సంధ్యా సమయంలో చేయకూడని పనులు ఏమిటి?
మనకి సంధ్యా సమయాలు మూడు. ప్రాత సంధ్య, మధ్యాహ్న సంధ్య (సూర్యుడు నడి నెత్తిన వున్నప్పుడు), సాయం సంధ్య. ఈ సంధ్యా సమయాల్లో కొన్ని పనులు చెయ్యకూడదని పెద్దలు చెబుతారు. ఆ సమయంలో నిద్రిస్తే మహలక్ష్మి వెళ్ళిపోతుంది, ఆ ఇంట దరిద్రం తాండవిస్తుంది అంటారు. ఆ సమయాల్లో ఏమీ ఆహారం తీసుకోకూడదు. దానివల్ల రోగాలు వస్తాయి. విద్యార్ధులు చదవకూడదు. మేధస్సు తగ్గుతుందంటారు. స్త్రీ పురుష సంగమం నిషిధ్ధం. ఆ సంగమం వల్ల పుట్టే బిడ్డలు దుష్ప్రవర్తన కలవారు, రోగిష్టులూ అవుతారు. గర్భిణీ స్త్రీలకు కూడా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ఇంకొక విషయం. ఈ సంధ్యా సమయాల్లో చేసే పనులేవీ సక్రమంగా సాగవు. మంచి ఫలితాల్నివ్వవు. అందుకే మంచి ఫలితాల్ని ఆశించి చేసే పనులేవీ సంధ్యా సమయాల్లో చెయ్య కూడదు.
సాయం సంధ్యా సమయంలో పరమ శివుడు పార్వతీ దేవి ముందు పరవశించి నాట్యం చేస్తాడుట. దేవతలందరూ అక్కడే వుంటారుట. అందుకే సూర్యాస్తమయానికి ముందు దీపారాధన చేసి భగవంతుని ప్రార్ధించటం మంచిది.
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)
మనలో మన మాట
ఈ కాలంలో సూర్యాస్తమయానికి ముందు దీపారాధన చెయ్యటం ఎంతమందికి కుదురుతుందండీ కుదిరిన వాళ్ళు చెయ్యండి. కుదరని వాళ్ళు అయ్యో చెయ్యలేక పోయామే అని బాధ పడద్దు. ఆ సమయంలో చెయ్యకూడని పనులు వున్నాయికదండీ. అవ్వి చెయ్యకుండా వుండండి. చాలు. మరి ఆ సమయంలో కూడా పిల్లల్ని చదువులంటూ రుద్దేస్తే ఎలాగండీ. హాయిగా కాసేవు ఆడుకోనివ్వండి. వాళ్ళలా ఆడుకోవాలనే ఆ సమయంలో చదివితే మేధస్సు తగ్గుతుందని పెట్టారు. నిజమే కదండీ. వాళ్ల మనసు ఆటల మీద వుంటే పుస్తకం ముందు మనిషి వుండి లాభమేమిటి
0 comments:
Post a Comment