Wednesday, February 10, 2010

కోపం రోగాల్ని పెంచుతుందా?

Wednesday, February 10, 2010



అవును.  మాటనీ, మనసునీ అదుపులో పెట్టుకోవటంవల్ల ప్రయోజనం చాలావుంటుంది.  అలాగే, తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేనివారికి ఇబ్బందులుకూడా ఎక్కువే.    తామస గుణం వల్ల మానసికి స్ధితి సరిగ్గాలేక హత్యలు కూడా చేస్తారు కొందరు.  అందుకే  కామ, క్రోధ, మద మాత్సర్యాలను అదుపులో వుంచుకోవాలని పెద్దలూ, శాస్త్రాలూ చెబుతున్నాయి.

కోపంలో వున్నవాళ్ళకి ఏం చేస్తున్నరో, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు.  బి పీ పెరుగుతుంది.  ఒక్కోసారి బీపీ విపరీతంగా పెరగటంవల్ల రక్త ప్రసరణ ఎక్కువై, నరాలు చిట్లిపోయి ప్రాణం పోయే ప్రమాదంకూడా వుంది.  రక్త ప్రసరణలో వచ్చే తేడా ప్రభావం  ఆప్టిక్ నెర్వ్ మీద  పడి కళ్ళ జబ్బులు వస్తాయి.  ఎక్కువ టెన్షన్ వల్ల నరాలు అదుపు తప్పి పక్షవాతం, గుండె జబ్బులు రావచ్చు.  మానసిక స్ధితిని అదుపులో పెట్టుకోలేకపోతే కొందరికి హిస్టీరియా రావచ్చు, మతి స్ధిమితం తప్పవచ్చు. 

ఏంటండీ  మనిషన్నాక కోపతాపాలుండవా  అంత మాత్రానికే అంతలా భయపెడుతున్నారు అంటారా?  అందరికీ ఇవ్వన్నీ వస్తాయని కాదండీ.  కోపంలో మనిషి అదుపు తప్పితే ఇవ్వన్నీ వచ్చే అవకాశాలున్నాయి.  అంతేకాదు సామాజికంగా ఆలోచించినాకూడా కోపంలో  మాటా మాటా పెరగవచ్చు.  దానితో తోటివారు శత్రువులు అవ్వచ్చు.    కోపంలో మనిషి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు.  దానితో వ్యాపారంలో నష్టాలు రావచ్చు.

కోపం వచ్చేవారు ముఖ్యంగా మూడు రకాలు.

మొదటి రకంవారు కోపాన్ని ఒక కవచంలాగా వుపయోగించుకుంటారు.  ముఖ్యంగా తమకింద పని చేసేవాళ్ళమీద.  నువ్వీ పని చెయ్యకపోతే నాకు కోపం వస్తుంది, నువ్విలా చెయ్యకపోతే నాక్కోపం వస్తుంది అంటూ బెదిరిస్తూ వుంటారు.  ఇది అలవాటుగా మారితే చీటికీ మాటికీ కోపం వస్తుంది.  దానివల్ల నష్టం వారికే.

ఇంకో రకం వారుంటారు.  వారు ఏది చూసినా ఎక్కువ ఫీల్ అవుతారు.  సినిమా, టీవీ సీరియల్, ఎదుటివారి బాధలూ, ప్రపంచంలో జరిగే సంఘటనలూ...వీరి ఉద్వేగాలను పెంచే కారణాలే.  ఎక్కడ ఏమి జరిగినా అది తమకే జరిగిందని ఫీల్ అవుతారు.

పరిస్ధితులవల్ల కొందరికి కోపం వస్తుంది.  వారు పరిస్ధితుల పట్ల అవగాహన పెంచుకోవాలి.  ఆ స్ధితి ఎందుకు వచ్చింది  పరిష్కారమేమిటి  ఏమి చేస్తే ఆ సమస్య పోతుందో  ఆలోచించాలి.  దూకుడు తగ్గించుకుని,  కొద్దిగా ఆలోచించి పనులు చేసుకుంటే వారు కోపం తగ్గి, ప్రశాంతంగా వుండగలుగుతారు.

ఇన్ని ఇబ్బందులూ, బాధలూ పెడుతుంది కనుకే కోపాన్ని అదుపులో వుంచుకోవాలని శాస్త్రాలు, పెద్దలు, ఇప్పటి డాక్టర్లూ అందరూ చెప్తున్నారు.    ఇప్పుడు ఈ విషయాన్ని చాలామంది గ్రహిస్తున్నారు.  అందుకే తమ కోపాన్ని తగ్గించుకుని, మనసుని అదుపులో వుంచుకుని ఆరోగ్యం కాపాడుకునేందుకు యోగా సెంటర్లలో, లాఫింగ్ క్లబ్బుల్లో చేరుతున్నారు. సంతోషంగా వుండటానికి ప్రయత్నిస్తూ, పరిస్ధితులపట్ల అవగాహన పెంచుకోవటంవల్ల కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు.

ఏ మనిషయినా తనని తాను అదుపులో వుంచుకుంటే, వారు ప్రశాంతంగా, ఆరోగ్యంగా వుండటమే కాకుండా,వారి ఇంట్లోవారు, చుట్టు ప్రక్కలవారూ.  పనిచేసే ప్రదేశంలో వారూ అంతా ప్రశాంతంగా వుండవచ్చు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



మనలో మాట

కో పం వచ్చినప్పుడు మౌనంగా వుండటం వల్ల కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోవచ్చు.  అలాగే అంకెలు లెక్క పెట్టటం కూడా ఒక చిట్కా.  ఆ ప్రదేశంనుంచి అవతలకి వెళ్ళటం, వేరే పనిలో లగ్నం కావటంవల్లకూడా కోపం అదుపులోకి వస్తుంది.

సో, మన తక్షణ కర్తవ్యం...మన కోపాన్ని అదుపులో వుంచుకుని, తద్వారా మనం ఆరోగ్యంగా వుండటమేగాక పరిసరాలనుకూడా ఆరోగ్యంగా వుంచటం

1 comments:

పరిమళం said...

బావుందండీ ...మంచి విషయం రాశారు ! అన్నీ తెలిసినా అప్పుడప్పుడూ అదుపు చేసుకోలేం ప్చ్ ......:(