Monday, February 1, 2010

కొన్ని దేవాలయాలలో భక్తులు భిక్షాటన ఎందుకు చేస్తారు?

Monday, February 1, 2010



కొన్ని ప్రాంతాలలోని దేవాలయాలలో ఈ భిక్షాటని ఇప్పటికీ కనబడుతుంది.  ఈ అలవాటు, ఆచారం ఎందుకు వచ్చి వుంటుంది?  పూర్వం సాధువులు, గురుకులంలో విద్యాభ్యాసం చేసేవాళ్ళు, కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే భిక్షాటన చేసేవారు.  ఇప్పుడూ ఆ ఆచారం కొన్నిచోట్ల కనబడుతోంది.   ముఖ్యంగా దత్త సాంప్రదాయంలోనూ, బాసరలో దీక్ష తీసుకున్నవారు ఈ పధ్ధతి పాటిస్తున్నారు.  ఆపద మొక్కులవాడు ఆ తిరుపతి వేంకటేశ్వరునికి కూడా జోగెత్తి తిరుపతి వస్తామని మొక్కుకుంటారు కొందరు.  (ఇదివరకు  అలా జోగెత్తేవారు విరివిగానే కనిపించేవారు.  మేళ తాళాలతో, బంధుజనంతో దీక్షా వస్త్రాలు ధరించి రోడ్డుమీద గోవింద నామస్మరణ చేస్తూ వెళ్తుంటే ఎవరికి తోచింది వారు వాళ్ళ పళ్ళెంలో వేసేవారు. కొన్నాళ్ళ తర్వాత ఆ ఆచారం తగ్గి ఎవరో తెలిసినవారిని కొందరిని అడిగి వెళ్ళేవాళ్ళు.  వాళ్ళిచ్చిన దానితో వీళ్ళ ఖర్చు వచ్చేస్తుందని కాదు,  ఆ డబ్బు వారు పెట్టుకోలేక కాదు..తమ అహంకారాన్ని విడిచి పెట్టి స్వామి శరణు వేడుకోవటమే దానర్ధం.  ఇప్పుడు అది కూడా తగ్గినట్లుంది). 

కొన్ని ఊళ్ళల్లోకూడా నియమాలుంటాయి.  అక్కడివాళ్ళు ప్రతిరోజూ ఎవరికైనా భిక్ష పెడితేగానీ వారు తినరు.  ఎంత శ్రీమంతుడైనా, ఎంత పెద్ద అధికారి అయినా, ఎంత పెద్ద పొజిషన్ లో వున్నా ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు చెప్పులుకూడా లేకుండా ఎవరింటిముందుకన్నా వెళ్ళి భిక్ష అడిగి తినాలి.  అంటే మన అహంకారాన్ని ఎంత చంపుకోవాలో చూడండి.  అలా అహంకారాన్ని చంపుకుని, సంస్కారంతో, భగవంతుడిముందు అంతా తక్కువే అనీ, మనుషులందరూ భగవత్స్వరూపులనీ మానవత్వపు విలువలు తెలుసుకోవటానికే ఈ భిక్షాటన. 

ఆ క్షేత్రాలకొచ్చే భక్తులు విద్య, వివాహం, ఆరోగ్యం వగైరా ఎన్నో కోర్కెలతో వస్తారు.  ఆ కోరిక తీరాక భగవంతుని క్షేత్రంలో వారి అహంకారాన్ని పూర్తిగా త్యజించి, అత్యంత వినమ్రతతో భిక్ష అడుగుతారు.  ఇప్పటికీ ఎంత గొప్పవారయినా ఆ క్షేత్రాలకి వస్తే అలా భిక్షమెత్తుతారంటే అర్ధం భగవంతుని దగ్గర సర్వసంగ పరిత్యాగం చేస్తే  వారి కోరికలు నెరవేరుతాయనే నమ్మకమే.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



0 comments: