Friday, December 4, 2009

తెల్లవారుఝామున నిద్ర లేవాలంటారు. ఎందుకు?

Friday, December 4, 2009
తెల్లవారుఝామునే ఎందుకు లేవాలి?

 

  మన పెద్దలు తెల్లవారుఝామునే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అంటారు.  బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు. పద్మ పురాణం, వాయు పురాణం, స్కాంద పురాణం, ఇంకా అనేక పురాణాలలో కూడా ఈ ప్రస్తావన వుంది.  ఆధ్యాత్మికంగా అలా లేవని వారికి బ్రహ్మ హత్యా దోషం పడుతుందని, వారిని లక్ష్మి వదిలి వెళ్ళిపోతుందని, దరిద్రం వెంటాడుతుందనీ అంటారు.  ఇది నిజమేనా?  లేకపోతే ఏదో పెద్దలు పిన్నలని పెందరాళే నిద్రలేపటానికి చెప్పే విషయాలా?  పోటీ పరీక్షలకి వెళ్ళే విద్యార్ధులనుకూడా తెల్లవారుఝామునే లేచి చదవమంటారు.  ఎందుకు?

  ఆధ్యాత్మికంగా చూస్తే ఆ సమయంలో పితృదేవతలు, దేవతలు కలిసి వుంటారు.  అందరూ మనల్ని ఆశీర్వదిస్తారు..  మన ఆయుష్షు, ఆరోగ్యం పెరుగుతాయి.  ఇంకొక విషయం  ఆ సమయం కుజుడి సమయం.  కుజుడు ఉత్తేజానికి మారు పేరు.  అంటే ఆ సమయంలో ఏమి చేసినా బుఱ్ఱకి పడుతుంది.  ఆ సమయంలో ఏ శబ్దాలూ లేకుండా ప్రశాంతంగా వుండటం కూడా కారణం.  సోమరితనం, బధ్ధకం వదిలిపోతుంది.

  ఇంకొక విషయం గమనించారా?  ఏ మతం వాళ్ళయినా తెల్లవారుఝామున ప్రార్ధన చేస్తారు.

  ఇంక శాస్త్రీయంగా ఆలోచిస్తే  తెల్లవారుఝామున లేచేవారికి ఆయుష్షు పెరుగుతుందంటారు.  ఆయుష్షు పెరగాలన్నా, ఆరోగ్యంగా వుండాలన్నా తెల్లవారుఝామున లేవాలి.  ఇదెక్కడి ఫిట్టింగండీ, ఆరోగ్యంగా వుండాలన్నంత మాత్రాన తెల్లవారుఝామున లేవాలా!?  అని అంటున్నారా  తెల్లవారుఝామున ముడుచుకు పడుకోవటంతో పక్షవాతం, హృద్రోగం, నరాల జబ్బులు వగైరా చాలా జబ్బులు వస్తాయి.  ఆ సమయంలో లేచి వ్యాయామం చెయ్యటం, పనులు చేసుకోవటంతో ఆ జబ్బులు రాకుండా నియంత్రించుకోవచ్చు, తద్వారా ఆరోగ్యం, ఆయుష్షు పెంచుకోవచ్చు.  (మన ఆయుష్షు ముందే నిర్ణయింపబడి వుంటుందంటారుకదా, జబ్బులు లేకపోతే ఆరోగ్యం బాగుంటుందికానీ ఆయుష్షు పెరుగుతుందా!? )  అంతేకాదు, మనసుకి ప్రశాంతత చిక్కుతుంది.  అందుకే తెల్లవారుఝామునే లేవాలంటారు.  (అన్నీ బాగానే వున్నాయిగానీ, ఈ సాఫ్ట్ వేర్ కాలంలో ఎంతమంది తెల్లవారుఝామునే లేవగలరండీ?????)



2 comments:

Apparao said...

మంచి మాట చెప్పారు థాంక్యు
మొత్తానికి ఫాంట్ సైజు మార్చారన్న మాట
కాకపొతే ఒక చిన్న విన్నపం
వైట్ బ్యాక్ గ్రౌండ్ మీద గ్రీన్ లెటర్స్ కనపడటం లేదు . లెటర్స్ కలర్స్ మారిస్తే బాగుంటుందేమో

జాన్‌హైడ్ కనుమూరి said...

సమయాన్ని ఘడిగలుగా విడదీసారు
వేకువఘడియలో మనశరీరంలో రక్త ప్రసరణలో కూడా చిన్న చిన్నవి చాలా మార్పులు జరుగుతాయి, వాటిని నియంత్రించడంవల్ల ఆరోగ్యంగా వుండగలుగుతుంది శరీరం

నేను మద్యపానం మానే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు(1999) ఈ విషయాలు చదివాను, పాటించాను. నేను మద్యం మానేయగలగటానికి కారణాలలో వేకువన లేవటం ఒకటి.