Monday, February 1, 2010

సంకటహర చతుర్ధి విశేషమేమిటి? ఎందుకు చేస్తారు?

Monday, February 1, 2010



సాధారణంగా మనం వినాయక చవితి రోజు వినాయకుడికి పూజ చేస్తాం, ఆ రోజు సాయంత్రం చంద్రుణ్ణి చూడకూడదనుకుంటాం.    మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర తెలంగాణావారూ, ఇప్పుడు వారిని చూసో, ఈ పూజా విశేషం వినో ఇంకా కొందరూ, ఈ పూజ చేస్తున్నారు.  ఈ పూజను పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధినాడు చేస్తారు.  ఆ రోజు చంద్ర దర్శనంకూడా చేస్తారు.  అందుకని పౌర్ణమి తర్వాత చంద్రోదయ సమయానికి ఏ రోజు చతుర్ధి తిధి వుంటే ఆ రోజు ఈ వ్రతం చేస్తారు.  అష్టాదశ పురాణాలకి ఉప పురాణాలలో ఒకటయిన గణపతి పురాణంలో ఈ పూజ గురించి వివరించారు. 

ఆ రోజు పొద్దున్నేలేచి తలారా స్నానం చేసి, రోజంతా ఉపవాసముండి, సాయంత్రం సూర్యాస్తమయ సమయాన  గణపతికి అధర్వ శీర్షంతో అభిషేకించి, తుమ్మిపూలు, ఎఱ్ఱని పూలు, జిల్లేడు పూలు, గరికతో పూజచేయాలి.  ఈ పూజ స్తోత్రాలతో కానీ, సహస్రనామంతో కానీ చెయ్యవచ్చు.  కానీ ఆ రోజు అధర్వ శీర్షంతో చేసిన పూజ విశేష ఫలితాలనిస్తుందంటారు.  ఎందకంటే మహా దోషాలను, పాపాలను, అడ్డంకులను తీసేటటువంటి శక్తి ఈ అధర్వ శీర్షానికుంది.  ఏది కోరితే అది లభిస్తుంది.

తర్వాత వినాయకుడికి ఇష్టమయిన అరటి పళ్ళు, టెంకాయ, బెల్లంతో చేసిన పదార్ధాలు నైవేద్యం పెట్టాలి.  పూజంతా అయ్యాక చంద్ర దర్శనం చేయాలి.  తర్వాత ఎవరికైనా బ్రాహ్మణునికి దానం ఇవ్వటంగానీ, భోజనం పెట్టటంగానీ చేశాక, మనం భోజనం చెయ్యాలి.

చాలామంది ఈ ప్రతాన్ని అంగారక చతుర్ధినాడు మొదలు పెట్టి వారి వారి ఇష్టానుసారం ఒక ఏడాది, 40 నెలలు, కొందరయితే జీవితమంతా చేస్తారు.  అంగారక చతుర్ధి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధినాడు మంగళవారం కూడా కలిసి వస్తే ఆ రోజు అంగారక చతుర్ధి అంటారు.  ఈ నెలలో 2వ తారీకు  అంగారక చతుర్ధి వచ్చింది.


కుజ దోషాలు వున్నా, జాతకంలో ఏవైనా గ్రహ దోషాలు వున్నా, తలపెట్టిన పనులు సక్రమంగా కానివారూ, సంతానం లేనివారు ఈ వ్రతం చేస్తే మంచి ఫలితాలు వుంటాయి.  నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతల బాధల తొలుగుతాయి.  అందుకే అనాదినుంచీ చాలామంది ఈ సంకష్ట చతుర్ధి రోజు వినాయకుని పూజిస్తారు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



2 comments:

Anonymous said...

అధర్వ శీర్షం ante emiti andi

psm.lakshmi said...

నాకు తెలిసినంతమటుకూ అధర్వ శీర్షం అంటే అధర్వణ వేదంలో చెప్పబడిన పూజా విధి...శ్రీ సూక్తం, పురుష సూక్తం లాగా. ఇంకా వివరంగా ఎవరైనా చెప్తే నేనూ సంతోషిస్తా.
psmlakshmi