Saturday, February 13, 2010

పాముల పుట్టలను తొలగించి ఆ ప్రదేశంలో ఇల్లు కట్టుకోవచ్చా?

Saturday, February 13, 2010



ఎక్కడో, ఎప్పుడో ఓ స్ధలం కొని కొంతకాలం అలాగే వదిలేసి వుంటారు.  ఇప్పుడు  ఆ స్ధలంలో ఇల్లు కట్టుకోవాలని చూస్తే అక్కడ పాముల పుట్టలు.  ఇప్పుడక్కడ ఆ పుట్టలు తొలగించి ఇల్లు కట్టుకోవచ్చా?  అలా కట్టుకుంటే ఆ పాములు పగబడతాయనీ, సుఖంగా వుండలేరనీ ఎవరో అన్నారు.  ఇప్పుడెలా? 

శాపాలూ, కోపాలూ పక్కన బెడితే ఇలాంటి పరిస్ధితుల్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు రెండు. 

మొదటిది భూత దయ.  అన్ని పుట్టల్లోనూ  నాగు పాములుండవు.  కొన్ని పుట్టల్లో అసలు పాములే వుండవు.  కొన్నింటిలో వేరే జాతి పాములుండవచ్చు.  ఏవైనా  వాటిని చెదరగొట్టటంవలన అవి చనిపోవచ్చు, లేకపోతే జనావాసాల మధ్యకి వెళ్ళి వాళ్ళని కాటెయ్యవచ్చు.  మరి ఇంత డబ్బు పెట్టి ఏదో సొంత ఇల్లు కట్టుకుందామనే ఆశతో కొనుక్కున్న స్ధలాన్ని పాములకోసం వదిలేయలేము కదండీ అంటారా?  అదీ నిజమే.  అప్పుడేం చెయ్యాలి

ఈ విషయంలో శాస్త్రం ఏం చెబుతోంది?  వాస్తు శాస్త్రం, జలార్కళ శాస్త్రం ప్రకారం ఎక్కడైతే నీరు ఎక్కువగా వుంటుందో, ఆ చల్లదనానికి అక్కడ చీమలు చేరి పుట్టలు పెడతాయి, ఆ పుట్టల్లోకి పాములుకూడా వస్తాయి.  అంటే పాములున్నచోట జలవనరులు అధికంగా వున్నాయన్నమాట.  తడి ఎక్కువగా వున్నచోట నేల గట్టిగా వుండదు.  ఆలాంటి నేలలో ఇల్లు కడితే బలంగా వుండదు.. భూమిలో జలనాడులు 8 రకాలుంటాయి.  వాటిలో కొన్ని పెద్ద ప్రవాహాలుంటాయి.  కొన్ని చోట్ల 300 మీటర్లు అలా భూమి లోపల పెద్ద జల వనరులుంటాయి.  అలాంటివాటిమీద ఇల్లు కడితే ఏ చిన్న భూకంపం వచ్చినా ఆ ఇల్లు కూలిపోయే వ్రమాదముంది.  అందుకే అలాంటి ప్రదేశాలని ముందే శాస్త్రజ్ఞులకు చూపించి నేల గట్టితనాన్ని పరీక్షించి,  నేల ఇల్లు కట్టటానికి అనువుగా లేకపోతే కారణాలు తెలుసుకుని,  స్ధలాన్ని ఇంటి నిర్మాణానికి అనువుగా మలచుకుని తర్వాత ఇల్లు కట్టుకుంటే కలకాలం ఆ ఇంట్లో సుఖంగా వుండచ్చు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)






0 comments: