కొన్ని కుటుంబాలలో సాంప్రదాయం పేర భర్త పోయిన మహిళని పదో రోజున చిత్రహింసలకి గురిచేసి
మానసికంగా నానా క్షోభ పెడుతున్నారు. కాలం తీరి జీవిత సహచరుడు పోవటమే స్త్రీకి
జీవితంలో పెద్ద శిక్ష. ఇంకా ఆచారాల పేరిట
పదో రోజు ఆవిడ సౌభాగ్య చిహ్నాలు బలవంతంగా తీసేసి, తెల్లచీర కట్టించి ఆవిడని ఒక మూల
కూర్చోపెట్టి అందరూ చూడాలంటే ....ఒక స్త్రీని అంత క్షోభ పెట్టే అధికారం ఎవరికీ
లేదు. ఇలాంటివసలు ఏ శాస్త్రంలోనూ
లేవంటున్నారు.
కరీంనగర్ జిల్లాలో మంధని అనే ఊరుంది. ఇదివరకు ఈ ఊరు పేరు మంత్రపురి. అక్కడ చతుర్వేదాలు చదివిన బ్రాహ్మలు
వుండేవారు. వారెవరూ ఈ ఆచారాలు
పాటించలేదుట. ఇప్పటికీ అక్కడివారెవరూ,
బ్రాహ్మలు కూడా ఈ ఆచారాలని నిర్బంధంగా పాటించరు.
అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వి పుష్కరయోగం
అనేది వున్నది. ఆ సమయంలో ఏపనయినా చేస్తే
మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుందిట. అలాంటి
వ్యక్తిని ఆ యోగ సమయంలో చూస్తే మళ్లీ ఇంకెవర్నయినా అలా చూడాల్సివస్తుందేమో, దాన్ని ఆపాలనే చిన్న
కారణంతోనే.......అంతేకానీ ఇది శాస్త్రబధ్ధంకాదు.
ఎవరూ పాటించక్కరలేదు.
అలాంటి స్త్రీని పదో రోజే, అలా కూర్చోబెట్టే
చూడక్కరలేదు. ఏ అనుమానాలూ లేకుండా
వుండటానికి ఏదో ఒక మంచి రోజున వెళ్ళి
పలకరించి వస్తే సరిపోతుంది. ఆవిడ ఆవిడ పనులు చేసుకుంటున్నప్పుడు మామూలుగా వెళ్ళి
మాట్లాడి రావచ్చు. ఆప్పుడు ఆవిడ కూడా ఈ
ఆచారాలవల్ల బాధపడదు.
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)
మనలోమాట
పిల్లలు పుట్టినప్పుడు 11వ రోజు పురిటి స్నానం
కాగానే బొట్టు పెట్టటం మొదలు పెడతారు. ఆడ పిల్లలకి చిన్న పిల్లలకి కూడా కుంకుమ
బొట్టు పెడతారు, పసుపు రాస్తారు, పూలు పెడతారు.
అవి పెళ్ళితో రాలేదుకదా. మరి
వీటన్నింటినీ భర్త పోగానే ఎందుకు తీసెయ్యాలి.