Friday, February 19, 2010

వాస్తు దోషాలకి నివారణ వుందా?

Friday, February 19, 2010


వాస్తు దోషాలని నివారించవచ్చా అంటే నివారించవచ్చనే చెప్పవచ్చు.  ఎలాగంటే….

కొందరికి ప్రతి విషయానికీ గాబరాపడి, కంగారుపడి, బెంబేలెత్తిపోవటం అలవాటు.  ఆ అలవాటు మానుకోవాలి.  ముఖ్యంగా ప్రతి చిన్న విషయాన్నీ వాస్తు దోషానికి ముడి పెట్టి భయపడటం మానుకోవాలి.  ఎంత వాస్తు ప్రకారం కట్టిన ఇంట్లోనైనా ఏదో ఒక చిన్న లోపం వుండకపోదు.  అలాగని తరచూ ఇళ్ళు మారటంకూడా అయ్యేపని కాదుకదా.  మరి సరి చేసుకోవటం ఎలా?

రోజూ గడపకి పసుపు రాసి బొట్టు పెట్టే ఇంట్లోకి, ఇంటి ముందు ముగ్గు వుండే ఇంట్లోకీ దుష్ట శక్తులు ప్రవేశించవంటారు.  ప్రతి నిత్యం దేవునికి దీపారాధన, దేవతారాధన జరిగే ఇంట్లో, దేవుడి గంట మ్రోగే ఇంట్లో దుష్ట శక్తులేకాక వ్యాధి కారక బాక్టీరియా కూడా రావంటారు.  పరిశుభ్రంగా, గాలి వెలుతురు సమంగా వచ్చే ఇంట్లో చెడు గాలులు ప్రవేశించవంటారు.  అలాగే ఇంట్లో ఘర్షణ, కొట్లాటలు లేకుండా చూసుకోవాలి.  ఇంట్లో ఎవరూ మనస్తాపం చెందకుండా వుండేటట్లు చూసుకోవాలి.  మన చుట్టూ, మనలో, ప్రతి వ్యక్తిలో, ఎక్కడ చూసినా భగవంతుని చూడగలగాలి.  తాను ప్రశాంతంగా వుంటూ, పరిసరాలనూ, తనకు సంబంధించినవారినీ, తన చుట్టుపక్కలవారినీ ప్రశాంతంగా వుంచే వ్యక్తిని ఏ వాస్తు దోషాలూ ఏమీ చేయలేవు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

మనలో మాట

పరిశుభ్రంగా, ప్రశాంతంగా వుంటూ, ప్రతివారిలో భగవంతుని చూడగలిగే వ్యక్తికి ఆందోళనలు తక్కువ వుంటాయి.  విజ్ఞతతో ఆలోచించి సమస్యకు పరిష్కారం కనుక్కోగలుగుతారు.  అందుకనే దేనికీ భయపడరు.  అదీగాక ఏ వ్యక్తి జీవితంలోనైనా ఒడిదుడుకులు తప్పనిసరి.  సుఖంగా వున్నప్పుడు పొంగిపోయి, కష్టాలొచ్చినప్పుడు కుంగిపోకుండా వ్యవహరించగలిగినవారికి ఎప్పుడూ మేలే జరుగుతుంది.





0 comments: