Friday, January 29, 2010

సుమంగళులు ఇంటికి వచ్చినప్పుడు మంగళ ద్రవ్యాలు ఇస్తారు. ఎందుకు?

Friday, January 29, 2010



భారతీయ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారిని తగు రీతిలో సత్కరిస్తారు.  పండగ పబ్బాలలో వచ్చేవారిని ఒక రీతిగా, ఇంట్లో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు వచ్చిన ఆహూతులకు ఒక విధంగా, ఇంటి ఆడబడుచులకూ, దగ్గరవారికీ, ఇలా ఆ సందర్భన్నీ, వారితో వున్న సంబంధాలనిబట్టి ఇంటికి వచ్చిన అతిధులను, ముఖ్యంగా సుమంగళులను.... వారికి పసుపు, కుంకుమ, చీరె, జాకెట్, పండు, తాంబూలం వగైరాలిచ్చి గౌరవించటం మన సంప్రదాయం. 

పూజ పూర్తయిన వెంటనే సుమంగళులు వస్తే, ముఖ్యంగా మంగళ, శుక్రు వారాలలో,  సాక్షాత్తు తాము కొలిచిన దేవత  వారి రూపంలో వచ్చిందని భావించి మంగళ ద్రవ్యాలు ఇస్తారు.  తీసుకున్నవారు కూడా ఇవాళ ఈవిడ నాకు బొట్టు పెట్టి ఇవి ఇచ్చింది, ఈవిడ సౌబాగ్యవతిగా సుఖ సంతోషాలతో వుండాలని ఆశీర్వదిస్తారు

ఎంత వున్నవారైనా రోజూ వచ్చిన వారందరికీ, బట్టలు వగైరాలు పెట్టలేక పోవచ్చు.  ఎంత పేద వారైనా, ఇంటికి వచ్చిన ముత్తయిదుకి బొట్టు పెట్టకుండా పంపించే వారిని మనం చూడం (ఈ మధ్య హడావిళ్ళల్లో, నాగరికతల్లో ఈ అలవాటు కొంచెం వెనకబడుతోంది).  అయితే దీనివల్ల ప్రయోజనం ఏమైనా వుందా అంటే వుంది.  అందరినీ దైవ స్వరూపంగా భావించి గౌరవించటం, ఆదరించటం వల్ల మన సంస్కారం పెరుగుతుంది, మన సంస్కృతీ సాంప్రదాయాల విలువలు పెరుగటమేకాక అందరికీ తెలుస్తాయి.  అలాగే సంఘీభావం, సమానత్వం, ఆత్మీయతలు
 బలపడతాయి. 

అయితే కొందరు దీని వెనకవున్న సామాజిక ప్రయోజనాన్ని గుర్తించక, తెలిసీ తెలియక కొన్నిసార్లు ఎదుటివారిని బాధ పెడుతున్నారు.  ముత్తయిదులతోపాటు  భర్త పోయినవారు, సంతానంలేని వారు, చిన్నపిల్లలు రావచ్చు.  కేవలం ముత్తయిదులకి పసుపు కుంకుమలు, పండు తాంబూలం ఇంచ్చి మిగిలినవారిని వదిలెయ్యకూడదు.  వారు నొచ్చుకునే అవకాశం వుంది.  ఇంటికి వచ్చినవారిని బాధ పెట్టటం మన వుద్దేశ్యం కాదుకదా.  అందుకే వారికీ అన్నీ ఇవ్వాలి.  భర్తలేని వారికి పసుపు కుంకుమలు ఇవ్వటం మీకు అభ్యంతరమైతే అందరితోబాటు వారికీ పళ్ళో, ప్రసాదమో ఏదో ఒకటి ఇవ్వండి.  కేవలం ముత్యయిదులకు మాత్రమే బొట్టుపెట్టి తాంబూలమిచ్చి మిగిలినవారిని అలా వదిలెయ్యకూడదు.  అలా చేస్తే పెద్దలు ఆశించిన సంఘీభావం లోపించటమేగాక మనం వారిని అవమానించినట్లవుతుంది.  ఇంటికి వచ్చిన అందరినీ ఆదరించటం మనం మర్చిపోకూడదు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

మనలో మాట

భర్తలేనివారికి పసుపు కుంకుమలు (వారు తీసుకునేటట్లయితే) ఇవ్వటంలో తప్పులేదని నా అభిప్రాయం.  అవి పెళ్ళితో వచ్చిన చిహ్నాలు కాదు.  ఆడపిల్లలకు చిన్నప్పటినుంచే పసుపు కుంకుమలు పెడతారు.  పెళ్ళికాని వాళ్ళు పెట్టుకోకూడదని అడ్డుపడరు. 

ఇంకో విషయం మీరు గమనించారా  ఈ బిజీ కాలంలో శ్రావణ మంగళవారం వాయనాలు ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు.  ఆ వాయనాలు లెక్క ప్రకారం తెచ్చుకుంటారు.  వెళ్ళిన ఇంట్లో ఇంకో ముత్తయిదు ఎక్కువవుంటే వారికి వాయనం ఇవ్వటం సంగతి తర్వాత చాలామంది కనీసం బొట్టు పెట్టరు.  అలాగే ఏ పెళ్ళికో పేరంటానికో పిలవటానికి వెళ్ళినప్పుడుకూడా అసలు వారికి తప్ప పక్కనున్న వారికి బొట్టు పెట్టరు.   ఇది కాదు మన సంస్కారం.  వారంతా మీకు తెలియకపోవచ్చు.  వాళ్ళందర్నీ మీరు మీ ఇంటికి పిలవనక్కరలేదు కూడా.   మనకి అపరిచితులయినా అలా పక్కవారికీ బొట్టుపెట్టి గౌరవించటం మన కనీస మర్యాద.  అలా బొట్టు పెట్టినంత మాత్రాన వాళ్ళంతా మనింటిమీద వచ్చిపడరు.


0 comments: