Tuesday, December 8, 2009

స్నానం చెయ్యకుండా పూజ చెయ్యవచ్చా?

Tuesday, December 8, 2009


ఇదేం ప్రశ్న?  ఎవరైనా అసలు స్నానం చెయ్యకుండా పూజ చేస్తారా?  చెయ్యకూడదు కదా!?   నిజమేనండీ.  చెయ్యకూడదు.  మన దినచర్య అంతా సజావుగా సాగిపోతున్నప్పుడు మన మనసూ, శరీరం పరిశుభ్రంగా వున్నప్పుడే పూజ చెయ్యాలి.

కానీ కొన్ని సందర్భాలలో రోజూ స్నానం చెయ్యలేక పోవచ్చు.  దూర ప్రయాణాలలోకానీ, జబ్బుచెయ్యటవల్లకానీ, ఏదైనా ఆపరేషన్ అయినప్పుడుకానీ,  వృధ్ధాప్యంలో మంచం మీద నుంచి కదలలేక కానీ స్నానం చేసే పరిస్ధితుల్లో వుండక పోవచ్చు.  అలాంటప్పుడు పూజ మానేయాలా?  అక్కరలేదు.  ఒకసారి మనం భక్తి మార్గాన పడ్డాక ఆ మార్గాన్ని వదలకూడదు.  అప్పటిదాకా మనం చేసుకునే వూజ, పారాయణ వగైరాలన్నీ అలాంటి సందర్భాలలోకూడా మానకుండా చేసుకోవచ్చు.  ఎలాగంటారా?

మానసిక పూజనికూడా భగవంతుడు స్వీకరిస్తాడండీ.  వీలయితే తడిగుడ్డతో ఒళ్ళు తుడుచుకుని బట్టలు మార్చుకుని, మగవారయితే భస్మాన్ని ధరించి, ఆడవారయితే పసుపు నీరు పైన చిలకరించుకుని, మానసిక పూజ చేసుకోవచ్చు. 

అయితే ఇలాంటప్పుడు బాహ్యంగా చేసే పూజలు, దీపారాధన, అభిషేకాలు, గుళ్ళోకెళ్ళటం వగైరాలు చెయ్యకూడదు.  కానీ మనసులో దీపారాధన చెయ్యవచ్చు, పూజలూ, అభిషేకాలూ, చేసుకోవచ్చు, నైవేద్యాలు పెట్టవచ్చు.  అన్ని మానసికంగా చెయ్యవచ్చు.  వృధ్ధాప్యంలో బాహ్యంగా పూజలు చేసే శక్తి  లేక పోవచ్చు.  వారు అలవాటయిన తమ పూజా విధానాన్ని మానసికంగా చేసి తృప్తి చెందవచ్చు.  మనం ఎక్కడ వున్నా, ఏ పరిస్ధితుల్లో వున్నా, మానసికంగా భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు.  ఏ వయసు, ఏ మతం, ఏవర్గం వారికైనా మానసిక పూజ చెయ్యటానికి స్నానంతో సంబంధం లేదు.

మామూలుగా ఉదయం నిద్ర లేవగానే ఆరోగ్యవంతులు కూడా పక్కమీదనుంచి  దిగే ముందు మానసికంగా దైవస్మరణ చేశాకే  దిగాలి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా) 




0 comments: