Wednesday, December 9, 2009

మంగళ, శుక్రవారాలలో డబ్బు ఎవరికీ ఇవ్వకూడదంటారు. నిజమేనా?

Wednesday, December 9, 2009


కొందరు మంగళవారం, శుక్రవారం ఎవరికీ డబ్బు ఇవ్వరు, కొందరు బూజులు కూడా దులపరు, కొందరు పుట్టింటినుంచి ఆడపిల్లని పంపరు.  ఆడపిల్లని ఇంటి లక్ష్మీ దేవిగా భావిస్తారు.  అందుకే లక్ష్మీదేవి వారాలుగా  పూజ చేసే ఆ రెండు రోజులూ డబ్బులివ్వటంగానీ, అమ్మాయిని పంపటంగానీ చెయ్యరు.  తమ ఇంటి సిరి సంపదలు పోతాయనే నమ్మకంతో.  మరి బూజులు దులపక పోవటానికి కూడా ఒక కధ చెప్తారు.  శ్రీ కాళ హస్తీశ్వరుని కధ అందరికీ తెలిసిందే కదా.  శ్రీ అంటే సాలె పురుగు, పాము, ఏనుగు  శివునికి పూజలు చేసి మెప్పిస్తాయి కదూ.  శ్రీ అంటే లక్ష్మి అని కూడా అర్ధం వుంది.  బూజులు, అంటే సాలె పురుగులు కట్టిన గూళ్ళు కదా వాటిని తీసి ఆ శ్రీలకి ఎందుకా రోజుల్లో అపచారం చెయ్యాలని బూజులు దులపరు.

ఇవి పాటించవలసిన విషయాలేనా?  ఇందులో ఎంత మటుకు నిజం వుంది?  బూజుల సంగతి వదిలేద్దాం.  ఎందుకంటే ఆ రెండు రోజులూ కాకపోతే వేరే రోజుల్లో దులుపుకోవచ్చు.  మరి డబ్బుల సంగతేమిటి  జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళవారం డబ్బులు ఇవ్వటం మంచిది.  ఆ రోజుకి మళ్ళీ మళ్ళీ చేయించే గుణం వుందిట.  అందుకే బ్యాక్ ఎక్కౌంటు తెరిచి డబ్బు దాచుకోదలిచారా?  మంగళవారం నాడు చెయ్యండి.  ఆ ఎక్కౌంటు లో మళ్ళీ మళ్ళీ డబ్బు వేస్తూనే వుంటారు.  అలాగే ఎక్కువ అప్పు ఏమైనా వుండి కొద్ది కొద్దిగా తీరుద్దామనుకున్నారా?  మంగళవారం నాడు తీర్చండి.  తొందరలోనే మళ్ళీ మళ్ళీ ఆ అప్పు తీర్చగలుగుతారు, త్వరలో ఋణ విముక్తులవుతారు.

ఫ్రాంతాలవారీగా కూడా ఈ నమ్మకాలు మారుతూ వుంటాయి.  కొందరు మంగళ, శుక్రవారాలు పాటించినట్లు నిజామాబాదు వైపు కొందరు బుధవారం నాడు, విశాఖ పట్టణం వారు గురువారం నాడు డబ్బు ఇవ్వరు.  అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తారు.  అలాగే కొన్ని గ్రామీణ బ్యాంకులు బుధవారం నాడు పని చెయ్యవు.  ఎవరి నమ్మకాలూ, ఆచారాలూ వారివి.

అయితే మనకి వారాల పట్టింపు వుందని  ఏ పని మనిషో నెలంతా పని చేసి ఆ రోజుల్లో డబ్బులడిగితే ఇవ్వటం మానెయ్యకూడదు.  ఎందుకంటే అది వారి డబ్బు.  వారు పని చెయ్యటం వల్ల సంపాదిచుకున్న డబ్బు.  మనం వారికి బాకీ వున్నాము.  దానికి వార వర్జ్యాలు చూడకుండా ఇచ్చెయ్యాలి. 

ఏ రోజైనా ఉదయ, సాయం సంధ్యా సమయాలలోనూ, పూజ చెయ్యగానేనూ సంపదని ఇంటినుంచి పంపకూడదు.  అంటే మనమేదైనా కొనుక్కోవటానికి మూల ధనాన్ని ఖర్చు చెయ్యకూడదు.  కానీ కష్టపడ్డవారికి డబ్బు ఇవ్వటానికి సంశయించ కూడదు.  అందుకే ఏదీ గుడ్డిగా నమ్మక  సమయానుకూలంగా, డబ్బుని ఎప్పుడు ఏ సమయంలో దేనికి వినియోగించాలో అలా వినియోగించాలి.  ఆ ఆలోచన వుంటే ఆర్ధిక ఇబ్బందులే వుండవుకదా.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా) 



3 comments:

కిరణ్ said...
This comment has been removed by the author.
కిరణ్ said...

nice post

రాధిక(నాని ) said...

అవునండి మా ప.గో.జిల్లాలో ఈనమ్మకము ఎక్కువే.శుకృవారము,మంగళవారము ఎవరికీ డబ్బులు ఇవ్వరు. మా అత్తయ్యకైతే మంగళవారము సెంటిమెంటు బాగాఎక్కువ.