఆత్మీయత, అనుబంధాలకి సంబంధించిన బంధాలు

అనుభవిస్తేనే అర్ధాలు తెలుస్తాయి.

ఏ మనిషికైనా అనుబంధం, ఆత్మీయతా మొదలయ్యేది

అమ్మతోనే. అమ్మే శరీరమివ్వాలి. అమ్మ ప్రాణమివ్వాలి,

అమ్మ జన్మనివ్వాలి. అమ్మ పాలు పట్టాలి, అమ్మ లాల

పొయ్యాలి, అమ్మ మల మూత్రాలు ఎత్తాలి. అమ్మ బువ్వ

పెట్టాలి. అమ్మ తనతో ఆడాలి. అమ్మ తన అలకలు

తీర్చాలి. అమ్మ స్కూలుకి తీసుకెళ్ళాలి. అమ్మ హోం

వర్కు చేయించాలి. అమ్మ తనకిష్టమైనవన్నీ వండి పెట్టాలి.

ఇలా తను ప్రయోజకుడయ్యేదాకా ప్రతి అవసరానికీ అమ్మ

మీద ఆధారపడ్డ మనిషి అమ్మను పీల్చి పిప్పిచేసి తను

ప్రయోజకుడై అమ్మని వీధిపాలు చేస్తున్నాడు. అమ్మకి

స్వార్ధం లేదు. అందుకే అందరి గురించీ మంచీ చెడూ

పిల్లలకి చెప్పి ఎవరితో ఎలా నడుచుకోవాలో చెప్తుందిగానీ,

అమ్మ మంచీ చెడూ మీరే చూడాలని చెప్పదు...అమ్మని

ఎలా చూడాలో చెప్పదు. అందుకే పేపరు తెరవగానే రోజుకో

అమ్మ వీధిలో ప్రత్యక్షం.

ఆత్మీయతలు మరచిపోతున్న మానవ మృగాలకి

మానవతా విలువలు గుర్తు చెయ్యటంకోసం సంవత్సరానికో

రోజు పెట్టి మృదువుగా హెచ్చరించటం కాదు, రోజూ ఈ

రోజులే చేసి తలంటితే బుఱ్ఱలోని పైత్యం కొంతయినా

తగ్గుతుందేమో. అయినా అభిమానాలూ, ప్రేమలూ ఎవరికి

వాళ్ళకి తెలియాలిగానీ ఇంకొకళ్ళు చెప్తే వచ్చే విషయాలా

ఇవ్వి.

ఏంటో. మా అమ్మ గురించి చెప్పబోయి ఏదేదో

చెప్పేస్తున్నాకదా. ఆవేశం అలా వచ్చేసిందిండీ. అమ్మనీ,

అమ్మ ప్రేమనీ ఊహల్లోనే నింపుకుని బతుకుతున్నాను

మరి. ఇప్పుడు అమ్మ వుంటే....అనుకున్న క్షణాలు నా

జీవితంలో ఎన్నో. మరి మా అమ్మ నా 15 వ ఏటే

మరణించింది. మేము ఏడుగురం ఆడపిల్లలం. నేను

రెండోదాన్ని. మా చెల్లెళ్ళల్లో కొందరికి ఆవిడ గుర్తేలేదు.

నాకు మాత్రం ఆవిడ రూపం, మాట, ఆలోచనలు, మాపట్ల

ఆవిడ చూపించిన ప్రేమ, మా ఉన్నతికోసం ఆవిడ పడ్డ

తాపత్రయం అన్నీ గుర్తున్నాయి. మా ఇంట్లో ఆడపిల్లలమని

మమ్మల్నేనాడు తక్కువగా చూడలేదు. ఎవరన్నా అయ్యో

అంతా ఆడపిల్లలేనా అన్నా వూరుకునేవారుకాదు. దిష్టి

తగులుతుందని ఆందర్నీ ఒక్కసారి ఎక్కడికీ

తీసుకెళ్ళేవాళ్ళుకాదు.


మా అమ్మ ఏడోతరగతి మాత్రమే చదివింది. అయినా నన్ను

కూర్చోబెట్టి ఇంగ్లీషు పదాలు స్పెల్లింగులతో సహా

చదివించేది. మా అమ్మని నేను తిండి దగ్గర మాత్రం తెగ

వేధించాను. ఏవో రెండు మూడు రకాలు తప్పితే ఇంకేవీ

తినేదాన్నికాదు. రోజూ అవే చేయాలంటే మరి ఇంట్లో

మిగతావాళ్ళు తినాలిగా. అందుకే నా కిష్టంలేని

పదార్ధాలున్న రోజుల్లో తిండి ఎగ్గొట్టటానికి శత విధాలా

ప్రయత్నించేదాన్ని. మా అమ్మ వూరుకునేదికాదు. మళ్ళీ

నాతోనే కూర్చుంటే మిగతా వాళ్ళ సంగతికూడా

చూడాలిగా. అందుకే నేను అన్నం తిన్నంత సేపూ నా మీద

ఒక కన్నువేసే వుంచేది. దణ్ణెంమీద బట్టలు ఆరవేసేందుకు

ఒక పొడుగాటి కఱ్ఱ వుండేది. దాన్ని దగ్గర పెట్టుకునేది.

కంచం ఖాళీ చేస్తేనే నేనక్కడనుంచి కదిలేది. లేకపోతే కఱ్ఱ

విరుగుతుందని చాలా సీరియస్ గా చెప్పేది. కొడతానని

భయపెట్టేదికానీ ఎప్పుడూ ఒక్క దెబ్బకూడా వెయ్యలేదు.



మా చిన్నప్పుడు శుక్రవారాలు, పండగలు వస్తే ఎంత

సరదాగా గడిచేవో. ప్రతి శుక్రవారం తెల్లవారుఝామునే దొడ్లో

పెద్ద రాగి కాగుతో నీళ్ళుకాచేవాళ్ళు. అమ్మ చాలా ఓపిగ్గా

అందర్నీ లేపి తెల్లారేసరికి అందరికీ తలంట్లు పోసేసేది.

అలాగే ప్రతి శుక్రవారం అందరి తలల్లో పూలు తప్పనిసరి.

ఆడపిల్లలు లక్ష్మీదేవులు మరి. ఆ కాలంలో మేమవ్వన్నీ

అనుభవించాం కనుక మాకా తియ్యటి ఆత్మీయ స్మృతులు

మిగిలాయి. అవ్వి తలుచుకున్నప్పుడు ఈ కాలంలో పిల్లలు

జీవితంలో చాలా కోల్పోతున్నారనిపిస్తుంది.

మా చిన్నతనం ముచ్చట్లల్లో తప్పనిసరిగా చెప్పవలసినవి

అట్లతద్దె, ఉండ్రాళ్ళతద్దె, సంక్రాంతి వగైరా పండుగలను.

అట్లతదియకీ, ఉండ్రాళ్ళ తదియకీ ముందు రోజు భోగి.

ఆరోజు తలంట్లేగాక గోరింటాకు ఆకు కోసి రుబ్బి మరీ

అందరికీ పెట్టేది అమ్మ. మేము సహాయం

చేసేవాళ్ళమనుకోండి. మర్నాడు తెల్లవారుఝామునే లేచి

పొట్లకాయకూర, కంది పచ్చడి, గోంగూర పచ్చడి, గడ్డ

పెరుగుతో చద్దెన్నం తిని దగ్గరలో వున్న పార్కుకు వెళ్ళి

చాలాసేపు ఆడుకునేవాళ్ళం. ఆరోజు ఉయ్యాల ఊగటం

తప్పనిసరి. లేకపోతే ముసలి మొగుడు వస్తాడనేవాళ్ళు.

అలాగే సంక్రాంతి పెద్ద పండగ. మూడు రోజులూ బొమ్మల

కొలువు పెట్టేవాళ్ళం. మా అమ్మ తను కాపురానికి

వచ్చినప్పటినుంచీ సేకరించిన బొమ్మలు రకరకాలవి ఎన్నో.

మా నాన్నగారు ఎంతో ఓపిగ్గా లోపల గదుల తలుపులు

వూడదీసి డబ్బాలమీద వాటిని పెట్టి మెట్లు మెట్లుగా

తయారుచెసేవాళ్ళు. వాటిమీద నాన్న తెల్ల ఖద్దరు

ధోవతులు పరిచి బొమ్మలు పెట్టేవాళ్ళం. మూడురోజులు

పేరంటం చేసేవాళ్ళం. అబ్బో ఎంత హడావిడో.

అలాగే వరలక్ష్మీ వ్రతం చాలా బాగా చేసేవాళ్ళం. అమ్మ

కొబ్బరికాయకి పసుపురాసి కళ్ళూ, ముక్కూ చెవులూ పెట్టి

ఇంకా వివిధ అలంకరణలతో అమ్మవారిని తయారు చేసేది.

తొమ్మిది రకాల పిండివంటలతో అమ్మవారికి నివేదన,

సాయంత్రం పేరంటం. అమ్మ దగ్గర నేర్చుకునే నేనూ

వరలక్ష్మీ వ్రతానికి పదేళ్ళ క్రితందాకా అమ్మవారిని

రకరకాలుగా తయారుచేసేదాన్ని. ఇన్నేళ్ళ తర్వాత కూడా

మా కాలనీలో ప్రతి వరలక్ష్మీ వ్రతం రోజు అప్పుడు నేను

చేసిన అమ్మవారి గురించి ప్రస్తావన తప్పకుండా

వస్తుందంటే అది అమ్మ దగ్గర నేను నేర్చుకున్న విద్యే.

అన్నింటికన్నా సరదా అయిన విషయం ఇంకొకటి.

పిల్లలందర్నీ చుట్టూ కూర్చో పెట్టుకుని అమ్మ తర్వాత

అమ్మమ్మ అన్నం ముద్దలు కలిపి అందరికీ పెట్టటం. ఆ

రోజులు మళ్ళీ రావు.

అంతమంది పిల్లలతో అమ్మ మా పట్ల చూపించిన శ్రధ్ధ

మేము మా పిల్లల పట్ల చూపించలేదేమో అనిపిస్తుంది.

అమ్మ పోయిన తర్వాత మా అమ్మమ్మగారు శ్రీమతి

పామరాజు మహలక్ష్మమ్మగారు మాతోనే వుండి మా

పెంపకంలో శ్రధ్ధ తీసుకున్నారు.

మేము మధ్య తరగతి కుటుంబీకులం. ప్రతి పండుగకీ

కొత్తబట్టలు వగైరాలు వుండేవికాదు. కానీ ఎంతో సరదాగా,

పండగ వాతావరణంలో జరిగేవి. పండగలని అప్పుడు

ఆస్వాదించినట్లు ఎన్ని వేల రూపాయలు తగలబెడుతున్నా

ఇప్పుడు ఆనందించలేకపోతున్నాం. కారణం

కనుమరుగవుతున్న సాంప్రదాయాలూ ఆభిమానాలూ,

ఆప్యాయతలు, వున్న కుటుంబ సభ్యులందరు ఒక

చోటవుండకపోవటం, వగైరాలేమో. (ఇప్పుడు అట్లతద్దెలూ,

ఉండ్రాళ్ళ తద్దెల ఉత్సాహాలేవి? అసలు ఆ పండగల గురించి

ఎంతమందికి తెలుసు?)



మా అమ్మకి పిల్లలందరూ బాగా చదువుకుని మంచి

వుద్యోగాలు చేయాలని చాలా కోరిక. నేను చదువులో

కొంచెం శ్రధ్ధ చూపించేదాన్నని నాకు పని చెప్పేదికాదు. నేను

పదమూడో ఏటే యస్.యస్.యల్.సి. పాస్

(నిజమేనండోయ్. నా యస్.యస్.యల్.సి రిజిస్టరులో ఏజ్

ఎగ్జంప్షన్ సర్టిఫికెట్ కూడా వుంది. చిన్నప్పుడు నేను కొన్ని

తరగతులు ఎగ్గొట్టి ఫస్టు ఫారం కి వెళ్ళాను ఎంట్రెన్స్

పాసయిమరీ.) అయిన రోజు అమ్మ సంతోషానికి

అవధుల్లేవు. వెంటనే ఇంటిముందు వాడుకగా వచ్చే

బట్టలతని దగ్గర నాకు రెండు జతల సిల్కు బట్టలు

తీసుకుంది చదువుకుంటున్న పిల్ల దీనికి మంచి బట్టలే

కొనలేదు ఎప్పుడూ అని బాధ పడింది. అంతేకాదు అంతకు

ముందు మా అక్కను వాళ్ళ స్నేహితురాళ్ళతో సినిమాకి

బెంచీ టికెట్ కి పంపి, నేనడిగానని నన్ను నేల టికెట్ కి

పంపింది. దానికి కూడా, అంటే చదువుకున్న నన్ను నేల

టికెట్ కి పంపినందుకు ఆ రోజు బోలెడు బాధ పడింది.

అంతోటి చదువుకే ఆవిడ అంత విలువ ఇచ్చిందంటే,

తర్వాత మా ప్రగతి చూస్తే ఎంత సంతోషించేదో, మాకింకా

ఎంత ప్రోత్సాహమిచ్చేదో.



స్కూలు ఫైనల్ తర్వాత టైపు హయ్యర్, షార్టుహేండు

లోయరు పాసయ్యి నా పదిహేనవ ఏట మా ఎదురింటి

అమ్మాయితో కలిసి ఉద్యోగం కోసం హైదరాబాదు వెళ్తానంటే

నాన్న పదిహేనవ ఏట ఉద్యోగం ఎవరిస్తారు, పైగా అంత

దూరం వద్దంటే అమ్మే నాకు సపోర్టుగా నిలిచి ధైర్యంగా

నామీద నమ్మకంతో నన్ను పంపిందకానీ తర్వాత

ఇంట్లోకెళ్ళి స్పృహతప్పి పడిపోయిందిట. తర్వాత కూడా

చాలాసేపు ఏడుస్తూనే వుందిట. చదువుకుని ఉద్యోగం కోసం

అంత దూరం వెళ్తున్న నాకు మంచి బట్టలు లేవని,

అక్కయ్య బట్టలే కట్టుకుని వెళ్ళాననీ నేనుత్తి పిచ్చి

మొద్దునని చాలా బాధ పడిందిట. తర్వాత మా వాళ్ళు

చెప్పారు.



నేను హైదరాబాదు బయల్దేరిన రోజే మా అమ్మని ప్రాణంతో

ఆఖరిసారి చూశాను. హైదరాబాదులో అప్పుడు స్టెనోగ్రాఫర్లకు

బోలెడు ఉద్యోగాలు. కానీ వయసు తక్కువ కావటంతో

నాకు రాలేదు. ఒక నెల చూశాక మా నాన్నగారు వచ్చి

తెలిసినవాళ్ళ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం ఇప్పించి,

కొన్నాళ్ళు వాళ్ళ స్నేహితుని ఇంట్లో వుండేందుకు ఏర్పాటు

చేసి వెళ్ళారు. అమ్మ నేను వచ్చేసరికే అనారోగ్యంతో

బాధపడుతోంది. అయినా మేము బాగుపడాలని ధైర్యంగా

పంపింది. నాన్న వెళ్తుంటే అమ్మ జాగ్రత్త నాన్నా అని

చెప్పాను. మొదటి నెల జీతం తీసుకుని వినాయకచవితికి

ఇంటికెళ్ళి వద్దామనుకున్నాను. నేను ఉద్యోగస్తురాలిగా

వస్తున్నానని అమ్మకూడా చాలా సంబర పడింది. మా

స్నేహితురాలి సహాయంతో వాయిదా పధ్ధతిలో అమ్మకి చీరె

తీసుకున్నాను. ఇంక రెండు రోజుల్లో ప్రయాణం.

సెప్టెంబరు 1963. ఆ తెల్లవారుఝామున అంకుల్ కి ఫోను.

అమ్మకి చాలా సీరియస్ గా వుంది నన్ను వెంటనే

పంపమని. ఆయన నన్ను తీసుకెళ్ళి విజయవాడ బస్సు ఎక్కించి కండక్టరుతో నా పరిస్ధితి చెప్పి విజయవాడ

చేరగానే తెనాలికి వెళ్ళే బస్సుకానీ రైలుగానీ ఎక్కే ఏర్పాటు

చెయ్యమని గట్టిగా చెప్పారు. అప్పుడు హైదరాబాదునుండి

తెనాలికి బస్సులు అతి తక్కువగా వున్నాయి. అందుకే

విజయవాడ బస్సు ఎక్కించటం. దోవలో ఒక లారీ

పాడయిపోయి ఎటు ట్రాఫిక్ అటే నిలిచి పోయింది. నాకు

విషయం సాంతం చెప్పకపోవటంవల్ల నాకంత కంగారులేదు

కానీ పాపం మాబస్సు కండక్టరు తెగ కంగారు

పడిపోయాడు. ఆయనకి అంకుల్ అసలు విషయం

చెప్పారుమరి. ఒక గంట తర్పాత మా బస్సు కండక్టరుకే

ఆలోచన వచ్చి ఈ బస్సులో ప్రయాణీకులను సామానుతో

సహా అటువైపున్న ఇంకో బస్సు ఎక్కించి ఆక్కడవాళ్ళని

ఇటు మార్చి ఎటు బస్సులటు వెనక్కి తిప్పారు. మేము

విజయవాడ చేరుకునేసరికి తెనాలి రైలుందని స్టేషన్ దగ్గర

బస్ ఆపి ఆ బస్సు కండక్టరు నేను ఎలా వెళ్ళి రైలెక్కాలో

చెప్పి వెళ్లాడు. ఆ ప్రకారమే రైలెక్కి కూర్చున్నాను. ఇంతలో

నాన్నగారి ఆఫీసులో పని చేసే ఆయన వచ్చారు దిగు

దిగు ఆఫీసు కారొచ్చింది దాన్లో వెళ్దామని. అసలు విషయం

నాకు ఇంటికి వెళ్ళాకే తెలిసింది. అమ్మ నా కోసం తెగ

కలవరించిందట. ముందంతా లక్ష్మి అని పూర్తి పేరు

వచ్చిందట. ఆ కలవరింతలు చూసి మా స్నేహితురాలు

ఒకమ్మాయిని, నా ఆకారం వున్న అమ్మాయిని

చూపించిందట మా అమ్మమ్మ. కానీ అమ్మ మస్తిష్కం బాగా

పని చేస్తోంది ఆ సమయంలో కూడా. ఆ అమ్మాయికి

పెళ్ళయింది. మెళ్ళో నల్లపూసలున్నాయి. అవి చూపించి

కాదని తల అడ్డంగా వూపి మళ్ళీ నా పేరు

కలవరించిందింట. చివరికి పేరు పూర్తిగా రాక క్షి, క్షి...అని

కలవరిస్తూనే ప్రాణం వదిలిందట. ఆ కలవరింతలు చూసి

ఆవిడ ప్రాణం వుండగా నన్ను చూపించాలని నాన్నగారు

పని చేసే కంపెనీ వాళ్ళు కారు విజయవాడ పంపారు.

వాళ్ళు చాలాసేపటినుంచి విజయవాడ బస్ స్టాండులో

కాచుకుని వివరాలు కనుక్కుంటున్నారు. మా బస్సు

రాగానే నా గురించి అడిగి రైలెక్కానని తెలిసి

స్టేషనుకొచ్చారు.



మేము వెళ్ళేసరికి మా వీధి మొత్తం జనంతో

నిండిపోయింది. అందరూ నన్ను జాలిగా చూస్తూ అడ్డు

తప్పుకుంటున్నారు. నాన్న అంత దూరానికే ఎదురొచ్చారు

ఏడుస్తూ. అమ్మని జాగ్రత్తగా చూడమన్నావుకదా..నేను

జాగ్రత్తగా చూడలేనని దేవుడిదగ్గరకు పంపేశాను అంటూ

బావురుమంటున్న నాన్నని చూసి ఏం చెయ్యాలో

తెలియలేదు. అప్పటికింకా నాకు చిన్నతనం,

తెలియనితనం. ఎందుకో తెలియదు. అమ్మని అలా

చూసినప్పుడు నాకు ఏడుపుకూడా రాలేదు.



కర్మ సిధ్ధాంతం మీద నమ్మకం నాకు అప్పుడే ఏర్పడి

వుంటుంది. దోవలో ఆ లారీ చెడిపోకుండా వుంటే నేను మా

వూరు ఇంకా చాలా ముందు చేరుకునేదాన్ని...అమ్మని

ప్రాణంతో చూసేదాన్నిమరి.



ఆరోజు రాత్రి నిద్ర పోతున్నప్పుడు అమ్మ గొంతు మా హాల్లో

పైనుంచి వినిపించింది. “లక్ష్మీ వీళ్ళు నన్ను

లాక్కుపోతున్నారే. అక్కడికీ నీకోసం చాలా సేపు చూశాను.

ఇంక నిలవనివ్వటంలేదు” అని. వెంటనే మెలకువ

వచ్చింది కానీ ఏమీ కనబడలేదు..వినబడలేదు.

తెల్లవారుఝామున ఇంకొక కల. అమ్మ నాకు పాలన్నంలో

పంచదారతో బాటు కారం కూడా కలిపి తినిపిస్తూ చెబ్తోంది

“జీవితంలో సుఖాలేకాదు కష్టాలు కూడా వుంటాయి,

అన్నింటినీ సమానంగా చూడాలని.” ఇవ్వన్నీ

ఆవయసులో నా అంతట నాకు తోచే విషయాలు కాదు.

ఎందుకంటే మా వాళ్ళు వున్నంతలో మాకు కష్టం అంటే

తెలియకుండా పెంచారు. అందుకని అమ్మే అలా చెప్పింది

అని నమ్మాను. ఇంట్లో చెబితే అదే ఆలోచనలలో

వుండటంవల్ల అలా అనిపించింది అని తేలిగ్గా తీసేశారు.

అందుకే ఇంకెవరికీ చెప్పలేదు.

అమ్మ ఆశయాలు మాత్రం నాలో నిలిచిపోయాయి. వాటిని

నా జీవితంలో పాటించినా ఏదో వెలితి. అనేక పరిస్ధితుల్లో

ఇప్పుడు అమ్మ వుంటే అనుకోని క్షణం లేదు. ఈ రోజుకీ

అమ్మని తలుచుకుంటే కళ్ళు చమర్చకుండా వుండవు.



అమ్మ చివరి రోజు నా జీవితంలో జరిగిన సంఘటనలు

అమ్మ అని కధ వ్రాశాను అప్పుడే అంటే 1963లో. ఆది

ఆంధ్రప్రభ దిన పత్రికలో ప్రచురించబడింది బహుశా అక్టోబరు

1963లో. ప్రస్తుతం నాకు కాపీ దొరకలేదు. వుంటే ఆ కధే

పోస్టు చేద్దామనుకున్నాను.

ఇంతకీ మా అమ్మపోయేసరికి ఆవిడ వయస్సు 35 ఏళ్ళు

మాత్రమే. ఆవిడకున్న ఫోటో కూడా మాకు మిగిలింది పైన పోస్ట్ చేసిందొకటే. అదీ వాళ్ళ అక్క చెల్లెళ్ళు ముగ్గురూ కలిసి ఒకసారి స్టుడియోలో తీయించుకున్నారు. అమ్మ పోయాక దాన్లోంచి అమ్మ ఫోటో వేరు చేయించాము. అమ్మని చిన్నతనంలోనే పోగొట్టుకున్నాను

కనుక అమ్మ విలువ నాకు తెలుసు. అందుకే అమ్మ అంటే

ప్రాణం. అమ్మ లేని లోటు నాకు తెలుసుగనుక నే నెంత

హడావిడిలో వున్నా మా పిల్లల విషయంలో ఎప్పుడూ

అశ్రధ్ధ చెయ్యలేదు.


అమ్మని వీధిలోకి నెట్టేవాళ్ళంటే నా కెందుకంత కోపమో

ఇప్పుడర్ధమయిందా మీకు?




8 comments:

మాలా కుమార్ said...

లక్ష్మి గారు,
మనసు భారమైంది.

పరిమళం said...

లక్ష్మి గారు , భౌతికంగా అమ్మ దూరమైనా మీ ఊహల్లో ఆమె చిరంజీవి . mothers day శుభాకాంక్షలు .

సుభద్ర said...

laxmigaru,
chala feel undandi mee post lo .
amma anee mee prathi padam lonu mee
manasu kanipinchindi.

మధురవాణి said...

లక్ష్మి గారూ,
మనసు చాలా ఆర్ధ్రమైపోయిందండీ. మీరు చెప్పిన సన్నివేశాల్లో మీ అమాయక మోము కూడా కనిపించింది. మీ కూతురి రూపంలో మీ అమ్మ మిమ్మల్ని మళ్ళీ చేరే ఉంటారు కదూ.!

psmlakshmiblogspotcom said...

మాలా కుమార్ గారూ, పరిమళంగారూ, సుభద్రగారీ, మధురవాణిగారూ, ధన్యవాదాలు. భగవంతుని నేను కోరే అతి కొద్ది కోరికల్లో ఒకటి వచ్చే జన్మలో నా జీవితంలో చాలా కాలం అమ్మ వుండేటట్లు చెయ్యమని.
psmlakshmi

deeps said...

A very emotional one indeed!!! It will bring tears in anyone who love their mother.....

I am always so thankful to God to have U...

....My Inspiration
....My Motivation
....My Mother!!!!

psmlakshmiblogspotcom said...

Thank you Dear
amma

Unknown said...

manusunu chala kadalinchindi.

Rajeswari