దేవునికి అభిషేకం చేసిన జలాన్ని పాదోదకం అనీ, జపం చేసినప్పుడు ఉధ్ధరిణతో పక్కన వేసిన జలాన్ని మంత్ర జలమనీ, తీర్ధంగా తీసుకుంటాము. అయితే తీర్ధాన్ని ఎలా తీసుకోవాలి? ఎన్ని సార్లు తీసుకోవాలి?
తీర్ధం తీసుకునేటప్పుడు కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలు కలిపి అరచెయ్యి గుంటలాగా చేసి ఆ చేతి కింద వస్త్రం ఏదైనా పట్టుకుని తీసుకోవాలి. గుళ్ళో తీర్ధం తీసుకుంటున్నట్లయితే నుంచుని తీసుకోవాలి, అదే ఇంట్లో అయితే కూర్చుని తీర్ధం తీసుకోవాలి.
తీర్ధాన్ని “అకాల మృత్యు హరణం, సర్వ వ్యాధి నివారణం, సర్వపాప క్షయకరం, ___________ పాదోదకం పావనం శుభం (డాష్ వున్న చోట మనం ఏ దేవుని పూజా తీర్ధం సేవిస్తున్నామో ఆ దేవుని పేరు చెప్పుకోవాలి)” అని చెబుతూ మూడుసార్లు తీసుకోవాలి. మంత్రంలో వున్నట్లే భగవంతుని పాదోదకమైన ఆ తీర్ధం మొదటిసారి అకాల మృత్యువు లేకుండా చేస్తుందనీ, రెండవసారి సకల రోగాలనూ నివారిస్తుందనీ, మూడవసారి సకల పాపాలనూ నశింప చేస్తుందనీ నమ్మకంతో తీసుకోవాలి. అలాగే మొదటిసారి తీసుకునే తీర్ధం శారీరిక, మానసిక శుధ్ధి కోసం, రెండవసారి తీసుకునేది న్యాయ, ధర్మ ప్రవర్తనకు, మూడవది మోక్షానికి అనే నమ్మకంతో తీసుకోవాలి. శ్రీ విద్యా ఉపాసకులు నాలుగు సార్లు తీసుకుంటారు. అయితే అది అందరికీ వర్తించదు.
ఇంకో విషయం....ఉపవాసం వున్న రోజు ఒక సారే తీర్ధం తీసుకోవాలట. మూడు సార్లు తీసుకుంటే భోజనం చేసినంత శక్తిని భగవంతుడిస్తాడు అంటారు.
చాలామంది తీర్ధం తీసుకున్న తర్వాత ఆ చేతిని తలకి రాసుకుంటారు. అలా రాసుకోకూడదు. ఎందుకంటే ఆ ప్రదేశంలో సహస్రార చక్రం వుంటుంది. పైగా సప్త ఋషి మండల స్ధానం కూడా. అందుకే ఎంగిలి చేత్తో తలమీద రాసుకోకూడదు. లౌకికంగా ఆలోచిస్తే తీర్ధంలో వుండే చక్కెర, పాలు, సుగంధ ద్రవ్యాలకు చీమలు, పురుగులు ఆకర్షింపబడతాయి. అప్పుడు ఇబ్బంది మనకే.
తీర్ధం తీసుకున్న తర్వాత చెయ్యి కడుక్కోగూడదు అని కొందరంటారు అది నిజం కాదు. తీర్ధం తీసుకున్న తర్వాత తప్పనిసరిగా చెయ్యి కడుక్కోవాలి. ఎందుకంటే తీర్ధం పరమ పవిత్రమైన మంత్ర జలం. ఆ తీర్ధం తీసుకున్న చేత్తో ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుని ఆ చేతికంటిన తీర్ధాన్ని అపవిత్రం చెయ్యకూడదు.
తీర్ధంలో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్ర శక్తి వుటాయి. అందుకే తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో, ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యాన్నీ, నా ఆధ్యాత్మికతనూ మెరుగు పరుస్తుందనే సద్భావంతో తీసుకోవాలి.
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)
2 comments:
ఇంట్లోనైనా,గుడిలోనైనా తీర్థం కూర్చునేతీసుకొవాలని చాలా మంది పెద్దలు చెప్పారు..గుళ్ళో నిలుచునే తీసుకోవాలనటానికి ప్రామాణికమేదన్నా ఇవ్వగలరా...
శర్మగారూ,
ఈ పోస్టులు జీ తెలుగు ప్రతిరోజూ ఉదయం 8 గం. కి ప్రసారం చేసే గోపురం అనే కార్యక్రమం ఆధారంగా రాస్తునవి. ప్రతి పోస్టులోనూ ఆ సంగతి చెప్తున్నాను. పొరపాటున దీనిలో మిస్ అయ్యాను. ఇప్పుడు సవరించాను. అయినా గోపురం లేబుల్ వుంది.
ప్రసారమయిన ప్రతి ఒక్కటీ రాయటంలేదు. ఆధునిక భావాలతో నేను అన్వయించుకోగలిగి నాకు కూడా నిజమే సుమా అనిపించేటటువంటివి మాత్రమే రాస్తున్నాను.
మనం ఆలోచిస్తే గుళ్ళో భక్తులు ఎక్కువ వస్తూ వుంటారు. వారందరూ కూర్చుని తీర్ధం తీసుకోవాలంటే కుదిరే పనా? మేమిప్పటిదాకా చాలా ఊళ్ళల్లో చాలా గుళ్ళు చూశాం. ఎక్కడా తీర్ధం కూర్చుని తీసుకోవటం చూడలేదు. కొన్ని వైష్ణవ సాంప్రదాయం కల గుళ్ళల్లో పూజ కాగానే భక్తులనందరినీ వరుసలో కూర్చోమని ప్రసాదం పెట్టేవాళ్ళు. అక్కడా తీర్ధం నిలబడే తీసుకున్నాం.
psmlakshmi
Post a Comment