తప్పకుండా వుంటుంది. ఇంటి యజమాని ఆత్మ హత్య చేసుకుంటే ఆ కుటుంబం
వీధిన పడుతుంది. పిల్లలు దిక్కులేని
వాళ్ళవుతారు. వారి బాధ్యతంతా భార్య మీద పడుతుంది. అన్నింటికీ ఆలంబనగా వుండే వ్యక్తిపోతే ఆ కుటుంబం ఎంత మానసిక క్షోబననుభవిస్తుందో,
ఆకుటుంబం కోలుకోవటానికి ఎంత కాలం పడుతుందో ఒక్కసారి ఆలోచించండి. అదే ఇంటి ఇల్లాలు ఆత్మ హత్య చేసుకుంటే ఆ పిల్లల
సంగతేమిటి? తల్లి దండ్రులు చూసినట్లు ఎంత అయినవారయినా
చూడగలరా? ఎవరు పెట్టే బాధలనన్నా తట్టుకోలేక ఆత్మ హత్య
చేసుకుంటే వారికి ఇంకా స్వేఛ్ఛనిచ్చినట్లుకాదా?
తల్లిదండ్రులు పిల్లలను ఎంత అల్లారు ముద్దుగా పెంచుతారు. వాళ్ళు ఎంతో కష్టపడి ఆ కష్టాన్ని పిల్లలకు
తెలియనీయకుండా పెంచాలనీ, వారు జీవితంలో ఉన్నత స్ధాయిలో వుంటే చూసి సంతోషించాలనీ
తపన పడతారు. తమ కడుపు కట్టుకుని పిల్లలకు
సకల సౌఖ్యాలూ అమర్చాలని చూస్తారు. కొడుకు
పుడితే తమ వృధ్ధాప్యంలో తోడుగా వుంటాడనీ, పున్నామ నరకంనుంచీ తప్పిస్తాడనీ కలలు
కంటారు. వారి గురించి ఆలోచించకుండా
ఆవేశంలో ఆత్మ హత్య చేసుకుంటే వారి
పరిస్ధితి ఏమిటి అని ఒక్క క్షణం ఆలోచిస్తే ఆత్మ హత్య చేసుకోగలరా?
అదే ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే తర్వాత
ఆడపిల్లలుంటే వారికి పెళ్ళి కావటం కష్టమవుతుంది.
సామాజికంగా ఎన్ని సమస్యలో ఎదుర్కోవాల్సి వస్తుంది. తమని ఇంతవారిని
చేసినందుకు ప్రతిఫలంగా తల్లి దండ్రులను అంత దుఃఖంలో ముంచవచ్చా? తల్లిదండ్రులనూ, తోబుట్టువులనూ అంత
కష్టపెట్టవచ్చా? సామాజికంగా, ఆర్ధికంగా,
మానసికంగా ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబ
సభ్యులమీద ఆ ప్రభావం చాలాకాలం వుంటుంది.
కుటుంబ సభ్యులమీదేకాదు, వారి స్నేహితులమీద, ఇరుగు
పొరుగు మీదకూడా వారి ఆత్మ హత్య ప్రభావం
చాలాకాలం వుంటుంది. అనేక సమయాలలో వారు
చనిపోయినవారిని గుర్తుచేసుకుని బాధపడుతూ వుంటారు.
కొంతమందయితే చాలాకాలం కోలుకోలేరు కూడా.
ఇంతమందిని క్షోబపెట్టి ఆత్మహత్య చేసుకుని
సాధించేదేమిటి? ఇంకా బతికున్నవాళ్ళని రోజూ
చంపినవాళ్ళవటంతప్ప. తమ ఆత్మహత్యవల్ల తన
మీద ఆధారపడ్డవాళ్ళకూ, తన కుటుంబానికీ బాధల్నీ సమస్యలనీ మిగల్చే ఆత్మహత్యలు చాలామటుకూ
ఆవేశంలో చేసుకుంటారు. ఆవేశంలో ఏ నిర్ణయాలూ
తీసుకోకూడదు. భరించలేని బాధలు రావచ్చు.
ఎన్నో సమస్యలు ఎదురవవచ్చు. అయితే
పరిష్కారం లేని సమస్యలు వుండవు. ఆ
పరిష్కారం కనుక్కోవాలంటే ఆవేశం తగ్గాలి. ఆవేశం తగ్గిన తర్వాత సరైన ఆలోచనలు వస్తాయి
సరైన ఆలోచన వచ్చి పరిష్కారం కనుక్కుంటే సమస్య తేలికవుతుంది. కనుక ఏ
విషయంలోనైనా సరే ఆవేశం వచ్చినప్పుడు సంయమనం పాటించటం చాలా అవసరం. వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవటంకూడా
అవసరమే. అందుకే ఆవేశం తగ్గేదాకా సంయమనం
పాటించటం అవసరం.
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)
0 comments:
Post a Comment