Saturday, December 5, 2009

నిద్ర లేస్తూనే పక్క దిగేముందు భూవందనం చెయ్యాలంటారు. ఎందుకు?

Saturday, December 5, 2009

                                                                                                                                   

 మన సాంప్రదాయం ప్రకారం కన్నతల్లికి, భూదేవికి నిత్యం వందనం చెయ్యాలి.  వీళ్ళ ఋణం మనం తీర్చుకోలేనిది.  కన్నతల్లి 9 నెలలు ఆ తర్వాత నడక నేర్చి,  మన కాళ్లమీద మనం నిలబడేదాకా కొన్నేళ్ళు మనల్ని మోస్తే, భూదేవి మనల్ని మన జీవితాంతం మోస్తోంది.  మనం చచ్చేదాకా భూమి ఆధారంగా లేకుండా మన జీవితం వుందా?  ఒక్కసారి ఆలోచించండి.  మనకి ఇంత ఆధారమైన భూమిని మనం ఎంత హింసిస్తున్నాము.  తొక్కుతాము..  తవ్వుతాము ఇంకా ఎన్నో.  మనం ఏం చేసినా కోపగించకుండా మనకి ఎప్పుడూ ఉపకారమే చేస్తుంది భూమాత.  మనల్ని జీవితాంతం భరిస్తోంది.  అలాంటి భూదేవికి మనం పక్కదిగే ముందు నమస్కరించి దిగటం, మన మనుగడకి ఆధారమైన ఆవిడకి కృతజ్ఞత తెలపటం మన విధి కదా.


ఈ భూదేవికి  మనం కృతజ్ఞతలు తెలిపే విధానాలు ఎన్నో.  నాట్యం చేసేవారు, అమ్మా నా పాదఘాతంతో నిన్ను నొప్పిస్తున్నాను, క్షమించు అని నాట్యం ప్రారంభించే ముందు భూవందనం చేస్తారు.  ఆలాగే పంటలు వేసేటప్పుడు, ఇళ్లు కట్టేటప్పుడు ముందు భూమి పూజ చేస్తాము కదా.  అలాగే మనం ఇంటిముందు చిమ్మి నీళ్ళుజల్లి ముగ్గు వేస్తాముకదా.   అదికూడా భూమి పూజే.  పెద్దలు ఎమి చెప్తారంటే జీవితంలో మనమీద ఆధారపడినవారిని ఆదరించాలి, అలాగే మనం వేటిమీద ఆధారపడి వున్నామో  వాటికి వందనం చెయ్యండి, కృతజ్ఞతలు తెలుపుకోండి.

మన జీవితంలో మనకు అనుకూలంగా వుండేవాటికీ, మనకి మంచి చేసేవాటికీ మనం  శిరస్సు వంచి నమస్కరించాలి, కృతజ్ఞతలు తెలుపుకోవాలి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం కార్యక్రమం ఆధారంగా) 



1 comments:

కంది శంకరయ్య said...

సముద్రవసనే దేవీ పర్వతస్తనమండలే
విష్ణుపత్నీ నమస్తుభ్యం పాదస్పర్షం క్షమస్వ మే.