Saturday, February 20, 2010

తలమీద కాకి తన్నితే దోషమా?

Saturday, February 20, 2010



కొందరు కాకి తన్నితే భయపడిపోతారు.  శని వాహనం కనుక శని పట్టుకోవటానికో, ఏదైనా దోషం జరగటానికో, లేక యముడు రాకకి సంకేతమో అని తెగ భయపడతారు.  అలా భయపడాల్సిన అవసరంలేదు. 

సాధారణంగా కాకి తన్నటం మనం ఎక్కువగా చూడం.  ఏదన్నా తోటలకి వెళ్ళినప్పుడు అక్కడ పళ్ళకోసం తిరుగుతూ తన్నవచ్చు, అలాగే సముద్రతీరాన చేపలు ఆరబెట్టి వుంటాయి వాటికోసం తిరుగుతూ అక్కడకి వచ్చినవారిని తన్నవచ్చు.

కాకి చిన్న పక్షి అయినా  బలంగా తన్నుతుంది.  చాలా దెబ్బ తగులుతుంది.  దానితో తలమీద తన్నినా దాని ప్రభావం శరీరం మొత్తంమీద వుంటుంది.  ఒక్కోసారి కంటి చూపుకూడా ఎఫెక్ట్ కావచ్చు.  దానితో భయపడతారు.  మనకున్న నమ్మకాలవల్లకూడా ఇంకా కొంత భయపడతారు.  తన్నింది కాకవటంతో ఇంకేమన్నా దోషం వుందేమోననే భయం.  పైగా కాకి శని వాహనం కనుక శని దూతగా వచ్చిందేమోనని, ఏదో చెడు జరుగుతుందేమోనని భయం.  శ్రాధ్ధ కర్మల సమయంలో కూడా కాకి పిండం అని పెడతారు.  ఆ సమయంలో కాకి తన్నితే యమ సంకేతమని కంగారు పడతారు.  నిత్య జీవితంలో ఏదో ఒకటి జరుగుతూనే వుంటాయి.  వాటిని నమ్మకాలకి ముడిపెట్టి అనవసరమైన కంగారు పడకూడదు.  ఒకవేళ ఇంకా ఏదో అనుమానం అనిపిస్తుంటే ఇంచక్కా శివాలయానికి వెళ్ళి, నువ్వుల నూనెతో దీపారాధన చేసి, అభిషేకం చేయిస్తే దోషం పోతుంది.  కాకి తన్నటం వల్ల అనారోగ్యం చేస్తే డాక్టరుకి చూపించుకోవాలి. 

ప్రతి సమస్యకీ పరిష్కారముంటుంది కనుక దేనికీ భయపడక్కరలేదు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



7 comments:

kvsv said...

పిల్లి యెదురోస్తే???/lol,,,,jk

Sundeep Borra said...

దోషమే, కాకి కి

Nrahamthulla said...

మన రాష్ట్రంలో కొన్ని మూఢనమ్మకాలు
* పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు,
* పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడి మీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.
* బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేస్తారు.
* జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.
* అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.
* చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
* చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.
* కొందరు గ్రహణం రోజు బోజనం చెయ్యరు, అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.
* బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీకొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచితుమ్ము కాదు అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై చెబుతుంది అంటారు.
* తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువమంది ఆడపిల్లలు గలవారు ఆడపిల్లను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడికోసం ఆడపిల్లను దానం చేసి వదిలించుకుంటారు.
* కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించారు.
* నాగమణి, నల్లపసుపు కొమ్ము, నేలగుమ్మడికాయ, నల్లపిల్లి, ఇరవైగోళ్ల తాబేలు, రెండుతలల పాము లాంటివాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు .(సాక్షి గుంటూరు6.11.2009)
*కొందరు కాకి తలమీద తన్నితే అది శని వాహనం కనుక శని పడుతుందనీ, యముడి రూపం కనుక మరణిస్తామని భయపడతారు
దేశంలో కొన్ని మూఢనమ్మకాలు
* ఒరిస్సా-జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షల రూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు.
* మధ్య ప్రదేశ్‌-జబల్‌పూర్‌కు చెందిన సర్జన్ బాబా-'సరోత బాబా' ఈశ్వర్ సింగ్ రాజ్‌పుట్. గోళ్ళను కత్తిరించే గోరుగల్లు తో రోగుల కంటివ్యాధులను నయం చేస్తానని నమ్మబలికి పదకొండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.http://telugu.webdunia.com/religion/believeitornot/article/0709/17/1070917027_1.htm
* కేరళ-నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు.
* నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.
* గోదానం చేసినవారు పడవలో వైతరణి నదిని దాటగలరు గాని, గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగుతూ ఉండే ఆ నదిలో దిగి నడవవలసిందేనట,

psm.lakshmi said...

ksvs garu, sandeep garu
ha ha ha
psmlakshmi

psm.lakshmi said...

రహమతుల్లాగారూ,
మీరు సేకరించిన వివరాలు తెలియజేసినందుకు సంతోషం. ఏమనుకోకపోతే ఒక చిన్న సవరణ...గ్రహణ సమయాల్లో ఆలయాలు మూసేయటం గ్రహణ సమయాన్నిబట్టి కొన్ని గంటలు ముందూ, తర్వాతా వుంటుందికానీ ఉదయం 10 నుంచీ సాయంత్రం 6-30 దాకా అని కాదు.
psmlakshmi

Nrahamthulla said...

అలాగేనండి. గ్రహణ సమయాల్లో అని సవరిస్తాను.

Nrahamthulla said...

అపోహలు ,అపార్ధాలు, ధారుణాలు,దుర్మార్గాలు,అమానుషాలు
* గుంటూరులో 'అగ్ని యాగం' చేయబట్టే ఆసియా లో కెల్లా పెద్దదయిన MARKET YARD మాడి మసి అయిందని, అలాగే కేసముద్రం దగ్గిర ఇటువంటి యాగం చేయబట్టే 'గౌతమీ' కాలిందని చెప్పుకుంటున్నారు.
* అచ్చంపేట మండలం వలపట్ల గ్రామంలో చేతబడి చేస్తున్నారని గ్రామంలో సంభవిస్తున్న చావులకు వీరే కారణంగా ఆరోపిస్తూ లక్ష్మమ్మ, నారమ్మలను రాళ్ళతో చావబా దారు.నోట్లో పాదరసాన్ని పోశారు. దాదాపుగా 3గంటల పాటు ఇద్దరు మహిళలను చావబాదు తున్నా గ్రామంలోని వారు ప్రేక్షకులుగా చూశారుకానీ మహిళలను రక్షించే యత్నం చేయలేదు. లక్ష్మమ్మపై దాడి జరుగు తున్న సమయంలో అడ్డు తగిలిన ఆమె పిల్లలను సైతం గ్రామస్తులు చావ గొట్టారు. మహిళల ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా చేసి చితకబాదారు.[సాక్షి ,సూర్య 3.2.2009.]
* జార్ఖండ్‌లోని దేవ్‌ఘఢ్ జిల్లా పథర్‌ఘాటియా గ్రామంలో మహిళల్ని దేవతలుగా పూజించే భారతీయ సంస్కృతిని సైతం పక్కనపెట్టి బహిరంగంగా ఐదుగురు మహిళల్ని వివస్త్రలను చేశారు. వారిని నగ్నంగా వూరేగించారు. మంత్రగత్తెలనే అనుమానంతో కొందరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వందల మంది ఈ దురంతానికి సాక్ష్యంగా నిలిచారు. బాధిత మహిళల్లో ముగ్గురు వితంతువులు ఉన్నారు. ఇద్దరితో మలమూత్రాలు బలవంతంగా తినిపించేందుకు ప్రయత్నించారు.మంత్రగత్తెలని అంగీకరించాలంటూ వేధించారు. చేతబడి చేస్తున్నట్లుగా ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఆ వూరిలోని భూతవైద్యుడి సూచనల మేరకే వారీ పనికి పాల్పడ్డారు. ఈ మహిళలు చేతబడి చేస్తూ గ్రామంలో సమస్యలు సృష్టిస్తున్నారని భూత వైద్యుడు చెప్పడంతో కొందరు గ్రామస్థులు ఆగ్రహించి ఈ దారుణానికి పాల్పడ్డారు.(ఈనాడు20.10.2009)
* ఉండ్రాజవరం లో చోటుచేసుకున్న మరణాలకు చేతబడే కారణమని స్థానికులు నమ్ముతూ ఆరుగురి పళ్లు పీకేశారు.అడ్డొచ్చిన పోలీసులను సైతం చితకబాదేశారు. వచ్చారు. గ్రామస్థులు సుమారు 4 వందలమంది అనుమానితులపై పడ్డారు. కారణం చెప్పకుండానే లాక్కొచ్చి రామాలయంలో బంధించి చిత్రహింసలు పెట్టారు. ఆవేశంతో చేతికందిన వాటితో బాధితుల పళ్లు పీకేశారు. తామేం చేయలేదని, వదిలిపెట్టమని ప్రాధేయపడ్డా ఎవరూ కనికరించలేదు.గ్రామస్థుల దాడిని తట్టుకోలేకపోయానని కానిస్టేబుల్‌ మల్లికార్జునరావు బోరున విలపించారు. తమకే రక్షణ లేనప్పుడు సామాన్యులను ఎలా కాపాడగలమని ప్రశ్నించారు. తన లాఠీ, టోపీ లాక్కుని చొక్కా చింపేశారని ఘొల్లుమన్నారు. (ఈనాడు 18.3.2010)