Thursday, February 25, 2010

తోడుకు మజ్జిగ అడగకూడదా

Thursday, February 25, 2010



కొందరు తోడుకోసం మజ్జిగ అడిగితే చాలా తప్పుగా తీసుకుంటారు.  మేమివ్వమండీ అలా అడక్కూడదండీ అని కొందరు స్పష్టంగా చెబితే కొందరు ఏదో ఒక వంక చెబుతారు.  ముఖ్యంగా రాత్రుళ్ళు అసలు ఇవ్వకూడదంటారు.  ఇదేమన్నా శాస్త్రీయమా  అలా ఇస్తే ఏమన్నా దోషమా 

పాలు, పెరుగు, మిజ్జిగలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము మనం.  అందుకని మన లక్ష్మిని ఇచ్చేస్తున్నట్లు భావిస్తారు కొందరు.  లక్ష్మీ స్వరూపంగా భావిస్తాముగనుక రాత్రిళ్ళు ఇవ్వటానికి ఇష్టపడరు.  కానీ ఉపయోగపడే వస్తువులు ఎవరికి ఏమిచ్చినా, ఏ సమయంలో ఇచ్చినా దానివల్ల మనకి అనర్ధం జరగదు.  సువర్ణదానం, గోదానం చేయటంలేదా  అవి లక్ష్మీ స్వరూపాలు కాదా  వాటిని దానం ఇవ్వటంవల్ల మనకి మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే ఇస్తాంకదా.  అలాగే ఇదీను.

పూర్వం చాలామంది ఇళ్ళల్లో పాడి వుండేది.  పాడిలేనివారు, వున్నవారింట్లో మజ్జిగ చిలికినప్పుడు చెంబులతో మజ్జిగ తెచ్చుకునేవారు.  అది దోషంగా ఎవరూ భావించలేదు.

ఇంకా ఆలోచిస్తే ఇచ్చేవాళ్ళకన్నా తీసుకునేవాళ్ళు రెండు విధాల ఆలోచించాలి.   మొదటిది ఆధ్యాత్మికంగా..వాళ్ళు సరైన ప్రదేశంలో పెట్టారో లేదో, ఎంగిళ్ళూ, అంట్లూ తగిలితే ఆ మజ్జిగతో తోడువేసివ పెరుగుని భగవంతునికి నివేదన చేయలేము.  అలాగే కొన్ని గేదెల పాలలో బాక్టీరియా వుండవచ్చు.  అలాగే కొన్ని ఋతువులలో కొన్నిసార్లు పాలు సరిగా వుండవు.  దానితో తోడుపెట్టిన పెరుగు జిగటగా వుండవచ్చు.  అలాంటి పెరుగు తెచ్చి మనం పాలు తోడుపెట్టటంవల్ల మనమూ కొన్ని రోజులపాటు ఆ బాక్టీరియాని తింటాము.  కొందరి ఇళ్ళల్లో పరిశుభ్రత గురించి కూడా ఆలోచించాలి.

మనకి ఏ శాస్త్రంలోను చెప్పని ఈ విషయం ఒక నమ్మకమేగానీ వేరే ఏమీ కాదు.  ఇచ్చేవాళ్ళకు ఏ విధమైన దోషమూ వుండదు కానీ తీసుకునేవాళ్ళే కొంచెం ఆలోచించి తీసుకోవాలి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


మనలో మాట

కొందరికి మజ్జిగ ఇవ్వటంకన్నా అడిగేవారు తోడుకోసం అని అడిగితా చాలా తప్పుగా భావిస్తారు....వారి తోడుని (జీవితంలో) ఇచ్చేస్తున్నట్లు..తోడుకోసం అని అడగకూడదు అని ఉచిత సలహా నేనే తీసుకున్నాను.

2 comments

Wednesday, February 24, 2010

మగవారికి కుడికన్నూ ఆడవారికి ఎడమ కన్నూ అదిరితే శుభసూచకమా?

Wednesday, February 24, 2010



మనకి శకున శాస్త్రం వున్నది.  దాని ప్రకారం కన్నే కాదు మగవారికి కుడివైపు శరీర భాగం, ఆడవారికి ఎడమ వైపు శరీర భాగం అదిరితే మంచిదంటారు.  రామాయణంలో కూడా దీనికి ఒక కధ చెప్తారు.  శ్రీరామచంద్రుడు వానర సేనని తీసుకుని రావణుడి మీద యుధ్ధానికి బయల్దేరినప్పుడు రావణాసురుడికి కుడి కన్నూ, సీతమ్మవారికి ఎడమ కన్నూ అదిరాయట.  సీతమ్మవారికి ఎడమ కన్ను అదిరిన ఫలితం కనిపించింది రాముడు ఆవిడని చెరనుంచి విడిపించాడు.  అలాగే రావణాసురుడుకి కీడు జరిగింది.

అలాగే ప్రతిసారి శరీర భాగాలదిరినప్పుడు మనకి అనుకూలమైన సూచన అయితే ఏదో మంచి జరుగుతుదని పొంగిపోనక్కరలేదు,  కానప్పుడు ఏదో కీడు జరుగుతుందని భయపడక్కరలేదు.  కేవలం కొన్ని లిప్తలు మాత్రమే అదిరితే అది శకునం కావచ్చు.  కొందరు పొద్దన్ననుంచీ రాత్రిదాకా అదిరిందంటారు, కొందరికి శరీర భాగాలు తరచూ అదరవచ్చు...అది నరాల బలహీనతకు సూచన.  ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వాత, పిత్త గుణాలు ప్రకోపించినప్పుడు శరీరంలో భాగాలు అదురుతాయంటారు.  కళ్ళ వ్యాధులున్నాకూడా కంటి భాగాలు తరచూ అదరవచ్చు.  అలాంటప్పుడు డాక్టరుని సంప్రదించాలిగానీ నమ్మకాలని పట్టుకుని వేళ్ళాడకూడదు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



0 comments

Tuesday, February 23, 2010

గడియారం ఆగిపోతే ఇబ్బందులు వస్తాయా?

Tuesday, February 23, 2010



చాలామందికి చాలా రకాల అపోహలున్నాయి.  అందులో ఈ మధ్య ఎక్కువగా కనబడుతున్నది గడియారం ఆగిపోతే ఇబ్బందులు వస్తాయని.  ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఆగిపోయిన గడియారాన్ని చూస్తే అయ్యో, ఆగిపోయిన గడియారాన్ని పెట్టుకున్నారా  మంచిది కాదు  తీసెయ్యండి అని ఉచిత సలహాలు కూడాను.  సెల్ అయిపోయిగానీ పాడయిపోయిగానీ గడియారాలు ఆగిపోవాండీ?

ఈ నమ్మకాల విషయంలో మనుష్యులను మూడు వర్గాలుగా విభజించవచ్చు.  అందులో ఒక వర్గంవారు ఏవీనమ్మరు.  వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తారు.  ఇంకో వర్గంవారు అన్నీ నెగెటివ్ గా ఆలోచించి ప్రతి దానికీ భయపడతారు. ఇంక మూడో వర్గంవారు  ప్రకృతినుంచి కొన్ని సంకేతాలను తీసుకుంటారు, దాని ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటారు.

పురాతన కాలంలో గడియారాలు లేవు.  నీడ ప్రకారం సమయాన్ని లెక్కించేవారు.  ఆ గడియారం ఆగదు..కాలం ఆగదు.  అది నిరంతరం సాగుతుంది.  ఈ నమ్మకాలు ఎలాంటివంటే ఎంత బలవంతులయినా నమ్మకం ఏర్పడితే, శాస్త్రీయమైనా కాకపోయినా గట్టిగా నమ్మి భయపడతారు.  ఎక్కడ పుట్టి ఎలా ప్రచారమయిందో తెలియదు కానీ ఈ మధ్య ఈ గడియారాల  నమ్మకం ఎక్కువైంది.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

మనలో మాట
పొద్దున్న లేవగానే అనేక పనులమీద హడావిడిగా ఇంటిల్లిపాదీ బయటకు వెళ్ళాల్సి రావటంవల్ల లేచిన దగ్గరనుంచీ మాటి మాటికీ గడియారం చూడటం అలవాటయిపోయిన వాళ్ళకి గడియారం ఆగిపోతే టైము తెలియక ఇబ్బందే.  దానితో  అన్నింటికీ ఆలస్యమయి చికాకు.  అలా ఆలోచిస్తే ఆగిన గడియారాన్ని ఇంట్లో పెట్టుకోవటం మంచిది కాదు కదా.  అందుకనే వెంటనే బాగు చేయిస్తే సమస్య తీరిపోతుంది కదా.

1 comments

Monday, February 22, 2010

ఆత్మహత్యల ప్రభావం కుటుంబం మీద వుంటుందా?

Monday, February 22, 2010



తప్పకుండా వుంటుంది.  ఇంటి యజమాని ఆత్మ హత్య చేసుకుంటే ఆ కుటుంబం వీధిన పడుతుంది.  పిల్లలు దిక్కులేని వాళ్ళవుతారు.  వారి బాధ్యతంతా భార్య మీద పడుతుంది.  అన్నింటికీ ఆలంబనగా వుండే వ్యక్తిపోతే  ఆ కుటుంబం ఎంత మానసిక క్షోబననుభవిస్తుందో, ఆకుటుంబం కోలుకోవటానికి ఎంత కాలం పడుతుందో ఒక్కసారి ఆలోచించండి.  అదే ఇంటి ఇల్లాలు ఆత్మ హత్య చేసుకుంటే ఆ పిల్లల సంగతేమిటి?  తల్లి దండ్రులు చూసినట్లు ఎంత అయినవారయినా చూడగలరా?  ఎవరు పెట్టే బాధలనన్నా తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకుంటే వారికి ఇంకా స్వేఛ్ఛనిచ్చినట్లుకాదా?

తల్లిదండ్రులు పిల్లలను ఎంత అల్లారు ముద్దుగా పెంచుతారు.  వాళ్ళు ఎంతో కష్టపడి ఆ కష్టాన్ని పిల్లలకు తెలియనీయకుండా పెంచాలనీ, వారు జీవితంలో ఉన్నత స్ధాయిలో వుంటే చూసి సంతోషించాలనీ తపన పడతారు.  తమ కడుపు కట్టుకుని పిల్లలకు సకల సౌఖ్యాలూ అమర్చాలని చూస్తారు.  కొడుకు పుడితే తమ వృధ్ధాప్యంలో తోడుగా వుంటాడనీ, పున్నామ నరకంనుంచీ తప్పిస్తాడనీ కలలు కంటారు.  వారి గురించి ఆలోచించకుండా ఆవేశంలో ఆత్మ హత్య చేసుకుంటే  వారి పరిస్ధితి ఏమిటి అని ఒక్క క్షణం ఆలోచిస్తే ఆత్మ హత్య చేసుకోగలరా?

అదే ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే తర్వాత ఆడపిల్లలుంటే వారికి పెళ్ళి కావటం కష్టమవుతుంది.  సామాజికంగా ఎన్ని సమస్యలో ఎదుర్కోవాల్సి వస్తుంది. తమని ఇంతవారిని చేసినందుకు ప్రతిఫలంగా తల్లి దండ్రులను అంత దుఃఖంలో ముంచవచ్చా?  తల్లిదండ్రులనూ, తోబుట్టువులనూ అంత కష్టపెట్టవచ్చా?  సామాజికంగా, ఆర్ధికంగా, మానసికంగా  ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబ సభ్యులమీద ఆ ప్రభావం చాలాకాలం వుంటుంది.

కుటుంబ సభ్యులమీదేకాదు, వారి స్నేహితులమీద, ఇరుగు పొరుగు మీదకూడా  వారి ఆత్మ హత్య ప్రభావం చాలాకాలం వుంటుంది.  అనేక సమయాలలో వారు చనిపోయినవారిని గుర్తుచేసుకుని బాధపడుతూ వుంటారు.  కొంతమందయితే చాలాకాలం కోలుకోలేరు కూడా.

ఇంతమందిని క్షోబపెట్టి ఆత్మహత్య చేసుకుని సాధించేదేమిటి?  ఇంకా బతికున్నవాళ్ళని రోజూ చంపినవాళ్ళవటంతప్ప.  తమ ఆత్మహత్యవల్ల తన మీద ఆధారపడ్డవాళ్ళకూ, తన కుటుంబానికీ బాధల్నీ సమస్యలనీ మిగల్చే ఆత్మహత్యలు చాలామటుకూ ఆవేశంలో చేసుకుంటారు.  ఆవేశంలో ఏ నిర్ణయాలూ తీసుకోకూడదు. భరించలేని బాధలు రావచ్చు.  ఎన్నో సమస్యలు ఎదురవవచ్చు.  అయితే పరిష్కారం లేని సమస్యలు వుండవు.  ఆ పరిష్కారం కనుక్కోవాలంటే ఆవేశం తగ్గాలి. ఆవేశం తగ్గిన తర్వాత సరైన ఆలోచనలు వస్తాయి సరైన ఆలోచన వచ్చి పరిష్కారం కనుక్కుంటే సమస్య తేలికవుతుంది.  కనుక  ఏ విషయంలోనైనా సరే ఆవేశం వచ్చినప్పుడు సంయమనం పాటించటం చాలా అవసరం.  వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవటంకూడా అవసరమే.  అందుకే ఆవేశం తగ్గేదాకా సంయమనం పాటించటం అవసరం. 

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


0 comments

Sunday, February 21, 2010

ఆత్మ హత్యలు అనర్ధదాయకం కాదా?

Sunday, February 21, 2010



ఈరోజుల్లో సమాజంలో ఎక్కడ చూసినా ఆత్మ హత్యలు చాలా సాధారణం అయిపోయినాయి.  పెళ్ళికాలేదనో, వరకట్న సమస్యలతోనో,  ప్రేమ విఫలమయినదనో యువతీ యువకులు, ఋణాలపాలయి రైతులూ, చేనేత కార్మికులూ,  ఇంకా రాజకీయ కారణాలవల్లా,  ఈ ఆత్మ హత్యలు ఎక్కువయినాయి.  ఇలా ఎందుకు చేసుకుంటున్నారు? 

శాస్త్రం ఏమి చెబుతోంది?  ఆత్మ హత్యలు చేసుకున్నవారు చీము, నెత్తురు పారే మహా నరకంలో పడతారు, చనిపోయిన తర్వాత కూడా నానా యాతనలూ పడతారు అని చెబుతోంది.  (కోరికలు తీరకుండా పోయినవారు పిశాచాలయి తిరుగుతారు అని కూడా అంటారు).  క్రిమి కీటకాలు, పశు పక్ష్యాదులుగా ఎన్నో జన్మల తర్వాత  మానవ జన్మ లభిస్తుంది.  అదీ కర్మభూమిలో.  అలాంటి ఉత్తమమైన జన్మని అంతం చేసుకోవటం సరైన పనేనా?  పురాణ కధలు, చరిత్రలో కధలూ వింటూ వుంటాం.  వాళ్ళకన్నా మనం ఎక్కువ కష్టాలు పడుతున్నామా?    వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు ఆత్మ హత్యలు చేసుకోలేదు.  నిలిచి పోరాడారు.  వారిని ఉదాహరణగా తీసుకుని మన జీవితాలు సరి దిద్దుకోవాలి.

మహా భారతమే తీసుకోండి.  నిండు సభలో ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగింది.  దానికి బాధపడి ద్రౌపది ఆత్మ హత్య చేసుకోలేదు.  తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవటానికి పాండవులను పురికొల్పి, భారత యుధ్ధంలో శత్రువులనందరి నాశనానికి కారణమయింది.

రామాయణంలో శ్రీ రాముడు సీతాదేవిని, నిండు చూలాలిని అడవులకు పంపితే ఆవిడ ఆత్మహత్య చేసుకోలేదు.  రాముడిని దూషించలేదు.  బిడ్డలని ధీరులుగా పెంచి అందరిచేతా అవుననిపించుకుంది.

జాతి పిత గాంధీజీ తెల్లవాళ్ళనుండి ఎన్ని అవమానాలు పొందారు.  వాటికి భయపడి ఆయన ఆత్మ హత్య చేసుకుంటే మన దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చేదో.

వీటన్నిటితో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి?  పరిస్ధితులు బాగుండనప్పుడు సంయమనం పాటించాలి, ఆలోచించాలి.  మన తెలివి తేటలు వుపయోగించాలి, పరిస్ధితులను అవగాహన చేసుకోవాలి.  అవసరమైతే నలుగురితో చర్చించాలి, ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి.  అంతేగానీ పిరికివాళ్ళల్లా ఆత్మహత్య చేసుకోకూడదు.

ఆత్మ హత్యలకి కారణాలు అనేకం.  అయితే  ఆవేశంలో నిర్ణయం తీసుకోకుండా ఒక్క నిముషం ఆలోచించాలి.  అవసరమైతే ఆత్మీయులతో చర్చించాలి.  మానవ జన్మ ఎత్తి, ఇంతకాలం పెరిగామంటే దానికి కారకులయిన మనవారి గురించి ఆలోచించాలి.  వారెంత కష్టపడితే మనమీ స్ధితికి వచ్చామో ఒక్క క్షణం గుర్తుకు తెచ్చుకోవాలి.

సమస్యకి కారణం ఏదైనా దానికి పరిష్కారంకూడా తప్పకుండా వుంటుంది.  ఆ పరిష్కారాన్ని కనుక్కోవాలి,   సమస్యని ఎదుర్కొని  విజయం సాధించాలి.  ధైర్యంగా ముందడుగు వేయాలి తప్ప ఆత్మ హత్యే సమస్యకి పరిష్కారంగా భావించకూడదు..బలవంతాన ప్రాణం తీసుకోకూడదు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



4 comments

Saturday, February 20, 2010

తలమీద కాకి తన్నితే దోషమా?

Saturday, February 20, 2010



కొందరు కాకి తన్నితే భయపడిపోతారు.  శని వాహనం కనుక శని పట్టుకోవటానికో, ఏదైనా దోషం జరగటానికో, లేక యముడు రాకకి సంకేతమో అని తెగ భయపడతారు.  అలా భయపడాల్సిన అవసరంలేదు. 

సాధారణంగా కాకి తన్నటం మనం ఎక్కువగా చూడం.  ఏదన్నా తోటలకి వెళ్ళినప్పుడు అక్కడ పళ్ళకోసం తిరుగుతూ తన్నవచ్చు, అలాగే సముద్రతీరాన చేపలు ఆరబెట్టి వుంటాయి వాటికోసం తిరుగుతూ అక్కడకి వచ్చినవారిని తన్నవచ్చు.

కాకి చిన్న పక్షి అయినా  బలంగా తన్నుతుంది.  చాలా దెబ్బ తగులుతుంది.  దానితో తలమీద తన్నినా దాని ప్రభావం శరీరం మొత్తంమీద వుంటుంది.  ఒక్కోసారి కంటి చూపుకూడా ఎఫెక్ట్ కావచ్చు.  దానితో భయపడతారు.  మనకున్న నమ్మకాలవల్లకూడా ఇంకా కొంత భయపడతారు.  తన్నింది కాకవటంతో ఇంకేమన్నా దోషం వుందేమోననే భయం.  పైగా కాకి శని వాహనం కనుక శని దూతగా వచ్చిందేమోనని, ఏదో చెడు జరుగుతుందేమోనని భయం.  శ్రాధ్ధ కర్మల సమయంలో కూడా కాకి పిండం అని పెడతారు.  ఆ సమయంలో కాకి తన్నితే యమ సంకేతమని కంగారు పడతారు.  నిత్య జీవితంలో ఏదో ఒకటి జరుగుతూనే వుంటాయి.  వాటిని నమ్మకాలకి ముడిపెట్టి అనవసరమైన కంగారు పడకూడదు.  ఒకవేళ ఇంకా ఏదో అనుమానం అనిపిస్తుంటే ఇంచక్కా శివాలయానికి వెళ్ళి, నువ్వుల నూనెతో దీపారాధన చేసి, అభిషేకం చేయిస్తే దోషం పోతుంది.  కాకి తన్నటం వల్ల అనారోగ్యం చేస్తే డాక్టరుకి చూపించుకోవాలి. 

ప్రతి సమస్యకీ పరిష్కారముంటుంది కనుక దేనికీ భయపడక్కరలేదు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



7 comments

Friday, February 19, 2010

వాస్తు దోషాలకి నివారణ వుందా?

Friday, February 19, 2010


వాస్తు దోషాలని నివారించవచ్చా అంటే నివారించవచ్చనే చెప్పవచ్చు.  ఎలాగంటే….

కొందరికి ప్రతి విషయానికీ గాబరాపడి, కంగారుపడి, బెంబేలెత్తిపోవటం అలవాటు.  ఆ అలవాటు మానుకోవాలి.  ముఖ్యంగా ప్రతి చిన్న విషయాన్నీ వాస్తు దోషానికి ముడి పెట్టి భయపడటం మానుకోవాలి.  ఎంత వాస్తు ప్రకారం కట్టిన ఇంట్లోనైనా ఏదో ఒక చిన్న లోపం వుండకపోదు.  అలాగని తరచూ ఇళ్ళు మారటంకూడా అయ్యేపని కాదుకదా.  మరి సరి చేసుకోవటం ఎలా?

రోజూ గడపకి పసుపు రాసి బొట్టు పెట్టే ఇంట్లోకి, ఇంటి ముందు ముగ్గు వుండే ఇంట్లోకీ దుష్ట శక్తులు ప్రవేశించవంటారు.  ప్రతి నిత్యం దేవునికి దీపారాధన, దేవతారాధన జరిగే ఇంట్లో, దేవుడి గంట మ్రోగే ఇంట్లో దుష్ట శక్తులేకాక వ్యాధి కారక బాక్టీరియా కూడా రావంటారు.  పరిశుభ్రంగా, గాలి వెలుతురు సమంగా వచ్చే ఇంట్లో చెడు గాలులు ప్రవేశించవంటారు.  అలాగే ఇంట్లో ఘర్షణ, కొట్లాటలు లేకుండా చూసుకోవాలి.  ఇంట్లో ఎవరూ మనస్తాపం చెందకుండా వుండేటట్లు చూసుకోవాలి.  మన చుట్టూ, మనలో, ప్రతి వ్యక్తిలో, ఎక్కడ చూసినా భగవంతుని చూడగలగాలి.  తాను ప్రశాంతంగా వుంటూ, పరిసరాలనూ, తనకు సంబంధించినవారినీ, తన చుట్టుపక్కలవారినీ ప్రశాంతంగా వుంచే వ్యక్తిని ఏ వాస్తు దోషాలూ ఏమీ చేయలేవు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

మనలో మాట

పరిశుభ్రంగా, ప్రశాంతంగా వుంటూ, ప్రతివారిలో భగవంతుని చూడగలిగే వ్యక్తికి ఆందోళనలు తక్కువ వుంటాయి.  విజ్ఞతతో ఆలోచించి సమస్యకు పరిష్కారం కనుక్కోగలుగుతారు.  అందుకనే దేనికీ భయపడరు.  అదీగాక ఏ వ్యక్తి జీవితంలోనైనా ఒడిదుడుకులు తప్పనిసరి.  సుఖంగా వున్నప్పుడు పొంగిపోయి, కష్టాలొచ్చినప్పుడు కుంగిపోకుండా వ్యవహరించగలిగినవారికి ఎప్పుడూ మేలే జరుగుతుంది.





0 comments

Thursday, February 18, 2010

వాస్తు దోషం వున్నట్లు అనుభవంలో ఎలా తెలుసుకోవచ్చు?

Thursday, February 18, 2010



ఇల్లు చూస్తే వాస్తు శాస్త్ర ప్రకారం ఏ దోషం కనబడదు.  కానీ ఆ ఇంట్లోకి మారిన దగ్గరనుంచీ  అకారణ చికాకులూ, అనారోగ్యాలూ, లేనిపోని టెన్షన్లూ, యాక్సిడెంట్లూ ఇలా ఏదో ఒకటి జరుగుతూ వుండవచ్చు.  వారి జాతకం ప్రకారం ఏ దోషం లేని సమయంలో కూడా ఇలాంటివి జరుగుతూంటే ఆ ఇంటి వాస్తులో లోపం వున్నదని చెప్పుకోవచ్చు.  మన శరీరంలో అయస్కాంత శక్తి వుంటుంది.  మనకి సరిపడని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రభావం మన శరీరం మీద పడి తల తిరగటం, తలనొప్పి, చికాకు మొదలయినవి బాధపెడతాయి.

అలాగే పెంపుడు కుక్క అస్తమానం ఒకే దిశకి తిరిగి అరవటంకూడా ఒక సూచనే.  ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావటం, కాకులు ఎక్కువగా వాలటం, ఆ ఇంటి చట్టూ మాత్రమే కాకులు ప్రదక్షణ చేయటం కూడా కనబడని వాస్తు లోపాలకి సూచనలు.

కొన్ని ఇళ్ళు చూడటానికి కళావిహీనంగా కనబడతాయి.  అలాగే కొన్నిచోట్లకి వెళ్ళగానే అకారణ భయం వేస్తుంది. కొన్ని ఇళ్ళల్లో ఆత్మ హత్యలో, హత్యలో జరిగి వుండవచ్చు  అలాంటి సంఘటనలు జరిగినచోట కొన్ని ఇబ్బందులుపడవలసి రావచ్చు.  అంటే ఆ పిశాచాలు అక్కడ తిష్ట వేసుకు కూర్చున్నాయనికాదు, అవి లేకపోయినా కొన్ని చికాకులు వుంటాయి.  ఆ ఇంట్లో అంతకు ముందు జరిగిన సంఘటనలు మనకు తెలిసే అవకాశం వుండదు.  అయినా మనలో అంతర్లీనంగా వున్న శక్తులు కొన్ని మనకి సూచిస్తాయి.

అయితే వంశపారంపర్యంగా వచ్చిన ఇళ్ళని ఇలాంటి చికాకులవల్ల వదిలి వెళ్ళలేము.  అందుకని శాస్త్రజ్ఞులకు చూపించి, లోపాలేమిటో తెలుసుకుని తగిన శాంతి చేయిస్తే సరిపోతుంది.  కొత్త ఇల్లు కట్టుకోబోతున్నా, కొనుక్కోబోతున్నా ముందే సరైన పరీక్షలు చేయిస్తే తర్వాత ఏ ఇబ్బందీ పడక్కరలేదు.

అయితే మన దశ బాగా లేనప్పుడు ఎంత మంచి ఇంట్లోవున్నా మన జాతక దోషాలవల్ల వచ్చే చికాకులు మనమే అనుభవించాలి...వాస్తు శాస్త్రాన్ని నిందించి లాభం లేదు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



7 comments

Tuesday, February 16, 2010

వాస్తు దోషాలు ఏ కారణాలవల్ల ఏర్పడతాయి?

Tuesday, February 16, 2010



మనలో చాలామంది ఇల్లు కట్టుకున్న తర్వాతో, ఫ్లాట్ కొనుక్కున్న తర్వాతో వాస్తు దోషాలున్నాయేమోనని వాస్తు శాస్త్రజ్ఞుల్ని సంప్రదిస్తాము.  అది సరికాదు.  అసలు వాస్తు దోషాలు ఏర్పడటానికి ముఖ్యంగా మూడు కారణాలు చెప్తారు.

మొదటిది భూమి కొనే ముందే అన్ని కోణాలలో భూమి పరీక్ష చేయించాలి.  ఎందుకంటే లూజ్ సాయిల్  అయితే ఇల్లు కట్టుకోవటానికి అనువైందికాదు.  కట్టడం బలంగా వుండదు.  అలాగే నేల అడుగున దేవాలయాలు, జల నాడులు, శల్యాలు, దుష్ట శక్తుల ఆవాహన వున్న ప్రదేశాలలో కూడ ఇల్లు కడితే సుఖంగా వుండలేరు.  అలాగే చుట్టుపక్కల ఎలా వుంది, ఇరుగూ, పొరుగూ కూడా చూసుకోవాలి.

రెండవది యజమాని నామ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహ ద్వారాలు ఎక్కడ వుండాలి, ఎన్ని గుమ్మాలు వుండాలి, ఎక్కడెక్కడ వుండాలి, కిటికీలు ఎక్కడ వుండాలి వగైరాలన్నీ ముందే వాస్తు శాస్త్రజ్ఞులను సంప్రదించి నిర్ణయించుకోవాలి.  ఆ నమ్మకం లేనివారు  శాస్త్రజ్ఞులను సంప్రదించాలి.

ఇవ్వన్నీ చూపించినా కొన్నిసార్లు ఆ ఇంట్లో నివసించిన తర్వాత వాస్తు బాగాలేదనుకుంటారు.  దానికి కారణం మన ప్రవర్తనవల్ల వచ్చింది.  ఏ ఇంట్లో అయితే స్త్రీలకు అన్యాయం జరుగుతుందో, ఏ ఇంట్లో అనర్ధాలు జరుగుతాయో, ఆక్రందనలుంటాయో ఆ ఇంటికి వాస్తు దోషం వుంటుందంటారు.-  జీవ హింస జరిగే ఇంట్లో, తల్లిదండ్రులు, వృధ్ధులు,  బాధపడే ఇంట్లో వాస్తు దోషం వున్నట్లే.  అంటే ఆ ఇంట్లో నివసించే వారికి సుఖశాంతులు వుండవు.  సర్ప, దేవతా, ఋషి శాపాలు వున్న ఇంట, పసిపిల్లలకు అన్యాయం జరిగే ఇంట వాస్తు దోషం వున్నట్లే.  ఇవ్వన్నీ భూమి ఎంచుకునేటప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు వచ్చిన దోషాలుకాదు.  మన ప్రవర్తనవల్ల వచ్చిన దోషాలు.  అలాగే కొందరు ఇల్లు కట్టాక వాస్తుకోసమని కొంత భాగం పడగొట్టి మార్పులు చేర్పులు చేస్తూవుంటారు.  అలా చెయ్యటంకూడా వాస్తుదోషమేనట.

భూమిలోను, ఇంట్లోను దోషాలుంటే ఆ ఇంటిని మారిస్తే సరిపోతుంది.  మన ప్రవర్తనలో దోషం వుంటే మనం ఏ ఇంటికెళ్ళినా ఆ ప్రవర్తన మారకపోతే తిప్పలు తప్పవు.  ఎంత బాగా వాస్తు ప్రకారం కట్టిన ఇల్లయినా కలసిరాదు.  అందుకే ముఖ్యంగా మన ప్రవర్తనని సరి చేసుకోవాలి.  అప్పుడు ఏ ఇంట్లోనైనా సంతోషంగా వుండవచ్చు.

 
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)




0 comments

Sunday, February 14, 2010

వ్యాస కాశీ విశేషమేమిటి?

Sunday, February 14, 2010



వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలు వ్రాసిన వాడు.  వేద విభాగము చేసినవాడు.  అంతటి గొప్ప వ్యక్తి తన కోప కారణంగా కాశీనుంచి బహిష్కరింపబడ్డాడు.  ఆ కధేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? 

పురాణ కధనం ప్రకారం పూర్వం వ్యాసుడు తన శిష్యగణంతో  కాశీలో వుండి  తపస్సు చేసుకోసాగాడు.  ఒకసారి పార్వతీ పరమేశ్వరులకు ఆయనని పరీక్ష చేయాలనిపించింది.  మధ్యాహ్నం భిక్ష కోసం వెళ్ళిన ఆయనకుగానీ ఆయన శిష్యులకుగానీ పార్వతీ పరమేశ్వరుల ప్రభావంవల్ల కాశీలో ఎక్కడా భిక్ష దొరకలేదు.  అలా మూడు రోజులయింది.  ఈ మూడు రోజులూ వారికి ఏ ఆహారమూ లేదు.  అలా ఎందుకు జరుగుతోందో ఆయనకు అర్ధంకాలేదు.  సాక్షాత్తూ అన్నపూర్ణ నిలయమైన కాశీలో తమకు ఆహారం దొరకకపోవటమేమిటి  కాశీవాసులకు ఇహంలో అన్ని సౌఖ్యాలూ వుండి అంత్యకాలంలో మోక్షం లభిస్తుంది.  అందుకే వారికి అహంకారం పెరిగి  తమకు భిక్ష పెట్టంలేదని కోపం వచ్చింది.  ఆ కోపంలో ఆయనకి ఆలోచన రాలేదు.  మూడు తరాలవరకు కాశీవాసులకు ఏమీ దొరకకూడదు అని శపించబోయాడు.  అతని మనసులో మాట బయటకు రాకుండానే ఒక పెద్ద ముత్తయిదు రూపంలో పార్వతీ దేవి వచ్చి వారిని భిక్షకు పిలిచి తృప్తిగా భోజనం పెట్టింది.  తర్వాత నెమ్మదిగా చివాట్లూ పెట్టింది.  మూడు రోజులు అన్నం దొరకకపోతే ఆగ్రహంలో ఔచిత్యాన్నే మరచిపోయావే, అష్టాదశ పురాణాలూ ఎలా రాశావయ్యా అని నిలదీసింది.  కాశీవాసులకు శాపం ఇస్తే విశ్వేశ్వరుడు వూరుకుంటాడా అని నిలదీసింది.  ఇంతలో విశ్వేశ్వరుడూ ప్రత్యక్షమయి కాశీలో కోపిష్టులు వుండకూడదని వ్యాసుణ్ణి ఐదు కోసుల దూరంలో గంగకు ఆవలి ఒడ్డున నివసించమని శాసించాడు.  వ్యాసుడు పశ్చాత్తాపంతో ప్రార్ధిస్తే పరవడి రోజుల్లో వచ్చి నా దర్శనం చేసుకోవచ్చని అనుమతిస్తాడు.

అందుకే కాశీలో కోపం వున్నవారు వుండలేరు అంటారు.  సత్వగుణం కలవారు మాత్రమే కాశీలో వుంటారంటారు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


0 comments

Saturday, February 13, 2010

వంద పోస్టుల పండగ

Saturday, February 13, 2010



సినిమాలవాళ్ళు వందరోజుల పండగ చేసుకున్నట్లు బ్లాగర్లు వంద పోస్టుల పండగ చేసుకుంటున్నారా  మీరంతా చేసుకున్నారో లేదోగానీ నాకు మాత్రం ఇవాళ పండగలాగే వుందండీ.  నా రెండవ బ్లాగు అంతరంగ తరంగాలు లో 100 పోస్టులు పూర్తయినాయి.  యాత్ర బ్లాగుని కలగాపులగం చెయ్యకూడదు అనే వుద్దేశ్యంతో యాత్ర మొదలు పెట్టిన రెండు నెలల తర్వాత  ఆగస్టు 2008 లో మొదలు పెట్టిన ఈ బ్లాగులో యాత్రకన్నా ముందు వంద పోస్టులు పోస్టు చెయ్యటం విశేషం.  దానికి ప్రధాన కారణం మూఢ నమ్మకాలకు పోకుండా శాస్త్రాల్లోకూడా ఏమి చెప్పారో ఉదహరిస్తూ జీ తెలుగు ప్రసారం చేసే గోపురంచూశాక ఇలాంటి విషయాలు అందరికీ తెలుస్తే బాగుంటుందనిపించింది.  గోపురం లో నేను చూసిన మొదటి ప్రోగ్రామూ. ఈ విషయాలు అందరికీ చెప్పటానికి నన్ను ఇన్స్పైర్ చేసిన టాపిక్ ఏమిటంటే,  భర్త చనిపోయిన తర్వాత పదో రోజునే ఆ మహిళను చూడాలా అన్నది.  నా యాత్ర చదివేవారిలో విదేశాలవారు ఎక్కువగా వున్నారని ఫీడ్జిట్ ట్రాఫిక్ ద్వారా అంతకు ముందు గమనించాను.  వారందరికీ ఈ టీవీ ప్రోగ్రామ్ ప్రసారాలున్నాయో లేవో తెలియదు.  అలాగే  ప్రసారాలు అందుబాటులో వున్నవారికి కూడా దైనందిక జీవన వురుకులు పరుగులతో  వీటిని చూసే సమయం వుంటుందో వుండదో  అందుకే నాకు తెలిసిన మంచి విషయాలు నలుగురికీ చెప్దామని వాటి గురించి రాయటం మొదలు పెట్టాను.  వాటితోనే వంద పోస్టులు త్వరగా పూర్తయినాయి.  వీటిని ఆదరిస్తున్న అందరికీ వందకాదు శతకోటి వందనాలు.

4 comments

ఇంటికి గుమ్మాలు, కిటికీలు ఎన్ని వుండాలి?




వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మాలు, కిటికీలు సరి సంఖ్యలో వుండాలి.   చివర సున్నా వుండే సంఖ్య 10, 20 అలా వుండకూడదని  చాలా మంది అపోహ పడతారు.  వాస్తు శాస్త్రం  ప్రకారం సరి సంఖ్యలో వుండాలంటారు తప్ప ఈ చివర సున్నా వుండే సంఖ్య వుండకూడదని ఎక్కడా లేదు.

సింహ ద్వారం ఎక్కడ పెట్టాలి అనే సందేహం  కొందరికి వస్తుంది.  మనం ఇల్లు కట్టుకునే ప్రదేశాన్ని 9 సమ భాగాలు చేసి అందులో 4, 5, 6 భాగాలలో సింహ ద్వారం పెట్టవచ్చు.   ఒకటే సింహద్వారం అయితే 5వ భాగంలో పెట్టాలి.  అందులో కూడా ఆ భాగమెంతవుంటే అంతా కాకుండా, కొంతమేర, అంగుళం రెండంగుళాలయినా తగ్గించి పెట్టాలి.  రెండు సింహ ద్వారాలు పెట్టవలసి వస్తే 4, 6 భాగాలలో పెట్టాలి. 

సింహ ద్వారం  ఎదురుగా మరో గుమ్మం లోపల వుండాలి    సింహ ద్వారం వీధికి ఎదురుగా వుండకూడదు.  వీధిశూల అంటారు.  సింహ ద్వారానికి రెండు వైపులా కిటికీలుండాలి.  ముఖంలో కళ్ళలాగా.  లేకపోతే అంధశూల అంటారు. కిటికీలు సరిగ్గాలేకపోతే ఇంట్లోకి వెలుతురు బాగా రావాలి కదండీ.


(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



0 comments

ఇల్లు కట్టుకోవటానికి జ్యోతిష్యులను ఎప్పుడు సంప్రదించాలి?




చాలామంది ఇల్లు దాదాపు పూర్తి అవుతున్న సమయంలో బరువులు ఏ వైపు పెట్టాలి, దేవుడిని ఎక్కడ పెట్టాలి, పొయ్యి గట్టు ఎక్కడ పెట్టాలి అని చిన్న చిన్న విషయాలకు సంప్రదిస్తారు.  ఇది సరియైన పధ్దతి కాదు. భూమి కొనే ముందే జ్యోతిష్యుడిని తీసుకెళ్ళి ఆ ప్రదేశం ఆ వ్యక్తి అక్కడ నివసించటానికి అనువుగా వున్నదా లేదా అని పరీక్ష చేయించాలి.  భూమి అడుగు పొరల్లో కొన్ని వేల సంపత్సరాలక్రింద భూమిలో కలిసిపోయిన ఇళ్ళు, దేవాలయాలు ఇలా ఎన్నో వుండవచ్చు.  జ్యోతిష్యుడు అక్కడ ప్రవేశించిన సమయాన్నిబట్టి లెక్కగట్టి ఆ స్ధలం కింద ఏమున్నాయో చెబుతారు.  ఈ విషయం జ్యోతిష్యులు తప్ప ఎవరూ చెప్పలేరు.  అంతకు ముందు ఆ ప్రదేశంలో వున్న ఇంట్లో హత్యలు, ఆత్మ హత్యలూ జరిగి  ప్రేతాలకి ఆలవాలమై వుండవచ్చు.  కొన్ని చోట్ల అంతకు ముందు శ్మశానాలు వున్న ప్రదేశాల్ని ఇప్పుడు ప్లాట్లు చేసి అమ్ముతుండవచ్చు.  భూమిలో పాతి పెట్టబడిన శవాల వల్ల కొన్ని చెడు వాయువులు తయారయి వుండవచ్చు.  శల్యాలు వుండి వుండవచ్చు.  అలాంటి ప్రదేశాలు నివాసయోగ్యంకాదు. అలాగే స్ధలం చతురస్రంగా కానీ, దీర్ఘ చతురస్రంగా కానీ వుండాలి.  కోణాలు లేకుండా వుండాలి.  వీటి గురించి శాస్త్రజ్ఞుణ్ణి సంప్రదించాలి. అందుకే సరైన వారిని సంప్రదించి తగిన స్ధలంలో ఇల్లు కట్టుకుంటే జీవితాంతం హాయిగా వుండవచ్చు.  


(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)




0 comments

పాముల పుట్టలను తొలగించి ఆ ప్రదేశంలో ఇల్లు కట్టుకోవచ్చా?




ఎక్కడో, ఎప్పుడో ఓ స్ధలం కొని కొంతకాలం అలాగే వదిలేసి వుంటారు.  ఇప్పుడు  ఆ స్ధలంలో ఇల్లు కట్టుకోవాలని చూస్తే అక్కడ పాముల పుట్టలు.  ఇప్పుడక్కడ ఆ పుట్టలు తొలగించి ఇల్లు కట్టుకోవచ్చా?  అలా కట్టుకుంటే ఆ పాములు పగబడతాయనీ, సుఖంగా వుండలేరనీ ఎవరో అన్నారు.  ఇప్పుడెలా? 

శాపాలూ, కోపాలూ పక్కన బెడితే ఇలాంటి పరిస్ధితుల్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు రెండు. 

మొదటిది భూత దయ.  అన్ని పుట్టల్లోనూ  నాగు పాములుండవు.  కొన్ని పుట్టల్లో అసలు పాములే వుండవు.  కొన్నింటిలో వేరే జాతి పాములుండవచ్చు.  ఏవైనా  వాటిని చెదరగొట్టటంవలన అవి చనిపోవచ్చు, లేకపోతే జనావాసాల మధ్యకి వెళ్ళి వాళ్ళని కాటెయ్యవచ్చు.  మరి ఇంత డబ్బు పెట్టి ఏదో సొంత ఇల్లు కట్టుకుందామనే ఆశతో కొనుక్కున్న స్ధలాన్ని పాములకోసం వదిలేయలేము కదండీ అంటారా?  అదీ నిజమే.  అప్పుడేం చెయ్యాలి

ఈ విషయంలో శాస్త్రం ఏం చెబుతోంది?  వాస్తు శాస్త్రం, జలార్కళ శాస్త్రం ప్రకారం ఎక్కడైతే నీరు ఎక్కువగా వుంటుందో, ఆ చల్లదనానికి అక్కడ చీమలు చేరి పుట్టలు పెడతాయి, ఆ పుట్టల్లోకి పాములుకూడా వస్తాయి.  అంటే పాములున్నచోట జలవనరులు అధికంగా వున్నాయన్నమాట.  తడి ఎక్కువగా వున్నచోట నేల గట్టిగా వుండదు.  ఆలాంటి నేలలో ఇల్లు కడితే బలంగా వుండదు.. భూమిలో జలనాడులు 8 రకాలుంటాయి.  వాటిలో కొన్ని పెద్ద ప్రవాహాలుంటాయి.  కొన్ని చోట్ల 300 మీటర్లు అలా భూమి లోపల పెద్ద జల వనరులుంటాయి.  అలాంటివాటిమీద ఇల్లు కడితే ఏ చిన్న భూకంపం వచ్చినా ఆ ఇల్లు కూలిపోయే వ్రమాదముంది.  అందుకే అలాంటి ప్రదేశాలని ముందే శాస్త్రజ్ఞులకు చూపించి నేల గట్టితనాన్ని పరీక్షించి,  నేల ఇల్లు కట్టటానికి అనువుగా లేకపోతే కారణాలు తెలుసుకుని,  స్ధలాన్ని ఇంటి నిర్మాణానికి అనువుగా మలచుకుని తర్వాత ఇల్లు కట్టుకుంటే కలకాలం ఆ ఇంట్లో సుఖంగా వుండచ్చు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)






0 comments

Thursday, February 11, 2010

క్షమించేవారు ఎక్కువ కాలం బ్రతుకుతారా?

Thursday, February 11, 2010



....క్షమయా ధరిత్రీ అన్నారు మనవాళ్ళు.  క్షమా గుణంలో భూ దేవి అంత గొప్పవారు వేరెవరూ లేరనీ, ఆవిడలాగా క్షమా గుణం నేర్చుకోవాలనీ అంటారు.  అయితే మనకి కష్టాలు కలిగించినవారిని క్షమించేసి నవ్వేసే గుణం అందరికీ వుండదు.  వారికి కలిగించిన కష్టానికి తగిన ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకుంటారు కొంతమంది...కొంతమంది క్షమించి వదిలేస్తారు.  అలా క్షమించి వదిలేయటంవల్ల  ఆత్మ తృప్తి వుంటుంది.  నేనెవరికీ అపకారం చెయ్యలేదు అనే స్ధిమితం వుంటుంది.   మనకు సంబంధించినవారూ ప్రశాంతంగా వుంటారు.  అనవసరమైన గొడవలు పెరగవు.  దానితో పరిస్ధితులు ప్రశాంతంగా వుంటాయి.   అలాగే క్షమింపబడ్డవాళ్ళు ఈ విషయంలో నేనేమీ తప్పు చెయ్యలేదుకదా అని తిరిగి ఆలోచించుకునే అవకాశం వస్తుంది.  వాళ్ళల్లో వాళ్ళు పశ్తాత్తాపపడే అవకాశం వస్తుంది. 

ఈ విషయంలో అమెరికాలో మిచిగన్ యూనివర్సిటీలో ఒక అధ్యయనం జరిగింది.  క్షమించే గుణం వున్న 1400 మనుషులమీద ఈ అధ్యయనం చేశారు.  మిగతా వారిలాగా ఈ క్షమా గుణం వున్నవారికి రోగాలు రాలేదుట.  మనస్సు, ఆత్మ ఎప్పుడూ ప్రశాంతంగా వుండటంవల్ల కొత్త రోగాలు రావు, వున్న రోగాలు అదుపులో వుంటాయి, దానితో ఆయుః ప్రమాణం పెరుగుతుంది అని తేల్చారు.  కోపంతో వూగి పోవటంవల్ల అన్నీ అదుపు తప్పటమేకాక వున్న రోగాలు పెరుగుతాయి, కొత్త రోగాలు వస్తాయి.  దానితో ఆయుః ప్రమాణం తగ్గుతుంది.  సైన్స్ అదే చెప్తోంది, శాస్త్రాలు అదే చెప్తున్నాయి, ఇప్పటి పరిశోధనలూ అదే చెప్తున్నాయి, డాక్టర్లుకూడా అదే చెప్తున్నారు..

సో, మనకి ఏది మంచిదో దానినే పాటించి సత్ఫలితాలు పొందటం ఇంక మన వంతు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


0 comments

Wednesday, February 10, 2010

కోపం రోగాల్ని పెంచుతుందా?

Wednesday, February 10, 2010



అవును.  మాటనీ, మనసునీ అదుపులో పెట్టుకోవటంవల్ల ప్రయోజనం చాలావుంటుంది.  అలాగే, తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేనివారికి ఇబ్బందులుకూడా ఎక్కువే.    తామస గుణం వల్ల మానసికి స్ధితి సరిగ్గాలేక హత్యలు కూడా చేస్తారు కొందరు.  అందుకే  కామ, క్రోధ, మద మాత్సర్యాలను అదుపులో వుంచుకోవాలని పెద్దలూ, శాస్త్రాలూ చెబుతున్నాయి.

కోపంలో వున్నవాళ్ళకి ఏం చేస్తున్నరో, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు.  బి పీ పెరుగుతుంది.  ఒక్కోసారి బీపీ విపరీతంగా పెరగటంవల్ల రక్త ప్రసరణ ఎక్కువై, నరాలు చిట్లిపోయి ప్రాణం పోయే ప్రమాదంకూడా వుంది.  రక్త ప్రసరణలో వచ్చే తేడా ప్రభావం  ఆప్టిక్ నెర్వ్ మీద  పడి కళ్ళ జబ్బులు వస్తాయి.  ఎక్కువ టెన్షన్ వల్ల నరాలు అదుపు తప్పి పక్షవాతం, గుండె జబ్బులు రావచ్చు.  మానసిక స్ధితిని అదుపులో పెట్టుకోలేకపోతే కొందరికి హిస్టీరియా రావచ్చు, మతి స్ధిమితం తప్పవచ్చు. 

ఏంటండీ  మనిషన్నాక కోపతాపాలుండవా  అంత మాత్రానికే అంతలా భయపెడుతున్నారు అంటారా?  అందరికీ ఇవ్వన్నీ వస్తాయని కాదండీ.  కోపంలో మనిషి అదుపు తప్పితే ఇవ్వన్నీ వచ్చే అవకాశాలున్నాయి.  అంతేకాదు సామాజికంగా ఆలోచించినాకూడా కోపంలో  మాటా మాటా పెరగవచ్చు.  దానితో తోటివారు శత్రువులు అవ్వచ్చు.    కోపంలో మనిషి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు.  దానితో వ్యాపారంలో నష్టాలు రావచ్చు.

కోపం వచ్చేవారు ముఖ్యంగా మూడు రకాలు.

మొదటి రకంవారు కోపాన్ని ఒక కవచంలాగా వుపయోగించుకుంటారు.  ముఖ్యంగా తమకింద పని చేసేవాళ్ళమీద.  నువ్వీ పని చెయ్యకపోతే నాకు కోపం వస్తుంది, నువ్విలా చెయ్యకపోతే నాక్కోపం వస్తుంది అంటూ బెదిరిస్తూ వుంటారు.  ఇది అలవాటుగా మారితే చీటికీ మాటికీ కోపం వస్తుంది.  దానివల్ల నష్టం వారికే.

ఇంకో రకం వారుంటారు.  వారు ఏది చూసినా ఎక్కువ ఫీల్ అవుతారు.  సినిమా, టీవీ సీరియల్, ఎదుటివారి బాధలూ, ప్రపంచంలో జరిగే సంఘటనలూ...వీరి ఉద్వేగాలను పెంచే కారణాలే.  ఎక్కడ ఏమి జరిగినా అది తమకే జరిగిందని ఫీల్ అవుతారు.

పరిస్ధితులవల్ల కొందరికి కోపం వస్తుంది.  వారు పరిస్ధితుల పట్ల అవగాహన పెంచుకోవాలి.  ఆ స్ధితి ఎందుకు వచ్చింది  పరిష్కారమేమిటి  ఏమి చేస్తే ఆ సమస్య పోతుందో  ఆలోచించాలి.  దూకుడు తగ్గించుకుని,  కొద్దిగా ఆలోచించి పనులు చేసుకుంటే వారు కోపం తగ్గి, ప్రశాంతంగా వుండగలుగుతారు.

ఇన్ని ఇబ్బందులూ, బాధలూ పెడుతుంది కనుకే కోపాన్ని అదుపులో వుంచుకోవాలని శాస్త్రాలు, పెద్దలు, ఇప్పటి డాక్టర్లూ అందరూ చెప్తున్నారు.    ఇప్పుడు ఈ విషయాన్ని చాలామంది గ్రహిస్తున్నారు.  అందుకే తమ కోపాన్ని తగ్గించుకుని, మనసుని అదుపులో వుంచుకుని ఆరోగ్యం కాపాడుకునేందుకు యోగా సెంటర్లలో, లాఫింగ్ క్లబ్బుల్లో చేరుతున్నారు. సంతోషంగా వుండటానికి ప్రయత్నిస్తూ, పరిస్ధితులపట్ల అవగాహన పెంచుకోవటంవల్ల కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు.

ఏ మనిషయినా తనని తాను అదుపులో వుంచుకుంటే, వారు ప్రశాంతంగా, ఆరోగ్యంగా వుండటమే కాకుండా,వారి ఇంట్లోవారు, చుట్టు ప్రక్కలవారూ.  పనిచేసే ప్రదేశంలో వారూ అంతా ప్రశాంతంగా వుండవచ్చు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



మనలో మాట

కో పం వచ్చినప్పుడు మౌనంగా వుండటం వల్ల కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోవచ్చు.  అలాగే అంకెలు లెక్క పెట్టటం కూడా ఒక చిట్కా.  ఆ ప్రదేశంనుంచి అవతలకి వెళ్ళటం, వేరే పనిలో లగ్నం కావటంవల్లకూడా కోపం అదుపులోకి వస్తుంది.

సో, మన తక్షణ కర్తవ్యం...మన కోపాన్ని అదుపులో వుంచుకుని, తద్వారా మనం ఆరోగ్యంగా వుండటమేగాక పరిసరాలనుకూడా ఆరోగ్యంగా వుంచటం

1 comments

Monday, February 8, 2010

అనంతగిరిలో అభిషేకం

Monday, February 8, 2010



అనంతగిరి ఏమిటి?  అక్కడ అభిషేకం ఏమిటి అని అంటున్నారా?  అనంతగిరి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ కి 5 కి.మీ. ల దూరంలో వున్న హిల్ స్టేషన్.  ఇక్కడ అనంత పద్మనాభస్వామి ఆలయమేకాక  చిన్న అడవి కూడా వుంది.  దానితో చుట్టుప్రక్కలవారికి సెలవు రోజుల్లో ఆట విడుపుగా సేద తీరే అవకాశమేకాక బుల్లి తెర, పెద్ద తెర నిర్మాతలకీ, దర్శకులకీ తమ  ధారావాహికాలు, సినిమాలు చిత్రీకరించటానికి కూడా అనువుగా వుంది.

మేము 7-2-2010 న అనంతగిరి వెళ్ళినప్పుడు అక్కడ ఈటీవి లో రోజూ ప్రసారమయ్యే సీరియల్ అభిషేకం షూటింగ్ జరుగుతోంది.  ముఖ్య నటీనటులతో సహా దర్శకుడు శ్రీ రాజేంద్ర అక్కడ వున్నారు.    భోజనాల సమయంలో మేము కూర్చున్న ప్రదేశానికే వచ్చి భోజనాలు చేశారు.  ఆ సమయంలో వారితో కొంచెం సేపు సరదాగా ముచ్చటించటం జరిగింది. 

దర్శకుడు శ్రీ రాజేంద్రతో మేము చాలామంది టీవీ అభిమానులు/బాధితుల తరఫున చెప్పిన సంగతేమిటంటే సీరియల్స్ కి కూడా ముగింపు వుండాలనీ,  ఏదో చూస్తున్నారుకదాని తర తరాల వరకూ కధ పొడిగిస్తూ జీడిపాకం కూడా ఉపమానానికి సరిపోని రీతిలో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించవద్దు అని.  వారి ఇబ్బందులు వారికి వున్నా, సంక్షిప్తంలో వున్ని సొగసులు చూపిస్తే ప్రేక్షకులేకాక పెట్టుబడిదారులూ  ఆదరిస్తారు అని మా అభిప్రాయం మేము చెప్పాము.

అభిషేకం టీమ్ తో తీసుకున్న ఫోటోలు మీరూ చూడండి.  
 

0 comments