Sunday, February 21, 2010

ఆత్మ హత్యలు అనర్ధదాయకం కాదా?

Sunday, February 21, 2010



ఈరోజుల్లో సమాజంలో ఎక్కడ చూసినా ఆత్మ హత్యలు చాలా సాధారణం అయిపోయినాయి.  పెళ్ళికాలేదనో, వరకట్న సమస్యలతోనో,  ప్రేమ విఫలమయినదనో యువతీ యువకులు, ఋణాలపాలయి రైతులూ, చేనేత కార్మికులూ,  ఇంకా రాజకీయ కారణాలవల్లా,  ఈ ఆత్మ హత్యలు ఎక్కువయినాయి.  ఇలా ఎందుకు చేసుకుంటున్నారు? 

శాస్త్రం ఏమి చెబుతోంది?  ఆత్మ హత్యలు చేసుకున్నవారు చీము, నెత్తురు పారే మహా నరకంలో పడతారు, చనిపోయిన తర్వాత కూడా నానా యాతనలూ పడతారు అని చెబుతోంది.  (కోరికలు తీరకుండా పోయినవారు పిశాచాలయి తిరుగుతారు అని కూడా అంటారు).  క్రిమి కీటకాలు, పశు పక్ష్యాదులుగా ఎన్నో జన్మల తర్వాత  మానవ జన్మ లభిస్తుంది.  అదీ కర్మభూమిలో.  అలాంటి ఉత్తమమైన జన్మని అంతం చేసుకోవటం సరైన పనేనా?  పురాణ కధలు, చరిత్రలో కధలూ వింటూ వుంటాం.  వాళ్ళకన్నా మనం ఎక్కువ కష్టాలు పడుతున్నామా?    వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు ఆత్మ హత్యలు చేసుకోలేదు.  నిలిచి పోరాడారు.  వారిని ఉదాహరణగా తీసుకుని మన జీవితాలు సరి దిద్దుకోవాలి.

మహా భారతమే తీసుకోండి.  నిండు సభలో ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగింది.  దానికి బాధపడి ద్రౌపది ఆత్మ హత్య చేసుకోలేదు.  తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవటానికి పాండవులను పురికొల్పి, భారత యుధ్ధంలో శత్రువులనందరి నాశనానికి కారణమయింది.

రామాయణంలో శ్రీ రాముడు సీతాదేవిని, నిండు చూలాలిని అడవులకు పంపితే ఆవిడ ఆత్మహత్య చేసుకోలేదు.  రాముడిని దూషించలేదు.  బిడ్డలని ధీరులుగా పెంచి అందరిచేతా అవుననిపించుకుంది.

జాతి పిత గాంధీజీ తెల్లవాళ్ళనుండి ఎన్ని అవమానాలు పొందారు.  వాటికి భయపడి ఆయన ఆత్మ హత్య చేసుకుంటే మన దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చేదో.

వీటన్నిటితో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి?  పరిస్ధితులు బాగుండనప్పుడు సంయమనం పాటించాలి, ఆలోచించాలి.  మన తెలివి తేటలు వుపయోగించాలి, పరిస్ధితులను అవగాహన చేసుకోవాలి.  అవసరమైతే నలుగురితో చర్చించాలి, ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి.  అంతేగానీ పిరికివాళ్ళల్లా ఆత్మహత్య చేసుకోకూడదు.

ఆత్మ హత్యలకి కారణాలు అనేకం.  అయితే  ఆవేశంలో నిర్ణయం తీసుకోకుండా ఒక్క నిముషం ఆలోచించాలి.  అవసరమైతే ఆత్మీయులతో చర్చించాలి.  మానవ జన్మ ఎత్తి, ఇంతకాలం పెరిగామంటే దానికి కారకులయిన మనవారి గురించి ఆలోచించాలి.  వారెంత కష్టపడితే మనమీ స్ధితికి వచ్చామో ఒక్క క్షణం గుర్తుకు తెచ్చుకోవాలి.

సమస్యకి కారణం ఏదైనా దానికి పరిష్కారంకూడా తప్పకుండా వుంటుంది.  ఆ పరిష్కారాన్ని కనుక్కోవాలి,   సమస్యని ఎదుర్కొని  విజయం సాధించాలి.  ధైర్యంగా ముందడుగు వేయాలి తప్ప ఆత్మ హత్యే సమస్యకి పరిష్కారంగా భావించకూడదు..బలవంతాన ప్రాణం తీసుకోకూడదు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



4 comments:

Anonymous said...

ఉత్తర రామాయణం ఒక అబద్ధం.

--తాడేపల్లి

Rao S Lakkaraju said...

ప్రపంచం లో మేరూ నేనే వ్రాసేటప్పుడు చేసేటప్పుడు చూడనివి చాలా ఉన్నాయి. బైబులు ఖురాను మొదలయినవి. అందుకని అవన్నీ అబద్దం అంటం అంత బాగుండదేమో.

psm.lakshmi said...

తాడేపల్లిగారూ
మీరు విజ్ఞులు. మీ మాటలకి వాదించేంత విషయజ్ఞానమున్నదాన్నికాదు. అది నిజమైనా కాకపోయినా స్ఫూర్తిగాతీసుకోవటానికి అభ్యంతరాలేమీ వుండవనుకుంటాను.
psmlakshmi

psm.lakshmi said...

రావుగారూ
ధన్యవాదాలు
psmlakshmi