Thursday, February 4, 2010

పిల్లలు తుమ్మితే చిరంజీవ అంటారు. ఎందుకు?

Thursday, February 4, 2010


ఏ శాస్త్రం ప్రకారం చూసినా, పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా వుంటుందనే విషయం అందరికీ తెలుసు.  ఆయుర్వేదం శాస్త్రం అందుకే  పిల్లలకి బాలారిష్టాలు ఎక్కువ అంటుంది.. ఈ కారణంగానే కొన్ని ఆసుపత్రులలో  రోగులను చూడటానికి వెళ్ళటానికి  12 సంవత్సరాలలోపు పిల్లలకి ప్రవేశం వుండదు. 

పిల్లలకు వచ్చే దగ్గు, తుమ్ము, వాళ్ళల్లో మొదలయిన ఇన్ఫెక్షన్ కి సంకేతం అంటారు.  మన సాంప్రదాయంలో ఆశీర్వాదానికి చాలా విలువ వుంది.  సకల దోషాలనూ ఈ ఆశీర్వాదం వుపశమింప చేస్తుందనే నమ్మకం వుంది.

పురాణ కధనానుసారం  అల్పాయుష్కుడయిన మార్కండేయుడిని సప్తఋషులు చిరంజీవ అని ఆశీర్వదిస్తారు.  ఆ ఆశీర్వాద బలంతో మార్కండేయుడు శివునికోసం తపస్సుచేసి,  దీర్ఘాయుష్షుని పొందుతాడు.

పెద్దల ఆశీర్వచనాలకి ఎంతో బలం వుంది అని నమ్మే సంస్కృతి మనది.  అందుకే ఇంట్లో ఏ శుభ కార్యం ప్రారంభించినా పెద్దలని గౌరవించి వారి ఆశీర్వాదం తీసుకనే సంప్రదాయం వుంది.

మరి పిల్లలు తుమ్మటం, దగ్గటం, వారి లోపల మొదలయిన అనారోగ్యానికి సంకేతం అని చెప్పుకున్నాం కదా.  సాంప్రదాయాన్నీ, ఆశీర్వచన బలాన్నీ నమ్మే పెద్దలు పిల్లలు తుమ్మగానే చిరంజీవ అని దీవిస్తారు.  పిల్లల అనారోగ్యాలూ, దోషాలూ పోయి కలకాలం హాయిగా, ఆరోగ్యంగా వుండాలని అలా ఆశీర్వదిస్తారు.  అలాగని అవసరాన్నిబట్టి డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళటం మానకూడదండోయ్.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



1 comments:

Anonymous said...

ఇలా ఆశీర్వదించే అలవాటు విదేశాల్లో కూడా ఉందండోయ్! Bless you అంటారు కదా తుమ్మినప్పుడల్లా!నేనుండే స్వీడన్ లో కూడా "Prosit" అంటారు! ఈ పదానికి ఆశీర్వాదం అన్న అర్థం లేదు కాని, భావం అదే!